మనం తిన్న ఆహారం జీర్ణం కావాలన్నా… మనం హాయిగా ఉండాలన్నా .. మనం తిన్న ఆహారం శరీరానికి ఎలాంటి ఇబ్బందిని కలిగించకూడదు. చక్కగా అరిగిపోవాలి. తిన్నది ఒంటబట్టి శక్తిని ఇవ్వాలి. కాని కొన్ని సందర్భాల్లో మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాకా… ఇబ్బంది పడటం, లేదా అవసరానికి మించి తిని కడుపు నొప్పితో పాట్లు పడటం….ఎప్పుడో ఒకసారి మనమంతా ఎదుర్కొనే సమస్య. మరి ఇలాంటప్పుడు పొట్టని హాయిగా ఉంచుకోవాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి.
పొట్ట తరచుగా ఇలా ఇబ్బంది పెడుతుంటే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని రకాల ఆహారాలు పరిస్థితికి కాస్త ఉపశమనంగా ఉంటే కొన్ని రకాలు మరింత తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. వీటి గురించి అవగాహన ఉంటే మంచిది. పార్టీలు వీకెండ్స్ లో ఎక్కువగా తినేయటం, సరిపడని ఆహారాన్ని తినటం వల్ల కడుపు నొప్పి లాంటి సమస్య రావచ్చు. అలాటప్పుడు కొన్ని ఆహారాలు మనకు ఎంతో చక్కగా ఉపశమనాన్ని కలిగిస్తాయి.
- అరటిపండుని జీర్ణవ్యవస్థకి మేలు చేసే ఆహారాల్లో మొదటగా చెప్పుకోవాలి. ఇందులో ఉన్న ఎలక్ట్రోలైట్స్ మన జీర్ణవ్యవస్థని తిరిగి మామూలు స్థితికి చేరుస్తాయి.
- యాపిల్ సాస్ని లేదా యాపిల్ ని తీసుకుంటే మంచిది. అలాగే ఇది మలబద్దకానికి కూడా పనిచేయటం విశేషం.
- అల్లం టీతో కూడా జీర్ణవ్యవస్థలో బాధలు సర్దుకుంటాయి.
- బంగాళ దుంపల్లో ఉన్న పొటాషియం కడుపుకి హాయిని ఇస్తుంది. పొటాషియం మన శరీరంలో ద్రవాలను సమతౌల్యంలో ఉంచుతుంది. నరాలు కండరాలు సవ్యంగా పనిచేసేలా చేస్తుంది.
- హెర్బల్ టీలు కూడా పొట్ట ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మరీ ఇబ్బందిగా ఉన్నపుడు ద్రవ ఆహారాలు మేలు.
- మంచినీళ్లు పళ్లరసాలు, సూపులు లాంటివి తీసుకోవచ్చు.
- గది టెంపరేచరులో ద్రవరూపంలో ఉండేవి మాత్రమే వాడమని నిపుణులు చెబుతున్నారు.
- అరటి పళ్లలోలాగానే కొబ్బరినీళ్లలోనూ ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి కూడా పొట్ట ఇబ్బందులను తగ్గిస్తాయి.
కడుపు నొప్పి గా ఉన్నప్పుడు కొన్ని ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ముఖ్యంగా రిఫైన్డ్ పంచదారతో తయారయిన పదార్థాలను మొదటగా చెప్పుకోవాలి. ఇవి రక్తంలో షుగర్ శాతంలో మార్పు తెస్తాయి. నేరుగా కాకపోయినా ఈ పరిస్థితి వలన పొట్టలో ఇబ్బందులు వస్తాయి. చాలామందిలో పాల ఉత్పత్తులు జీర్ణమయ్యేందుకు ఉపయోగపడే ఎంజైమ్ ఉండదు. దీంతో సమస్యలు పెరగవచ్చు. అయితే ఏ మాత్రం ఫ్యాట్ లేని పెరుగుని మాత్రం తీసుకోవచ్చు.
చాలామంది అన్నం అరగనప్పుడు పుల్లని త్రేన్సులు వస్తున్నపుడు సోడా తాగుతుంటారు. ఇందులో ఉండే రసాయనాలు పొట్టకు అంత మేలు చేయవని నిపుణులు చెబుతున్నారు. ఇక కడుపులో బాగోనప్పుడు చాక్లేట్, కాఫీల జోలికి పోకపోవడమే మంచిది. కడుపులో బాగోనప్పుడు మసాలాలు తీసుకోకూడదు. మసాలాలను నూనెలతో కలిపి వండటం వల్లనే పొట్టకు ఇబ్బందులు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు.
కడుపు బాధిస్తున్న సమయాల్లో ఏది తినాలన్నా మనసొప్పదు. అలాగే కొందరిలో ఏది తిన్నా బయటకు వచ్చేస్తుంది. కొబ్బరి బోండాం నీరు వంటి పొటాషియం, కాల్షియం, సోడియం ఎక్కువగా లభించే ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలి. త్వరగా జీర్ణమవడమే కాకుండా పెద్దమొత్తంలో పొటాషియం లభించే అరటిపండ్లు కడుపునొప్పి సమయంలో ఎక్కువగా తీసుకోవడం అత్యుత్తమం. అధిక ఫైబర్ కలిగిన వైట్ బ్రెడ్ టోస్ట్ తినాలి.
24 గంటలకన్నా ఎక్కువ సమయం డయేరియాతో బాధపడుతుంటే పండ్లు, కూరగాయాలు తీసుకోవాలి. ఆయిల్, ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఫ్రైడ్ ఆహారాన్ని దూరంగా పెట్టాలి. జీర్ణవ్యవస్థపై తక్షణ ప్రభావం చూపే సోడాలను తీసుకోవద్దు. మసాలాలు, కారం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోకూడదు. పచ్చి కూరగాయలు తినడం మానుకోవాలి. ఆహారాన్ని ప్రశాంతంగా నమిలి మింగాలి. కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తినాలి. చూయింగ్ గమ్ వాడకూడదు. దీనివలన నోటిద్వారా గాలి మరింతగా వెళ్లి పొట్టకు ఇబ్బంది పెడుతుంది.
కడుపు నొప్పి కనిపించగానే గాబరా పడిపోకుండా ఎందుకు వస్తుందో గుర్తించాలి. అందుకు అనుగుణంగా జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి.పొట్టలో ఇబ్బందులు ఉన్నపుడు ఎలాంటి హాని చేయని, గ్యాస్ పెంచని , వాపు గుణాలు లేని ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా జీర్ణక్రియకి మేలు చేసే మంచి బ్యాక్టీరియా ఉన్న ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి.