Don’t Skip Breakfast : ఉదయాన్నే టిఫిన్ చేయని వారికి హెచ్చరిక

By manavaradhi.com

Published on:

Follow Us
Don't Skip Breakfast

మనలో చాలా మంది ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌ చేసే విషయంలో చాలా బద్ధకంగా ఉంటారు. ఒకేసారి భోజనం చేద్దాంలే అనుకుంటూ కొందరు ఉదయాన్నే అల్పాహారం మానేస్తే, మధ్యాహ్నం కాస్త ఎక్కువ తినొచ్చని మరి కొందరు మానేస్తారు. ఉదయం అల్పాహారం తీసుకోని వారిలో గుండె సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అంటున్నారు వైద్యనిపుణులు.

రోజూ అల్పాహారం తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయాన్నే మనం తీసుకునే అల్పాహారం రోజును ప్రారంభించేందుకు కావలసిన శక్తిని అందిస్తుంది. బలాన్ని ఇస్తుంది. ఆరోగ్యకరమైన విధానంలో బరువును కాపాడుకునే దిశగా సాయం చేస్తుంది. రాత్రంతా నిద్రపోయి, ఉదయాన్నే లేచిన తర్వాత పొట్టంతా ఖాళీగా ఉంటుంది. ఈ సమయంలో కాస్తంత అల్పాహారం తీసుకోవడం వల్ల శరీరానికి సాంత్వన లభిస్తుంది. రోజు మొత్తానికి కావలసిన శక్తిలో 30 శాతం బ్రేక్ ఫాస్ట్ వల్లనే లభిస్తుంది. అందులో నాణ్యమైన మాంసకృత్తులు ఉంటే మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. ఇలాంటి అల్పాహారానికి దూరం కావడం వల్ల హృద్రోగాల బారిన పడే ప్రమాదం అధికంగా ఉందని పరిశోధకులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. అల్పాహారం తీసుకోని వారిలో ధమనులు కుచించుకుపోవడం, రక్తనాళాలు గట్టిపడడం వలంటి ముప్పులు ఏర్పడుతున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. అలా కాకుండా పోషకాలతో కూడిన బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల సరైన ఆరోగ్యంతో పాటు గుండెను కాపాడుకోవచ్చు.

ఉదయం అల్పాహారం తీసుకోనివారిలో బాడీ మెటబాలిక్ రేట్ తగ్గిపోతుంది. అంతేకాదు జీర్ణక్రియ సక్రమంగా జరగక, శరీరంలో కొవ్వు నిల్వలు పెరుగుతాయి. ఫలితంగా శరీరంలో చురుకుదనం తగ్గిపోతుంది. ఉదయాన్నే అల్పాహరం వదలి నేరుగా భోజనం తీసుకునే వారికి ఊబకాయం వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ. ఇది హృద్రోగాలకు దారి తీస్తుంది. దినచర్య ప్రారంభించడానికి కావలసిన శక్తిని అందుకోవాలన్నా, లేదా ఉల్లాసంగా, ఉత్సాహంగా పనులు సక్రమంగా పూర్తి చేయాలన్నా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం తప్పనిసరి. అలాగని ఏదో తీసుకున్నాంలే అనుకోవడం కాదు. చక్కని పోషకాలు ఉండేలా అల్పాహారాన్ని తీసుకోవాలి. మంచి నీటిని ఉదయాన్నే అధికంగా తీసుకోవడం వల్ల ఏకాగ్రత కుదురుతుంది. అలాగే అల్ఫాహరం వల్ల మిగతా రోజంతా ఆకలి తగ్గి, జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండవచ్చు. ఫలితంగా అధిక బరువు నియంత్రణలో ఉంటుంది. ఎనర్జీ లెవల్స్ ఎక్కువగా ఉండడం వల్ల శారీరక శ్రమ చేయడానికి కావలసిన శక్తి లభిస్తుంది. ఫలితంగా కొలెస్ట్రాల్ తగ్గి గుండె జబ్బులు దరి చేరనీయకుండా చూసుకోవచ్చు. దీనికి తోడు ఏకాగ్రత పెరగడం వల్ల పనిలో ఒత్తిడి తగ్గి, అటు నుంచి కూడా గుండె జబ్బులు రాకుండా అల్పాహారం కాపాడుతుంది.

ఉదయాన్నే తీసుకునే అల్పాహారం విషయంలో కొన్ని నియమాలు పాటించడం ద్వారా గుండె జబ్బులు రాకుండా కాపాడుకోవడం సాధ్యమౌతుంది. ముఖ్యంగా అల్పాహారంలో ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్లు ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే గాక, మధుమేహం నుంచి కూడా రక్షణ పొందవచ్చు. అలాగే ఉదయాన్నే అల్పాహారంలో నూనెను తగ్గించడం తప్పనిసరి. ఇందు కోసం పూరీల కంటే తక్కువ నూనె వేసిన చపాతీల మీద దృష్టి పెట్టడం లాంటివి చేస్తూ ఉండాలి. గుండెకు అనారోగ్యాలు కలిగించని నూనెలు వాడాలి. ఆహారంతో పాటు పండ్లు లాంటివి తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. కాఫీలు, పండ్ల రసాలతో ఉదయాన్ని గడిపేయకుండా సరైన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని, గుండెను ఏకకాలంలో కాపాడుకునే అవకాశం ఉంటుంది.

ఉదయాన్నే చేసే బ్రేక్‌ఫాస్ట్‌ని మరచిపోయినా, అసలు చేయకపోయినా గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు హార్వర్డ్‌ పరిశోధకులు. అల్పాహారం తీసుకోని వారిలో అధికబరువు, ఒత్తిడి ఎక్కువగా ఉండడాన్ని వీరు గమనించారు. కాబట్టి మీరు ప్రతిరోజు తగిన మోతాదులో అల్పాహారం తీసుకోండి ఆరోగ్యంగా జీవించండి.

Leave a Comment