మన శరీరాన్ని ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుకోవాలంటే రోజూ వ్యాయామం చేయాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. రోజూ వ్యాయామం చేస్తే మన శరీరం ఆరోగ్యంగా ఉండడంతోపాటు రోగాల బారిన పడకుండా ఉంటారు. అయితే, దీన్ని ఎంతమంది ఫాలో అవుతారు అంటే అది ప్రశ్నార్థకమే. ఆరోగ్యం మీద వ్యాయామం మీద శ్రద్ధ పెరిగినప్పటికీ.. ఇప్పటికీ చాలామంది రోజువారీ వ్యాయామానికి చాలా దూరంగా ఉంటున్నారు.
ప్రతి రోజూ ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, వ్యాయామం చేయడం కూడా అంతే ముఖ్యం. అలా అని ఇష్టం వచ్చినట్లు వ్యాయామం చేసినా ఇబ్బందే. ఎందుకంటే దేనిలోనూ అతి పనికిరాదు. కొన్ని వ్యాయామాలు ఆరోగ్యకరమైన శారీరక ధారుఢ్యం కోసమైతే, మరిన్ని వ్యాయామాలు మానసిక ఆరోగ్యం కోసం ఉపయోగపడతాయి. రోజూ 30 నుంచి 45 నిముషాల పాటు వ్యాయామం చేయడం వల్ల శారీరక మరియు మానసిక ఆరోగ్యం బావుంటుంది. భవిష్యత్ లో అల్జీమర్స్ లాంటి సమస్యలు దరి చేరవు. ముఖ్యంగా ఆందోళనను తగ్గించడంలో వ్యాయామం పాత్ర కీలకమైనది. దీని వల్ల ప్రశాంతత చేకూరడమే కాదు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ప్రధానంగా చెప్పుకోవాలంటే బరువు నియంత్రణంలో వ్యాయామం పాత్ర చాలా పెద్దది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెరగకుండా కట్టడి చేస్తుంది. ఊబకాయం, మధుమేహం, రక్తపోటు లాంటి సమస్యలు రాకుండా ఇది కాపాడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరుస్తుంది. నిత్యం ఉదయం కాసేపు నడవడం, యోగా లాంటి వ్యాయామాలు చేయడం వల్ల రోజంతా చక్కగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. నిపుణులైన వారి సలహాల మేరకు మనకు ఎలాంటి వ్యాయామం మంచిదో తెలుసుకుని చేయాలి.
చాలా మంది వ్యాయామం కేవలం శారీరక ప్రయోజనం కోసం మాత్రమే అనుకుంటారు. నిజానికి వ్యాయామం మానసిక ఆరోగ్యాన్ని మరింత మెరుగు పరుస్తుంది. మెదడులో నిత్యం రసాయనాల విడుదల జరుగుతూ ఉంటుంది. వ్యాయామం చేయడం వల్ల వీటి విడుదల మెరుగవుతుంది. వ్యాయమం వల్ల మానసిక ఉత్తేజాన్ని అందించే హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఇవి ఒత్తిడిని తగ్గించి, మనం ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నామన్న భావనను పెంచుతాయి.
ఏ వ్యాయామంలో అయినా కండరాలను ఓ క్రమ పద్ధతిలో ఆపకుండా కదపాల్సి ఉంటుంది. ఆ సమయంలో మెదడును ఉత్తేజ పరిచే సెరటోనిన్ అనే హార్మొన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ వల్ల ప్రతి కూల ఆలోచనలు దరి చేరవు. అదే విధంగా శారీరక శ్రమ వల్ల మెదడులో రక్త ప్రసరణ మెరుగుపడి, మెదడు పని తీరు మెరుగు పడుతుంది. ఊపిరితిత్తులు సమర్థంగా పని చేస్తాయి. ఫలితంగా వయసు పెరుగుతున్నా మెదడు చురుకుదనంలో ఎలాంటి మార్పు రాదు. అందుకే రోజూ ఆహారంతో పాటు వ్యాయామాన్ని తప్పనిసరి చేసుకోవాలి.
సౌకర్యవంతమైన వ్యాయామాలను ఎంచుకోండి. వర్కవుట్, యాక్టివిటీ లేదా క్లాస్‌ని ఆస్వాదిస్తే రోజులో ఎక్కువ సమయాన్ని వెచ్చించే అవకాశం ఉంది. సంగీతం మిమ్మల్ని ఉత్సాహపరిచినట్లయితే, జుంబా లేదా నీటి వ్యాయామ వంటివి ప్రయత్నించండి. అలాగే స్వచ్ఛమైన గాలి మరియు చెట్లను ఇష్టపడితే, పార్క్ గుండా సైకిల్ రైడ్‌లను ప్లాన్ చేయండి. సాధారణ షెడ్యూల్‌కి సరిపోయేటప్పుడు వ్యాయామం అలవాటుగా మారుతుంది. త్వరగా మేల్కొలపడానికి ఇష్టపడినట్లయితే, తలస్నానం చేసే ముందు ఉదయం వ్యాయామం చేయడానికి ప్లాన్ చేయండి.
సాధారణంగా సాయంత్రం వేళల్లో టీవీ చూస్తుంటే, చేతి బరువును సమీపంలో ఉంచండి, తద్వారా మీకు ఇష్టమైన షోలో పాల్గొనేటప్పుడు మీరు కొన్ని రెప్స్ చేయవచ్చు. ఉదయం వాకింగ్ వేళ్ళినప్పుడు కుక్కతో వేగంగా నడవండి. ఇంటిని వాక్యూమ్ చేస్తున్నప్పుడు పాప్ సంగీతానికి నృత్యం చేయండి. ఎలివేటర్‌కు బదులుగా కొన్ని మెట్లు ఎక్కండి. డ్రైవింగ్ చేయడానికి బదులుగా మార్కెట్ లేదా మాల్‌కు నడవండి. వారానికి మూడు సార్లు మార్నింగ్ వాక్ లేదా వాటర్ ఎక్సర్‌సైజ్ క్లాస్ చేయాలని ప్లాన్ చేస్తే, ఆ సమయాన్ని మీ షెడ్యూల్‌లో పెట్టుకోండి. రోజుకు అరగంట పాటు వారంలో 5 రోజులు వ్యాయామం తప్పనిసరి.
వ్యాయామం చేయడం వలన శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్స్ విడుదలవుతాయి. అలానే క్యాలరీలు కరగడమే కాకుండా శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. మృతకణాలు పేరుకోకుండా ఉంటాయి. చర్మం తాజాగా మారుతుంది. చిన్న వయసు నుండే వ్యాయామం చేయడం వలన భవిష్యత్తులో మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.