Mother Feeding: చంటి పిల్లలకు ఎంతకాలం పాలు ఇవ్వవచ్చు ?

By manavaradhi.com

Updated on:

Follow Us

శిశువుకు తల్లిపాలు ఇవ్వడమనేది ప్రకృతి సహజమైన ప్రక్రియ. అప్పుడే పుట్టిన శిశువుకు తొలి ప్రాథమికాహారం తల్లిపాలే. సహజ ప్రసవం ద్వారా బిడ్డను కన్న తల్లి గంటల వ్యవధిలోనే బిడ్డకు పాలివ్వడం చాలా మంచిది. సిజేరియన్‌ ద్వారా బిడ్డను కన్న తల్లి నొప్పి తగ్గిన తర్వాత నాలుగైదు, గంటల్లోపలే శిశువుకి పాలివ్వొచ్చు. తల్లి పాలు శిశువుకు చక్కగా జీర్ణమవుతాయి. తల్లిపాలల్లో ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, మినరల్స్‌, క్యాల్షియం, పొటాషియం తదితర పోషకాలన్నీ అవసరమైన మేరకు ఉంటాయిు.

తల్లి పాలు తాగిన శిశువు ఆరోగ్యంగా, సరైన బరువుతో పెరగడానికి అవకాశం కలుగుతుంది. దీంతో పిల్లలకు విరోచనాలు సక్రమంగా జరగడమే కాకుండా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురుకావు. అసలు తల్లిపాలు బిడ్డకు ఇవ్వకపోతే ఎన్నో సమస్యలు తప్పవు. ఇవి కేవలం బిడ్డకు మాత్రమే కాదు, తల్లికి కూడా. తల్లిపాలు తాగని పిల్లలు చిన్న తనం నుంచే వ్యాధినిరోధక శక్తి తక్కువగా కలిగి ఉంటారు. తరచూ అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడంతో పాటు ఎదుగుదల సైతం అంతంత మాత్రంగానే ఉంటుంది.

తల్లి పాలు తగినంతగా తాగే శిశువుకు ఎలాంటి ఇన్‌ఫెక్షన్లూ రావు. అలర్జీలు కూడా దరిచేరవు. కొందరు తల్లులకు సరిగ్గా పాలురావు. అటువంటి వారూ వచ్చిన మేరకు శిశువుకు పాలు ఇవ్వాలి. తల్లి పాలలో ప్రొటెక్టివ్‌ యాంటీబాడీస్‌ ఉంటాయి. దీంతో శిశువులో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. శిశువు ఆకలితో ఏడ్చిన వెంటనే సులభంగా తల్లి పాలివ్వవచ్చు. బ్రెస్ట్‌ ఫీడింగ్‌ చేస్తుంటే స్త్రీలకు కొన్ని అనారోగ్య సమస్యలు రావు. బిడ్డ పుట్టిన మొదటి అరగంట లోపు తల్లలకు వచ్చే పాలను ముర్రు పాలు అంటారు. చాలా మంది వీటిని పారబోస్తుంటారు. వీటిని కచ్చితంగా శిశువుకు పట్టాలి. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా, బిడ్డకు సమతుల్యమైన పోషక పదార్థాలు అందుతాయి. ఇందులో మాంసకృతులు, విటమిన్ ఏ ఉంటాయి. దీని వల్ల వ్యాధులు రాకుండా బిడ్డకు జీవితకాలం రక్షణ లభిస్తుంది. శిశువుల పేగులను శుభ్రం చేసి, తొలి మల విసర్జనకు తోడ్పడతాయి.

తల్లిపాలు బిడ్డను తొలి నెలలో ఎదురయ్యే వివిధ రకాల అంటు వ్యాధుల నుంచి రక్షిస్తాయి. పిల్లలకు డయోరియా, నిమోనియా వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా తల్లిపాలే రక్షణ కల్పిస్తాయి. బిడ్డ పుట్టిన తర్వాత కనీసం ఆరు నెలల వరకూ బిడ్డకు రోజుకు 8 నుంచి 10 మార్లు తప్పనిసరిగా రోజూ పాలు పట్టించాలి. తల్లికి, శిశువుకు జ్వరం వచ్చినప్పుడు, టీకాలు ఇచ్చినప్పుడు కూడా నిరభ్యంతరంగా పాలు పట్టించవచ్చు. తల్లిపాలు శిశువుకు సంతులిత ఆహారాన్ని అందించి, బిడ్డ మెదడు వికాసానికి తోడ్పడతాయి. తల్లిపాలలో పిల్లలకు అవసరమయ్యే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని లాక్టోజ్ వల్ల కాల్షియం నిల్వలు పెరిగి, బిడ్డకు రక్తహీనత నుంచి రక్షణ లభిస్తుంది.

తల్లి పాలు తాగిన పిల్లలకు బాల్యంలో, యవ్వనంలో ఊబకాయం వచ్చే ప్రమాదం చాలా వరకూ తగ్గిపోతుంది. తల్లికి పాలు పుష్కలంగా రావాలంటే గర్భిణిగా ఉన్న నాటి నుంచి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవాలి. పాలు, చేపలు, గుడ్లు, వెల్లుల్లిపాయ, తాజా కూరగాయలు, పండ్లు తగిన మోతాదులో తీసుకోవాలి. ఆహారంలో తీపి పదార్థాలు అంటే ప్రకృతి సహజంగా దొరిగే తీపి పదార్థాలైన పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల బిడ్డకు కావలసిన పాలు పుష్కలంగా అంది, బిడ్డఆరోగ్యంతో పాటు తల్లి ఆరోగ్యానికి రక్షణ లభిస్తుంది.

పుట్టిన వెంటనే పాలు రావట్లేదనో, మంచిది కాదనో కాకుండా పిల్లలకి పాలుపట్టాలి. తేనె, పంచదారనీళ్లు, నీరు, గ్లూకోజ్‌ పట్టవద్దు. అసలు చంటిపిల్లలకు ఆరునెలల వరకూ తల్లిపాలు చాలు… తల్లిపాల ఆవశ్యకతను తల్లిగా మారే ప్రతి ఒక్కరికీ తెలియజేయాలి.

Leave a Comment