Sensitive Skin Care Tips: మీ చర్మం సున్నితంగా ఉందా.. ఈ ముఖ్య విషయాలను గుర్తుంచుకోండి.. !

By manavaradhi.com

Published on:

Follow Us
Sensitive Skin Care Tips

సున్నితమైన చర్మం.. వాతావరణ పరిస్థితులకు, అలర్జీలకు లేదా పడని చర్మ సౌందర్య ఉత్పత్తులకు త్వరగా రియాక్ట్ అవుతుంది. దీంతో చర్మం ఎరుపెక్కడం,దురదతో బాధపడడం, ఎగ్జిమా లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సున్నితమైన చర్మం ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వీరు ఎక్కువసేపు స్నానం చేయకూడదు. ఎందుకంటే ఎక్కువ సేపు స్నానం చేయడం వల్ల వారి చర్మంపై ఉండే సహజ నూనెలు నీటితోపాటు వెళ్లిపోతాయి. ఫలితంగా స్కిన్ డ్రైగా మారి పగుళ్లు ఏర్పడుతాయి. దీంతో చికాకుకు దారితీస్తుంది. అందుకే సున్నితమైన చర్మం ఉన్న వారు త్వరగా స్నానం ముగించాలని వైద్యులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా సౌందర్య ఉత్పత్తులను కొనేటప్పుడు వాటి మీద ఉండే లేబుళ్ళను తప్పనిసరిగా చదవాలి. అవి చర్మానికి మేలు చేస్తాయా? లేదా అనేది గుర్తించాలి. కొన్ని సమయాల్లో చిన్నశాంపిల్స్ తీసుకుని పరీక్ష చేయడం కూడా మంచిదే. అందువల్ల చర్మ సమస్యలు ఉన్నప్పుడు కొన్ని రకాల పదార్థాలు అధిక రసాయనాల కారణంగా చర్మాన్ని పాడు చేసే అవకాశం ఉంది. అందుకే ఇటువంటి రసాయనాల విషయంలో లేబుల్స్ స్పష్టంగా చదవాలి. గాఢ రసాయనాలను వాడేటప్పుడు కచ్చితంగా చేతులకు తొడుగులు ధరించి ఉపయోగిస్తే మంచిది. సౌందర్య ఉత్పత్తులే కాదు.. బట్టల కొనుగోలులోనూ జాగ్రత్తలు పాటించాలి. ఉన్నితోపాటు, రఫ్ ఫ్యాబ్రిక్స్ కలిగిన వస్త్రాలు చర్మంపై అలర్జీ కలిగించవచ్చు. అందుకే మంచి కాటన్ లేదా సిల్క్ వస్ర్తాలను ఎంచుకోవాలి

సున్నితమైన చర్మం ఉన్నవారు సంవత్సరం పొడవునా సన్ స్క్రీన్ లోషన్ వాడుకోవడం మేలు చేస్తుంది. అలాగే డ్రై స్కిన్ ఉన్నవారు ఇరిటేషన్ నుంచి రక్షించుకోవడానికి మాయిశ్చరైజ్ చేసుకోవాలి. మార్కెట్లో మాయిశ్చరైజింగ్ క్రీములు చాలా లభిస్తాయి. వాటిలో తమ చర్మానికి సరిపడే ఉత్పత్తిని ఎంచుకోవాలి. కొందరు శరీర భాగాలను బాగా శుభ్రం చేయాలనే ఆలోచనతో ఇష్టం వచ్చినట్లు సబ్బులు రుద్దేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి వాటి విషయంలో యాంటీ బ్యాక్టీరియల్ పదార్థాలు వాడడం కూడా మంచిది కాదు. సాధారణ నీటితో పరిశుభ్రం చేయడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పటికే చర్మ సమస్యలైనా ఉంటే కొత్తగా ఏదైనా క్రీము లేదా సబ్బును పరీక్ష చేయాలి. 72 గంటల వరకు ఏవిధమైన సమస్యలు లేనప్పుడు వాటిని వాడవచ్చు.

లోహాలతో తయారైన వస్తువులు చర్మాన్ని తాకినప్పుడు అందులోని నికెల్ శరీరాన్ని ఇబ్బంది పెట్టుకుండా జాగ్రత్త పడాలి. ధూమపాన ప్రియులకు చర్మ సమస్యలు అధికమని పరిశోధనలు చెబుతున్నాయి. చర్మసమస్యలు ఉన్నవారు ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి. చర్మం మీద ఎప్పుడూ తేమ ఉండేలా జాగ్రత్తపడాలి. ఇందు కోసం చర్మం తడిగా ఉన్నప్పుడే లేపనాలు పూసుకోవాలి. ఒక్కోసారి ఒత్తిడి కూడా చర్మం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. రక్త ప్రసరణలో జరిగే మార్పుల వల్ల చర్మం బయట, లోపల సమస్యలు రావచ్చు. అందుకే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మంచి నిద్ర, వ్యాయామం, సరైన ఆహారం తప్పనిసరి. చర్మం విషయంలో అందం కోసం కంటే ఆరోగ్యం మీద దృష్టి పెడితే ఎంతో మేలు జరుగుతుంది.

Leave a Comment