మన శరీరంలో అత్యంత కీలక భాగం నోరు. అది శుభ్రంగా ఉంటే ఆరోగ్యం ఎప్పుడూ మన వెంటే ఉంటుంది… కానీ, చాలామంది నోటి ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువగా చూపించరు. శరీరంలోని అన్ని అవయవాలతో పోలిస్తే ఎక్కువశాతం నిర్లక్ష్యానికి గురౌతున్నదీ నోరే. ఉదయం పూట పళ్లని శుభ్రం చేసుకోవడం మినహా నోటి ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకునే పరిస్థితిలో చాలామంది లేరు. అందువల్ల నోటి ఆరోగ్యం దెబ్బతిని మిగిలిన శరీరభాగాలకూ రకరకాల సమస్యలు చుట్టుముడతాయి.
ప్రతి ఒక్కరూ ఎన్నో రకాల నోటి సమస్యలను తరచుగా ఎదుర్కొంటూ ఉంటారు. వీటిలో ఎక్కువ శాతం సమస్యలన్నీ తాత్కాలికంగా ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి. కానీ ఇవే దీర్ఘకా లంలో సరిదిద్దుకోలేని నష్టాలను కలిగిస్తాయి. చక్కటి నోటి పరిశుభ్రత ఆరోగ్యానికి ఎన్నో విధాలు సహాయపడుతుంది. నోటిలో వచ్చే మార్పులు భవిష్యత్ లో మనం ఎదుర్కోబోయే తీవ్రమైన జబ్బులకు సంకేతాలు అన్నది పరిశోధకుల మాట. తరచూ నోటిలో వచ్చే పుళ్ళకు అనేక కారణాలు ఉంటాయి. తీవ్రమైన జబ్బులే కాదు… జీర్ణాశయ అల్సర్లు, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఆహారపు అలర్జీల వల్ల కూడా నోట్లో పుండ్లు రావచ్చు.
రోజూ ఉదయాన్నే పళ్ళు తోముకోవడంలో శ్రద్ధ పెట్టకపోతే, నోటిలో బ్యాక్టీరియా పేరుకుపోయి, పళ్ళతో పాటు నోటికి, తద్వారా శరీరానికి అనారోగ్యాలు తీసుకొస్తుంది. నోటికి వచ్చే ఏ సమస్య అయినా…సమస్య దేనికి సంబంధించింది అనే విషయం మీద దృష్టి పెట్టం. ఇలాంటి వాటి వల్ల భవిష్యత్ లో అనేక ఇతర సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అందుకే నోటికి వచ్చింది ఎంత చిన్న సమస్య అయినా వెంటనే వైద్యుని సంప్రదించడం తప్పనిసరి. నోరు ఆరోగ్యంగా ఉంటే చాలు శరీరం మొత్తం ఆరోగ్యం ఉన్నట్టే. అందుకే నోటి ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి.
నోటి సమస్యలకు కారణాలు ఏంటి ?
ఆహారపు అలవాట్లు, వ్యసనాలు నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఫలితంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక నోటి సమస్యను ఎదుర్కొంటూనే ఉంటారు. సరిగ్గా బ్రష్ చేసుకోక పోవడం వల్ల చిగుళ్ళ వాపు సమస్యలు మొదలౌతాయి. నోట్లో చిగుళ్ళ చుట్టూ పాచి పేరుకుపోయి, చిగుళ్ళు వాయడం, ఎర్రబడడం, రక్తం కారడం లాంటివి మొదలౌతాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే, దంతాల నుంచి ఎముకలకు వ్యాపించి… పట్టు కోల్పోతుంది. ప్రారంభంలో ఈ సమస్య గుర్తించి చికిత్స తీసుకోవడం వల్ల ప్రమాదాన్ని అరికట్టవచ్చు. ఇక రక్తహీనత, బీ కాంప్లెక్స్ విటమిన్ లోపాల వల్ల నోటి పూత, నోటిలో అల్సర్లు లాంటి సమస్యలు ఏర్పడతాయి. కొన్ని రకాల నాలుక పుళ్ళు క్యాన్సర్, టి.బి లాంటి వ్యాధి లక్షణాలు కావచ్చు. అందుకే 10 రోజులకు మించి నోటి పుళ్ళు ఉన్నప్పుడు కచ్చితంగా వైద్యుని సంప్రదించి రుజువు చేసుకోవాలి. ఏ సమస్య వచ్చినా వీలైనంత త్వరగా వైద్యుని సంప్రదించడం తప్పనిసరి.
నోటి ఆరోగ్యానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
క్యాన్సర్లలో 30 శాతం నోటికి సంబంధించినవే. వీటిలో 20 శాతం వంశపారంపర్యంగా వచ్చేవి కాగా, 80 శాతం దురలవాట్ల వల్ల వచ్చేవి. పొగాకు నమలడం, గుట్కా తినడం, పొగ తాగడం, పాన్ నమలడం లాంటి అలవాట్లు దీర్ఘకాలంలో నోటి క్యాన్సర్ కు దారి తీస్తాయి. నోటి అల్సర్ తో మొదలయ్యే ఈ సమస్య క్యాన్సర్ కు దారి తీస్తుంది. అందుకే ఇలాంటి సమస్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. ఓరల్ హెల్త్ కోసం కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పని సరి. రోజుకు కనీసం రెండు సార్లు బ్రష్ చేయాలి. 6 నెలలకు ఓ సారి ఓరల్ చెకప్ చేయించుకోవాలి. ప్రతి రెండేళ్ళకు పళ్ళ మీద గారను తొలగించుకోవాలి. దంతాల చుట్టూ అంటుకుపోయే కేకులు, స్వీట్లు, చాక్లెట్లు లాంటి తిన కూడదు. ఒక వేళ తిన్నా, వెంటనే నోటిని శుభ్రపరచుకోవాలి. టీ, కాఫీల వంటివి అలవాటు ఉన్న వారు, వాటిని సేవించిన వెంటనే నోరు శుభ్ర పరచుకోవాలి. రోజూ బ్రష్ చేసుకోవడంతో పాటు ఫ్లాసింగ్ చేస్తూ ఉండడం వల్ల సమస్య చాలా వరకూ తగ్గుతుంది. కొన్ని రకాల కూరగాయలు, పండ్ల వల్ల కూడా నోటి ఆరోగ్యం మెరుగు అవుతుంది. పళ్ళు కావచ్చు, నోరు కావచ్చు… ఏ మాత్రం చిన్న సమస్య అనిపించినా సరే వెంటనే వైద్యుని సంప్రదించి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం లేదా చికిత్స పొందడం కచ్చితంగా చేయాలి.
నోటి శుభ్రత అన్నది దంత సమస్యలు రాకుండా ఉండటం కోసమే కాదు.. ఒంట్లో ఇతరత్రా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండటానికి కూడా కీలకమే అని గుర్తుంచుకోవాలి.