శరీరంలోని మిగతా అవయవాలతో పోలిస్తే కళ్ళు ప్రధానమైనవి. కంటికి వచ్చే సమస్యలు ఎంత సాధారణమైనవో, ఒక్కోసారి అంత ప్రమాదకరమైనవి. ఇలాంటి సమస్యల్లో ఒకటి కెరటోకోనస్. శుక్లపటలం మధ్యభాగం శంఖాకృతిలో ముందుకు పొడుచుకు రావడమే దీని లక్షణం. ఇదేమంత పెద్ద సమస్య కాకపోయినా, తాత్సారం చేయడం వల్ల ఇబ్బందికర సమస్యగా మారుతుంది. ఒక్కోసారి కంటిచూపు పోయే ప్రమాదం కూడా ఉంది. ఈ సమస్యకు కారణాలేంటి, ప్రారంభంలోనే ఎలా తెలుసుకోవాలి, ఎలాంటి చికిత్స తీసుకోవాలి.
శరీరంలో ఏ అవయవం లేకపోయినా, పెద్ద ఇబ్బంది అనిపించదు కానీ… కళ్ళు కనిపించక పోతే మాత్రం అంతకంటే నరకం ఉండదు. కాంతిని గుర్తించి నేత్ర నరాల ద్వారా మెదడుకు సమాచారాన్ని అందించే అవయవమే కన్ను. మనుషులలో కెమెరా వలె పనిచేసి, బాహ్య రూపాల్ని రంగులతో సహా ఉన్నది ఉన్నట్లుగా మెదడుకి పంపుతాయి. దీని వల్ల మనకు ఎదురుగా ఏముందో కనిపిస్తుంది. కంటి నిర్మాణం మొత్తం మూడు పొరలుగా ఉంటుంది. వీటిలో కార్నియా బయట ఉంటుంది. కార్నియా నుంచి చూసినప్పుడు బయట వైపు ఓ విండ్ షీల్డ్ లాంటి ప్రదేశం మనకు కనిపిస్తుంది. సాధారణంగా కార్నియా ఓ అర్థగోళం ఆకారంలో ఉంటుంది. కొద్దిసార్లు ఈ కార్నియా భాగం బలంగా లేకపోవడం వల్ల ఈ గోళాకారం బయటకు శంఖాకృతిలో ముందుకు పొడుచుకు వస్తుంది దీన్నే కెరటోకోనస్ గా చెబుతారు.
కంటిలో ప్రోటీన్ ఫైబర్ తో నిర్మితమైన కొలాజెన్ మీద ఆధారపడి కార్నియా ఉంటుంది. ఇది కార్నియా ఉబ్బినట్లు ఉండేందుకు కూడా సహాయపడుతుంది. ఈ ఫైబర్ బలహీనంగా మారినప్పుడు… కార్నియా చుట్టూ పొర ఆకారం మారుతుంది. క్రమంగా శంఖం ఆకారంలో మారుతుంది. కార్నియాలో యాంటీఆక్సిడెంట్లు తగ్గడం వల్ల కూడా శుక్లపటలం మధ్యభాగం శంఖాకృతిలో ముందుకు పొడుచుకు వస్తుంది. వాహనాల నుంచి వచ్చే కాలుష్యం లాంటి వాటి ద్వారా కార్నియా కణాల ఉత్పత్తికి ఇబ్బంది కలుగుతుంది. సాదారణంగా యాంటి ఆక్సిడెంట్స్ ఒక పొరలా ఏర్పడి, కొల్లాజిన్ ఫైబర్ ను రక్షిస్తూ ఉంటాయి. యాంటి ఆక్సిడెంట్స్ స్థాయి తక్కువగా ఉంటే, కొల్లాజెన్ స్థాయి క్షీణించి, కంటిబయటకు శంఖలా పొడుచుకు వస్తాయి.
దీర్ఘకాలిక కంటి సమస్యలు, అలెర్జీ పరిస్థితులు, కంటిని గోకడం, నలపడం లాంటి వాటి ద్వారా కూడా ఈ సమస్య పెరుగుతుంది. సాధారణంగా కెరటోకోనస్ సమస్య యుక్తవయసులో ప్రారంభం అవుతుంది. బాల్యంలో లేదా 30 సంవత్సరాల వయసు వరకూ దీన్ని గుర్తించడం చాలా కష్టం. 40 సంవత్సరాలు వచ్చే వరకూ దీన్ని గుర్తించలేము. అయితే కొందరిలో మాత్రం ఇది ముందుగానే బయటపడుతుంది. కార్నియా ఆకారంలో మార్పు రావడం అనేది వెంటనే జరగవచ్చు లేదా, క్రమక్రమంగా సంవత్సరాలు సమయం తీసుకుని మారవచ్చు. ఆ మార్పు కళ్ళు మసకబారడం, రాత్రిళ్ళు కంటి చుట్టూ కాంతి వలయాలు కనిపించడం మరియు లైట్లు చారల్లా కనిపించడం లాంటి సమస్యలు ఎదురౌతాయి.
కార్నియా ఆకారంలో మార్పు ఓ స్థాయికి వచ్చాక ఎప్పుడైనా ఆగిపోవచ్చు లేదా దశాబ్ధాల తరబడి కొనసాగుతూ ఉండవచ్చు. ఇది ఎలా మారుతుందనే విషయాన్ని కనుక్కోవడం అసాధ్యమనే చెప్పాలి. చాలా మందిలో రెండు కళ్ళు కెరటోకోనస్ ప్రభావానికి లోనవుతాయి. ఈ రెండూ ఒకే స్థాయిలో ప్రభావానికి లోనవుతాయనే నియమేం లేదు. రెండూ వేర్వేరు విధాలుగా కెరటోకోనస్ లోనవుతాయి. ఎక్కువ సమయాల్లో ముందు ఒక కంటిలో మొదలై, తర్వాత చాలా కాలానికి రెండో కంటిలో ప్రారంభం కావచ్చు. శుక్లపటలం మధ్యభాగం శంఖాకృతిలో ముందుకు పొడుచుకు రావడం వల్ల కొల్లాజెన్స్ విస్తరించి… కంటిలో పెద్ద పెద్ద మచ్చలకు కారణం అవుతుంది. ఒక్కో సారి కార్నియా భాగం వాచి కన్నీళ్లు రావడం మొదలౌతుంది. ఈ వాపు తగ్గడానికి నెలల సమయం పట్టవచ్చు. కంటిలో పెద్ద మచ్చగా ఇది తయారౌతుంది.
కెరటోకోనస్ ని కంటి అద్దాలతో సరిచేయడం సాధ్యం కాదు. అస్పష్టంగా దృష్టి కనిపిస్తుండడం వల్ల తరచూ అద్దాలు మార్చవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. దీని లక్షణాలు ఆలస్యంగా తెలియడం వల్ల, ఈ సమస్యకు నివారణ కూడా సమస్యగానే మారుతుంది. ఈ సమస్య లక్షణాలను ముందుగానే గుర్తించవచ్చు.
1.కాంతిని చూడడం కష్టమౌతుంది.
2.రాత్రిళ్ళు డ్రైవింగ్ చేయడం కష్టం అవుతుంది
3.లైట్లను చూస్తుంటే దాని చుట్టూ ఓ వృత్తం కనిపిస్తుంది
4.కంటిపై భారం పడుతుంది.
5.తలనొప్పి మరియు సాధారణ కంటి నొప్పి ప్రారంభం అవుతుంది
6.కంటి దురద ఎక్కువగా ఉంటుంది
కెరాటోకోనస్ ని ప్రారంభ దశలో నిర్థారించడం చాలా కష్టం. ఇతర కంటి సమస్యలుగా భావించినప్పటికీ ఇది పూర్తిగా బయటపడే వరకూ నిర్థారణ సాధ్యం కాదు.
గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ సమస్యను గుర్తించడం చాలా సులభం అయ్యింది. సూక్ష్మ దర్శిని సాయంతో కంటిని పూర్తిగా పరీక్షించి, కార్నియా స్థాయి ఏ మేరకు ఉంది అనేది గుర్తించాలి. అయితే అన్ని సమయాల్లో ఇలా బయటకు పొడుచుకు రావడమనే సమస్య కెరటోకోనస్ కానవసరం లేదు. అందుకే మంచి వైద్యుణ్ని సంప్రదించి నిర్థారించుకోవాలి. ఒకవేళ ఇది శుక్లపటలము మధ్యభాగము శంఖాకృతిలో ముందుకి పొడుచుకు రావడమనే అంశం నిర్థారణ అయితే దానికి డయాగ్నోసిస్ ట్రీట్ మెంట్ సూచిస్తారు.
కెరటోకోనస్ చికిత్స సాధారణంగా కంటి అద్దాలతో మొదలవుతుంది. ముందు కళ్ళద్దాల ద్వారా దృష్టిని సరిచేస్తారు. తేలికపాటి కేసుల్లో కళ్ళద్దాల ద్వారానే దీన్ని నివారించవచ్చు. అయితే తాత్సారం చేసి పెరిగినప్పడు మాత్రం కార్నియ బలంగా తయారవ్వడానికి, దృష్టి మెరుగు కావడానికి ఇతర చికిత్సలు అవసరం అవుతాయి. PTK అనే ఒక ప్రత్యేకమైన విధానం ద్వారా కాంటాక్ట్ లెన్స్ ద్వారా దీన్ని సరిచేస్తారు. కొల్లాజెన్ మళ్ళీ సరిగా అయ్యేందుకు చికిత్స చేస్తారు. లెన్స్ లాంటి వాటిని కార్నియా ఉపరితరం కింద ఉంచుతారు. మరీ సమస్య ఎక్కువగా ఉంటే కార్నియా మార్పిడి చేస్తారు. కార్నియా తొలగించి దాని స్థానంలో మరో కార్నియా ఏర్పాటు చేస్తారు. దాదాపు లెన్స్ ద్వారానే ఇది పూర్తిగా నివారణ అవుతుంది.
ఏ వ్యాధి అయినా ఆదిలో కనుక్కుంటే నివారణ సాధ్యం అవుతుంది. కానీ కెరాటోకోనస్ విషయంలో మాత్రం అది సాధ్యం కాదు. అందుకే ఎప్పటికప్పుడు కళ్ళను చెక్ చేయించుకుంటూ జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే ఇలాంటి సమస్యలు తప్పవు.