Paralysis : ప‌క్ష‌వాతం రావడానికి కారణాలు ఏంటి.. రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

By manavaradhi.com

Published on:

Follow Us

పక్షవాతం వచ్చిన వ్యక్తికి శరీరంలోని అవయవాలు పనిచేయకుండా పోతాయి. మెదడులోని ఓ ప్రాంతానికి రక్తాన్ని చేర్చే నాళాలు మూసుకుపోవడంతో ‘స్ట్రోక్’ వస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా పక్షవాతానికి దూరం కావచ్చంటున్నారు వైద్య నిపుణులు.

పక్షవాతం శరీరంలోని అవయవాలను పనిచేయకుండా చేస్తుంది. పక్షవాతం చాలా ప్రమాదకరమైన జబ్బు. ఇది వచ్చిన ప్రతి ముగ్గురిలో ఒకరు శాశ్వతంగా అంగవైకల్యం బారిన పడుతున్నారు. ఏదైనా కణం దెబ్బతిన్నా లేదా చనిపోయినా ఆ కణం స్థానంలో కొత్త కణాలు పెరిగే అవకాశం ఉంది. కానీ మెదడు కణాలు ఒకసారి నశించాయంటే ఆ నష్టం శాశ్వతంగా ఉంటుంది. అందుకే పక్షవాతం వచ్చి, కాళ్లూ చేతులు చచ్చుబడిపోతే అవి సాధారణ స్థితికి రావడం దాదాపు అసంభవమే అని చెప్పాలి. అందుకే పక్షవాతం లక్షణాలు కనిపించగానే రోగిని వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలి. పక్షవాతంలోని లక్షణాలు మెదడులో రక్తసరఫరా ఆగిన చోటుపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు మెదడులోని కాళ్లూ, చేతులను నియంత్రించే భాగాలకు రక్తసరఫరా ఆగితే ఆ భాగాలు చచ్చుబడతాయి. దీనివల్ల మాట పడిపోవడం, స్థిమితంగా నిలవలేకపోవడం, చూపుకోల్పోవడం, స్పృహకోల్పోవడం కూడా జరగవచ్చు.

గతంలో ఒక వయసు దాటినవారు పక్షవాతానికి గురయ్యేవారు. కానీ ఇప్పుడు యుక్తవయసులోని వారు కూడా దీని బారిన పడుతున్నారు. మారుతున్న జీవనశైలి, జన్యుపరమైన అంశాలు ఇందుకు కారణం. అంతేకాదు … పక్షవాతానికి కారణాలు అనేకం. మన శరీరంలోని ప్రతి అవయవానికీ రక్తం నిరంతరం సరఫరా అవుతుండాలి. ఇక మెదడు విషయంలోనైతే అది మరింత అవసరం. ఏదైనా కారణం వల్ల మెదడుకు రక్తసరఫరాలో అంతరాయం కలిగితే వెంటనే అక్కడి కణాలు మరణించడం జరుగుతుంటుంది. రక్తసరఫరాలో అంతరాయానికి ప్రధానంగా రెండు రకాల కారణాలున్నాయి. మొదటిది… రక్తనాళాల్లో ఎక్కడైనా రక్తం గడ్డకట్టి అది ప్రవాహానికి అడ్డుపడటం. దాదాపు 80 శాతం పక్షవాతం కేసుల్లో ఇదే కారణం. ఇక ఒక్కోసారి రక్తనాళాలు చిట్లడం వల్ల రక్తం బయటకు ప్రవహించడంతో మెదడులోని కొన్ని కణాలకు రక్తసరఫరా అందకపోవడం. దాదాపు 20 శాతం కేసుల్లో పక్షవాతానికి ఈ కండిషన్ కారణమవుతుంది. ఈ రెండిట్లో ఏది జరిగినా మెదడులోని ఆ రక్తనాళాలు సరఫరా చేసే భాగానికి తగినపోషకాలు, ఆక్సిజన్ అందక ఆ ప్రాంతంలోని కణాలు నశిస్తాయి. దాంతో అవి నియంత్రించే శరీర భాగాలు చచ్చుబడిపోతాయి.

మెదడులోని ఓ ప్రాంతానికి రక్తాన్ని చేర్చే నాళాలు మూసుకుపోవడంతో ‘స్ట్రోక్’ వస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా పక్షవాతానికి దూరం కావచ్చంటున్నారు వైద్య నిపుణులు. తీసుకునే ఆహారం శరీరానికి ఆరోగ్యాన్ని కలిగించేదిగా ఉండాలి. ఎక్కువ పండ్లు, కూరగాయలు, ఉప్పు తక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి. కొవ్వును కలిగించే వాటికి దూరంగా ఉండాలి. బరువు పెరగకుండా జాగ్రత్త పడాలి. బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) అదుపు తప్పుతుందంటే, స్ట్రోక్ కు దగ్గరవుతున్నట్టే. కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రజర్ స్థాయి ఎప్పుడూ నియంత్రణలో ఉండాలి. బీపీ 120/80 ఉండేలా చూసుకోవాలి. మద్యపానం, ధూమపానంకు దూరంగా ఉండాలి. ఈ రెండూ స్ట్రోక్ ను శరవేగంగా దగ్గర చేస్తాయి. శరీరానికి చాలినంత విశ్రాంతిని ఇవ్వాలి. ఇందుకోసం అలసట తీరేంతగా నిద్ర పోతే సరిపోతుంది.ఇలా అలవాట్లను మార్చుకోవడం, దురలవాట్లకు దూరం కావడంతో పాటు మానసికంగా ఆహ్లాదంగా ఉంటే ఈ ప్రాణాంతక ‘స్ట్రోక్’ దరిచేరదు.

Leave a Comment