Heart Risk in Winter: చలికాలంలో గుండెపోటు ప్రమాదం.. ఇలా నివారించుకోవచ్చు..!

By manavaradhi.com

Published on:

Follow Us
Heart Risk in Winter

మనం ఆరోగ్యంగా ఉండాలంటే గుండె పనితీరు మెరుగ్గా ఉండటం ఎంతో అవసరం. గుండె ఎంత ఆరోగ్యంగా ఉంటే మనిషి అంత ఎక్కువ కాలం జీవించగలడు. మానవ జీవిత కాలాన్ని గుండె నిర్ణయిస్తుంది. చలి కాలంలో ఉష్ణోగ్రత తగ్గడంతో ప్రజలకు గుండె సంబంధిత సమస్యలు కూడా మొదలవుతాయి. మారుతున్న కాలంలో గుండెపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

చలి క్రమంగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో చిన్నపిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలి పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు దాడిచేసే ముప్పు ఎక్కువ ఉంటుందని, ముఖ్యంగా ఇతర రోజులతో పోల్చితే ఈ కాలంలో హృద్రోగ సమస్యలు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. చల్లని నీటిలో చేతులు పెడితే..కొద్ది నిమిషాల్లోనే చేతులు పాలిపోయినట్లుగా తయారవుతాయి. మళ్లీ బయటపెట్టిన కాసేపటికి సాధారణ స్థితికి చేరుకుంటాయి. హృదయ నాళాల్లోనూ ఇదే జరుగుతుంది. ఎలాంటి జాగ్రత్తలు లేకుండా ఎక్కువ సమయం చలిలో గడిపితే గుండె లోపల రక్తనాళాలు కుచించుకుపోతాయి. అంతిమంగా ఆ ప్రభావం గుండెపై పడుతుంది.

కొందరిలో తెలియకుండానే గుండెకు రక్తాన్ని సరఫరాచేసే నాళాల్లో 20-30 శాతం పూడికలు ఉంటాయి. అప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గడిపేస్తున్నప్పటికీ, చలి వాతావరణంలో ఎక్కువసేపు గడిపితే ఆ పూడికలు తాత్కాలికంగా 60-70 శాతానికి పెరుగుతాయని హృద్రోగ నిపుణులు చెబుతున్నారు. అలాంటి పరిస్థితులు ఒక్కోసారి గుండెపోటుకు దారితీసే ప్రమాదమూ ఉంటుంది. ఇప్పటికే హృద్రోగ, ఇతర శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఈ కాలంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వేకువజామున 4-6 గంటల మధ్య, రాత్రి సమయాల్లో బయట తిరిగే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు

కాలాలు మారుతున్న సమయంలో గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో ప్రజలకు గుండె సంబంధిత సమస్యలు కూడా మొదలవుతాయి. సాధారణంగా కాలానికి అనుగుణంగా వాతావరణంలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలోనే శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవడం చేత ఎంతో చల్లగా ఉంటుంది. దీంతో మన శరీర ఉష్ణోగ్రతలు కూడా పడిపోతాయి. దానివల్ల రక్తనాళాలు కుంచించుకుపోతాయని, శరీరంలో రక్తప్రసరణ సరిగా జరగక అధికంగా గుండె జబ్బులకు కారణమవుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.

శీతాకాలంలో దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు రావడంతో ఊపిరి తీసుకోవడానికి ఎంతో ఇబ్బందిగా మారుతుంది. చలి తీవ్రతను తట్టుకోలేక రక్తపోటు విషయంలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఇలా జరగడం వల్ల గుండె సంబంధ సమస్యలకు కారణం అవుతుంది. అందుకోసమే శీతాకాలంలో గుండె సమస్యలతో బాధ పడకుండా ఉండాలంటే సరైన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం.

మన శరీరంలో వేడిని పెంచే ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవాలి. అదేవిధంగా మనం ఆహారపదార్థాలను తినేటప్పుడు అప్పటికప్పుడు తయారు చేసుకుని వేడిగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను తినడం వల్ల మన శరీరం వేడిగా ఉండటంతోపాటు రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. రోజూ వ్యాయామం చేయాలి. సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. జంక్ ఫుడ్ తినటం మానుకోవాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో నొప్పి, అధిక రక్తపోటు, బలహీనత.. వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయరాదు. గుండె పనితీరు మెరుగ్గా ఉండటం వల్ల ఏ విధమైనటువంటి గుండె సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

చలి కాలంలో ఆహారం, తాగే నీటి ద్వారా అంటువ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువ. కాబట్టి వేడిగా ఉన్నప్పుడే ఆహారం తీసుకోవాలి. ఈ కాలంలో గోరువెచ్చని నీటిని తాగడం మంచిది. చిన్న పిల్లలపై నిమోనియా, ఇతర శ్వాసకోశ వ్యాధులు దాడిచేస్తాయి. నెలలు నిండని శిశువులు, అప్పుడే పుట్టిన పిల్లలను తరచూ తాకే తల్లిదండ్రులు లేదా ఇతరులు వ్యక్తిగత శుభ్రత పాటించాలి. చేతులను సబ్బుతో కడుక్కున్న తర్వాతే పట్టుకోవాలి. ఈ కాలంలో పొగమంచు ఎక్కువ. కాలుష్య కారకాలు గాలిలో ఎక్కువ సమయం ఉంటాయి. ఈ కారణంగా ఉదయపు నడకకు వెళ్లే వారు శ్వాసకోశ వ్యాధుల బారినపడే అవకాశాలుంటాయి.

ఎండ వచ్చాక లేదా సాయంత్రం సమయాల్లో వ్యాయామం మంచిది. పిల్లలను బడికి పంపే సమయంలో ఉన్ని దుస్తులు ధరింపజేయాలి. కాచి చల్లార్చిన నీరు, పరిశుభ్రమైన ఆహారం అందించాలి. వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు, మధుమేహం, క్యాన్సర్‌ ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, అవయవ మార్పిడి చేయించుకున్న వారు చలి కాలంలో త్వరగా ఇన్‌ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంది. ఇలాంటి వారు వైద్యుల సలహాతో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే.. రెగ్యులర్ గా చెకప్‌లు చేయించుకోవాలి. ఒక వ్యక్తి గుండె జబ్బుకు చెందిన ఏవైనా లక్షణాలను అనుభవిస్తే అతను వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి తమ శరీరాన్నంతా పరీక్షించుకోవాలి. శీతాకాలంలో పూర్తిగా మన శరీరాన్ని వెచ్చగా ఉంచటం కోసం ప్రయత్నించాలి. ఈ కాలానికి అనుగుణంగా ఉండే దుస్తులను ధరించాలి.

Leave a Comment