సంపూర్ణ అరోగ్యంగా ఉండాలంటే .. సమతుల పోషకాలు ఉన్న ఆహారం రోజూ తీసుకోవాలి. ఐతే ఇందుకు తాజా కూరగాయలకు మించిన ఆహారం మరొకటి లేదు. కూరగాయల్లో అన్ని రకాల పుష్కలంగా లభిస్తాయి. విటమిన్లు , ఖనిజలవణాలు , ప్రొటీన్లు .. ఇలా శరీరానికి కావాల్సిన అన్నిరకాల పోషకాలు అందుతాయి. ఐతే ఏ ఏ రకాల కూరగాయల్లో ఏ ఏ పోషకాలు అందుతాయో .. మన శరీరానికి అవి ఎలా ఉపయోగపడతాయో సవివరంగా తెలుసుకుందాం..!
కూరగాయలు.. ! సమతుల పోషకాలకు కేరాఫ్ అడ్రస్ లాంటివి. ఆరోగ్యానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఇందులో మెండుగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే .. తాజా కూరగాయలను .. న్యూట్రిషన్లకు పవర్ హౌజ్ గా చెప్పవచ్చు. మరి అలాంటి కూరగాయలను రోజూ మెనూలో చేర్చుకుంటే .. తప్పనిసరిగా శరీరానికి కావాల్సిన అన్ని రకాల విటమిన్లు, ఖనిజ లవణాలు , యాంటీఆక్సిడెంట్స్ , ప్రొటీన్లు లభిస్తాయి. ఫలితంగా ఆరోగ్యంగా .. ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల రోగాలు కూడా దగ్గరి చేరవు.
కూరగాయల్లో రంగులను బట్టి వాటిలో పోషకాలు అధారపడి ఉంటాయి. ముఖ్యంగా కూరగాయలు అనగానే … పచ్చని వాటిని అందరూ ఎంచుకుంటారు. ఆకుపచ్చవే కాకుండా . ఎరుపు, తెలుపు సహా ఇతర రంగుల్లోనూ కూరగాయలు ఉంటాయి. అలాగే ఆకుకూరలు,కూరగాయలు, దుంపకూరలు అని మూడు రకాలుగా ఉంటాయి. ఐతే వేటికవే ప్రత్యేకమైనవని చెప్పవచ్చు. బీట్ రూట్ లాంటి దుంపకూరలు విటమిన్ K కు ప్రసిద్ధం. ఇవి తరచుగా తీసుకుంటే టైప్ -2 మధుమేహం వచ్చే అవకాశం లేదు. అలాగే బీట్ రూట్స్ నుంచి నైట్రేట్ ఎక్కువగా లభిస్తుంది. ఇది రక్తపోటు నివారణలో ఉపయోగపడుతుంది. అంతే కాదు .. బీట్ రూట్ లో పీచు పదార్థం కూడా అధికమే. దీనివల్ల జీర్ణక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇందులో ఆంథోసయనిన్ , యాంటీ ఆక్ష్సిడెంట్ లు ఉన్నందువల్ల క్యాన్సర్ తో పోరాడుతుంది.
విటమిన్ C, విటమిన్ E కోసం ముల్లంగి, క్యాబేజీలు, కాలే, కాలిఫ్లవర్ లాంటివి తీసుకోవచ్చు. క్యాన్సర్ కు దారితీసే కణజాలాన్ని విటమిన్ E నాశనం చేస్తుంది. స్త్రీలకు, పురుషులకు రోజూ 15 మిల్లీగ్రాముల విటమిన్ E అవసరం ఉంటుంది. అలాగే విటమిన్ C… శరీర రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. గాయాలను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. మహిళలకు 75 మిల్లీ గ్రాములు, పురుషులకు 90 మిల్లీగ్రాముల వరకు రోజూ విటమిన్ C అవసరం ఉంటుంది. కాలే క్యాబేజీ, కాలిఫ్లవర్ వంటి వాటిల్లోనే కాకుండా నిమ్మజాతి పండ్లు, జామ, కివీలు, రెడ్ పెప్పర్స్, బ్రొకోలి, టొమాటో, పచ్చి మామిడి, దోసకాయ, మొలకెత్తిన గింజల్లో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది.

టొమాటోలు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. వాటి నుంచి లైకోపిన్, బీటా కెరోటిన్ థయమిన్, నియాసిన్, తిమనిన్ C, విటమిన్ B6, మెగ్నీషియం, పాస్ఫరస్, పొటాషియం, కాపర్ ని కూడా అందిస్తాయి. అంతే కాదు పీచు పదార్థం కూడా టొమాటో నుంచి లభిస్తుంది. టొమాటోల్లో లభించే లైకోపిన్ గుండె సమస్యల నివారణకు దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. ఇది బోన్ మాస్ ను మెరుగుపరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతే కాదు .. సర్వైకల్ క్యాన్సర్ , ప్రొస్టేట్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్ లకు వ్యతిరేకంగా లైకోపియం పోరాడుతుంది. టమోటాల్లో లభించే యాంటీఆక్సిడెంట్లు కణాల హానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్ తో పోరాడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి వారంలో కనీసం మూడు రోజులైనా టొమాటోలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు.

ఆకుపచ్చని ఆకు కూరలు విటమిన్లకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పవచ్చు. ఇందులో నుంచి వివిధ రకాల విటమిన్లే కాకుండా ఐరన్ అంటే కూడా ఎక్కువగా లభిస్తుంది. ఫలితంగా రక్తంలో హీమోగ్లోబిన్ వృద్ధి చెందుతుంది. గర్భిణులు, పిల్లలు, మహిళలు, రక్తహీనత ఎదుర్కునే వృద్ధులు క్రమం తప్పకుండా అన్ని రకాల ఆకుకూరలు తీసుకుంటే మంచిది. అలాగే ఆకు కూరల ద్వారా లభించే పీచు పదార్థం మలబద్థకం సమస్యను దూరం చేస్తుంది. ప్రేవులను శుభ్రంగా ఉంచుతుంది. గోంగూర, బచ్చలికూర, పాలకూర, మెంతికూర , తోటకూర లాంటివి రోజూ తినడం అలవాటు చేసుకుంటే సమతుల పోషకాలు లభిస్తాయి.







