రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలనేది వైద్య నిపుణులు ఎప్పుడూ చెప్పే మాట. అయితే వ్యాయామం అనీ అనక ముందే, చాలా మంది నోట అమ్మో అంత సమయం ఎక్కడుంది అనే మాట వచ్చేస్తుంది. అయితే వ్యాయామం అనగానే గంటల తరబడి చేయాల్సిన అవసరం లేదని, క్రమం తప్పకుండా రోజుకు 10 నిమిషాలు చేసినా చాలని పరిశీలకులు చెబుతున్నారు.
వ్యాయామానికి మించిన ఔషధం మరొకటి లేదనే చెప్పాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా ఒత్తిడిని నివారించుకోవచ్చు. ఉదయాన్నే వాకింగ్ చేయడం, సైక్లింగ్, జిమ్, జాగింగ్, యోగా వంటి వ్యాయామాలు చేయడం వల్ల విటమిన్ డి కూడా అందుతుంది. ఎముకలు పెలుసుగా మారడం, కండరాల నొప్పులతో పాటు మానసిక ఒత్తిడి కూడా తొలిగిపోతుంది. దీంతోపాటు ఆరోగ్యం, చక్కని శరీరాకృతి మన సొంతమవుతాయి.
ప్రస్తుతం ఎక్కువగా కూర్చుండి చేసే ఉద్యోగాలు కావడంతో శరీరానికి కొంత కూడా వ్యాయామం జరుగడంలేదు. ఫలితంగా బరువు పెరగడం, ఒబేసిటీ సమస్యలు రావడం మనం చూస్తుంటాం. ఇలాంటివి దూరంగా ఉండాలంటే ఉదయాన్నే వ్యాయామాలు చేయడం అలవర్చుకోవాలి. ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకొని ఉన్న కొంత సమయంలో చిన్నిచిన్న వ్యాయామాలు చేయాలి. వ్యాయామం చేయడం వలన రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. క్యాలరీలను తొలగించటానికి ఇవి చాలా మంచివి.
రోజూ వ్యాయామం చేయడం కూడా చాలా అవసరం. శారీర వ్యాయామం కేవలం శరీరానికే కాదు, మనసుకు కూడా చాలా అవసరం. రోజుకు కనీసం 10 నిముషాల వ్యాయామం మంచి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుంది. చాలా మంది వ్యాయామం కేవలం శారీరక ప్రయోజనం కోసం మాత్రమే అనుకుంటారు. నిజానికి వ్యాయామం మానసిక ఆరోగ్యాన్ని మరింత మెరుగు పరుస్తుంది. మెదడులో నిత్యం రసాయనాల విడుదల జరుగుతూ ఉంటుంది. వ్యాయామం చేయడం వల్ల వీటి విడుదల మెరుగవుతుంది.
వ్యాయమం వల్ల మానసిక ఉత్తేజాన్ని అందించే హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఇవి ఒత్తిడిని తగ్గించి, మనం ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నామన్న భావనను పెంచుతాయి. మరో కీలకమైన అంశం ఏమిటంటే, ఏ వ్యాయామంలో అయినా కండరాలను ఓ క్రమ పద్ధతిలో ఆపకుండా కదపాల్సి ఉంటుంది. ఆ సమయంలో మెదడును ఉత్తేజ పరిచే సెరటోనిన్ అనే హార్మొన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ వల్ల ప్రతి కూల ఆలోచనలు దరి చేరవు. అదే విధంగా శారీరక శ్రమ వల్ల మెదడులో రక్త ప్రసరణ మెరుగుపడి, మెదడు పని తీరు మెరుగు పడుతుంది. ఊపిరితిత్తులు సమర్థంగా పని చేస్తాయి. ఫలితంగా వయసు పెరుగుతున్నా మెదడు చురుకుదనంలో ఎలాంటి మార్పు రాదు. అందుకే రోజూ ఆహారంతో పాటు పది నిమిషాలు వ్యాయామాన్ని తప్పనిసరి చేసుకోవాలి.
వ్యాయామం ఉదయం లేదా సాయంత్రం చేయడం మంచిది. వ్యాయామం చేయాలని గట్టిగా నిర్ణయించుకుని ప్రారంభించినవారు కూడా ఒక నెల తరువాత చేతులెత్తేస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. వ్యాయామానికి సహనం ఉండాలి. ఆఫీసు, ఇంటి పనులు మానేసి వ్యాయామాలు చేయాలని ఎవరూ అనుకోరు. అయితే ఆ పనులతో పాటు వ్యాయామానికి కొంత టైమ్ కేటాయించుకోవాలి. ఉదయం లేదా సాయంత్రం ఏదో ఒక సమయంలో కనీసం పది నిమిషాలు వ్యాయామం కోసం కేటాయించుకోవాలి. ఏ పార్క్కో వాకింగ్, జిమ్కో వెళ్ళకపోయినా..కనీసం తన పరిసరాల్లో అయినా ప్రతి రోజు పదినిమిషాలు వ్యాయామం చేయాలి.
ఎక్కడికైనా వెళ్ళాలంటే నడచి వెళ్ళడం, ఏదైనా చిన్న పాటి తోట పని లాంటివి చేస్తుండడం ముఖ్యం. అదే విధంగా చిన్న పాటి దూరాలకే బండిని వాడడం, ఎప్పుడూ కూర్చుని ఉండడం లాంటివి తగ్గించుకోవాలి. కనీసం రోజుకు 5 నుంచి 10 నిముషాల మేర వ్యాయామం మొదలు పెట్టండి. కాలక్రమేణ, దాని స్థాయిని పెంచుకుంటూ పోవాలి. అలా అని ఇష్టం వచ్చినట్లు వ్యాయామం చేసినా ఇబ్బందే. ఎందుకంటే దేనిలోనూ అతి పనికిరాదు.
వ్యాయామం చేయటానికి సమయం దొరకటం లేదని చింతించకుండా రోజు కనీసం 10 నిమిషాలు కేటాయించినా చాలు. దీంతో మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. వ్యాయామం చేయటమే కాదు, ఎలాంటి వ్యాయామాలు చేయాలో కూడా తెలిసుండాలి. శారీరక సామర్థ్యాన్ని బట్టి తగు వ్యాయామాలు ఎంచుకోవాలి.