Tooth Enamel : దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే..! ఎనామిల్‌ పొర దృఢంగా ఉండేలా చూసుకోవాలి

By manavaradhi.com

Published on:

Follow Us
Tooth Enamel

మనకు తెలియకుండానే మన శరీరంలో కీలక పాత్ర పోషించే భాగం దంతాలే. ఆహారం నమలడానికి మాత్రమే కాదు… అందాన్ని ఇనుమడింపజేయడంలోనూ దంతాల పాత్ర ఎనలేనిది. అంత కీలకమైన దంతాలకు మరింత ముఖ్యమైంది ఎనామిల్ పొర. పంటిమీద ఏర్పడిన ఈ ఎనామిల్ పొర… పంటికి అందాన్ని ఇవ్వడమే కాకుండా… పంటిని రక్షిస్తూ ఉంటుంది. అలాంటి ఎనామిల్ పొర అరిగిపోతే ఏం చేయాలి… అసలు దీనికి పరిష్కారం ఉందా.

పుల్లని పండ్లు, ఆహార పదార్థాలు తిన్నప్పుడు దంతాలు జివ్వున లాగడం, నమలడానికి సహకరించకపోవడం మనందరికి అనుభవమే. చింతకాయలు, రేగు పండ్లు, నిమ్మ, నారింజ, కలిమె కాయలు లాంటివి నోరూరించేలా చేస్తాయి. తీరా తిన్న తర్వాత పండ్లు జివ్వుమని లాగుతాయి. కొద్ది గంటలపాటు దేనిని నమల లేని పరిస్థితి. అసలు ఎందుకిలా జరుగుతుంది అంటే… పుల్లని పండ్లలో ఉండే ఆమ్లాలు మన దంతాల పైన రక్షణ కవచంగా ఉన్న ఎనామిల్‌ను కరగదీస్తాయి. ఎనామిల్ డ్యామేజి మొదలు కాగానే దంతాల్లోనిలో నాడులు ఇక పుల్లని పండ్లను నమలలేమని హెచ్చరిస్తాయి.

మన దంతాలు డెంటిన్ అనే ఎముకతో తయారవుతాయి. ఇవి ఆమ్లాలు, క్షారాల ప్రభావానికి తేలికగా ధ్వంసమవుతాయి. మాంసాహారంలోని బొమికెలు, కొన్ని రకాల గింజలు, పప్పులు నమిలితే విరిగిపోతాయి. ఈ ప్రమాదం తప్పించేందుకు సహజసిద్ధంగానే పళ్ల పైన ఎనామిల్ అనే తెల్లని పొర ఉంటుంది. ఎనామిల్ మన దేహంలోని అన్ని ఎముకల కంటే అత్యంత దృఢమైనది. ఈ ఎనామిల్ వల్ల దంతాలు గట్టిగా తయారవుతాయి. ఎనామిల్‌లో ప్రధానంగా క్యాల్షియం, ఫాస్ఫరస్ మూలకాలు బలమైన రసాయన బంధంతో కలిసిపోవడం వల్ల, రోజువారి తినే ఆహారపదార్థాలతో చర్య జరిగి పళ్ళు పాడవకుండా ఓ రక్షణ కవచంలా ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నా కృత్రిమ ఎనామిల్ ఇప్పటికీ తయారు చేయలేకపోయామంటేనే తెలుస్తోంది కదా… ఎనామిల్ ఎంత ముఖ్యమైనదో.

చింతకాయలు, చింతపండులో ఉండే టార్టారిక్ యాసిడ్, నిమ్మరసంలోని సిట్రిక్ ఆమ్లం, రేగుపండ్లలోని ఆస్కార్బిక్ యాసిడ్, కూల్ డ్రింక్స్ లోని ఫాస్ఫారిక్ ఆమ్లం, కార్బోనిక్ యాసిడ్ లు ఎనామిల్ లోని క్యాల్షియం, ఫాస్ఫరస్ ల రసాయన బంధాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. దానితో ఎనామిల్ పొరలు పొరలుగా కరిగి పోయి పళ్లు పసుపు పచ్చగా మారతాయి. ఎనామిల్ పొర పల్చబడితే వేడి, చల్లని ద్రవాలు, పదార్థాలను తినడం బాధ కలిగిస్తుంది. దీన్ని నివారించేందుకు తిన్న ప్రతిసారి నీటితో నోరు శుభ్రం చేసుకుంటే ఆమ్లం ప్రభావం తగ్గుతుంది. నిమ్మ రసం, నారింజ జ్యూస్, కూల్ డ్రింక్స్ తాగేటప్పుడు తప్పని సరిగా స్ట్రాను వాడాలి. రాత్రి భోజనం చేసిన తర్వాత బ్రష్ చేసుకోకపోయినా ఎనామిల్ ధ్వంసమయ్య ప్రమాదం ఉంది. మనం ఆహారాన్ని నమిలినపుడు చిన్న తునకలు పళ్ల మధ్య ఇరుక్కుపోతాయి. నోటిలో ఉండే స్టెప్టోకాకస్ మ్యూటంట్స్, ల్యాక్టో బ్యాసిల్లి బ్యాక్టీరియాలు పిండి పదార్థం అవశేషాలను పులిసేలా చేస్తాయి. అప్పుడు వెలువడే ల్యాక్టక్ యాసిడ్ కూడా ఎనామిల్ పొరలను నాశనం చేస్తాయి.

ఐస్‌ క్రీమ్‌ తిన్నప్పుడు, కూల్‌డ్రింక్‌, కాఫీ, టీ, సూప్‌ వంటి తాగినపుడు చాలా మందికి పళ్లు జివ్వున లాగుతాయి. బ్రష్‌ చేసుకుంటున్నన్నా, చల్లని, వేడి పదార్థాలు తగిలినా పళ్లు జివ్వుమనడాన్ని సెన్సిటివిటీ అంటారు. ప్రతి నలుగురిలో ఒకరు ఈ విధమైన సమస్యతో బాధపడుతుంటారు. ఇందుకు కారణం పళ్లపై ఎనామిల్‌ దెబ్బతినడం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే చిగుళ్ల దగ్గర ఒక సన్నని పొరగా పాచి ఏర్పడి చిగుళ్లు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. గట్టి టూత్‌ బ్రష్‌తో తోముకోవడం వల్ల సెన్సిటివిటీ సమస్య వస్తుంది.ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే.. క్రమంగా దంతాలు బలహీన పడి ఊడిపోయే ప్రమాదం ఉంది. సెన్సిటివిటీ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పని సరి.

సాధారణంగా చక్కెర వల్లే దంతాలు దెబ్బతింటాయని చాలా మంది భావిస్తూ ఉంటారు. చక్కెరే కాదు చక్కెర లేని డైట్‌ డ్రింక్స్‌ వల్ల కూడా దంతాలు దెబ్బతింటాయని మెల్‌బోర్న్‌ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. 23 రకాల డ్రింకులను ఈ అధ్యయనంలో పరిశీలించారు. వాటిల్లో సాఫ్ట్‌ డ్రింక్స్‌, స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ వంటివి కూడా ఉన్నాయి. ఇవి దంతాలను దెబ్బతీస్తున్నాయని అధ్యయనంలో తేలింది. దంతక్షయాన్ని ప్రారంభదశలోనే గుర్తిస్తే ఈ సమస్యను సులువుగా పరిష్కరించే వీలుంటుంది. రకరకాల సాఫ్ట్‌ డ్రింక్స్‌ తాగడం వల్ల కూడా దంతాలపై ఉండే సున్నితమైన పొరలు దెబ్బతింటాయి. దాంతోపాటు ఎనామిల్‌ కూడా దెబ్బతింటుంది. షుగర్‌తో కూడిన డ్రింక్స్‌, షుగర్‌ లేని డ్రింక్స్‌ రెండూ కూడా దంతాల పైభాగాన్ని ఒకేలా దెబ్బతీస్తాయి.

ఈ మధ్యకాలంలో అరిగిపోయిన ఎనామిల్ సమస్య వల్ల పాడైన పళ్ళను సరిచేసేందుకు అనేక వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయి. దంతాలు వరుసక్రమంలో లేకపోయినా, లేదా అక్కడక్కడా దొంతర పళ్లు ఉన్నా, వాటి రూపాన్ని సరిచేసి అందంగా తీర్చిదిద్దడానికి చేసే చికిత్సా విధానమే ఎనామిల్ షేపింగ్. ఎనామిల్ షేపింగ్ చికిత్సలో కొన్ని దంతాలకు ఎనామిల్ తొలగించడం, లేదా ఇతర దంతాలతో సమానరీతిలో సరిచేసి దంత సౌందర్యాన్ని పెంచడానికి చికిత్స చేస్తారు. ఈ ప్రక్రియను ఓడాంటోప్లాస్టి, ఎనామిల్ ప్లాస్టి, స్ట్రిప్పింగ్, రీకౌంటరింగ్, స్లెండరైజింగ్, రీషేపింగ్ తదితర పేర్లతో కూడా వ్యవహరిస్తారు.

పగిలిన లేదా బీటలువారిన దంతాలను ఎనామిల్ షేపింగ్ ద్వారా సరిచేస్తారు. బాండింగ్ విధానం ద్వారా దంతాలకు కొన్ని రకాలరంగు పదార్థాలను వేయడం ద్వారా దంతాలన్నీ ఒకేరంగులో కనిపించేలా చేస్తారు. అయితే దంత సౌందర్యానికి సంబంధించిన సమస్యలన్నింటినీ ఎనామిల్ షేపింగ్ ద్వారా పరిష్కరించలేము. దొంతర పళ్లు మరీ ఎక్కువగా ఉంటే బ్రేసెస్ అవసరమవుతాయి. ఒక్కొక్కసారి దంతాలు వంకరటింకరగా లేదా అరిగి చిన్న చిన్న పళ్లమాదిరిగా ఉంటే వాటిని బలవర్థకంగా చేయడానికి లేదా తిరిగి ఆరోగ్యంగా చేయడానికి ఇతర చికిత్సా విధానాలు అవసరమవుతాయి. కొన్నిసార్లు ఎనామిల్ పోతే తిరిగి దానిని సరి చేయడానికి ఇతర పద్ధతులు అవలంబించాల్సి ఉంటుంది.

Leave a Comment