మనం ఆరోగ్యంగా, దృఢంగా ఉన్నప్పుడే ఏ పనైనా చేయగలుగుతాం. అందుకు మన జీవక్రియలు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. శరీరంలోని జీవక్రియలు సక్రమంగా కొనసాగినప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మరి జీవక్రియలు మెరుగుపడాలంటే ఏంచేయాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల జీవక్రియలను మెరుగుపరుచుకోవచ్చు..?
జీవక్రియ సక్రమంగా ఉంటే.. శరీరం అంత ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటుంది. అధిక బరువు సమస్య ఉండదు. అధిక మెటబాలిజం వలన మరింత శక్తివంతంగా ఉంటారు. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు జీవక్రియపై శ్రద్ధ వహించడం తప్పనిసరి. శరీరంలో ఆహారాన్ని శక్తిగా మార్చడాన్ని జీవక్రియ అంటారు. ఆహారాన్ని జీర్ణం చేయడానికి, రక్త ప్రసరణ కోసం, శ్వాస, హార్మోన్ల సమతుల్యత వంటి పనుల కోసం, శరీరానికి ఆహారం నుండి లభించే శక్తి అవసరం. ఈ శక్తి జీవక్రియ నుండి వస్తుంది.
మెటబాలిజం మెరుగ్గా ఉంటే, మీరు మరింత శక్తివంతంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజూ ఉదయాన్ని లేవాలి. మంచి నిద్ర పోవాలి. సరిగ్గా నిద్రపోవడం వలన బరువు తగ్గడానికి ఉపకరిస్తుంది. అల్పాహారం.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. జీవక్రియను మెరుగుపరుచుకోవడానికి వ్యాయామం అత్యంత ప్రభావవంతమైన మార్గం. వ్యాయామం చేయడం ద్వారా మెటబాలిజాన్ని మెరుగుపరుచుకోవచ్చు. వ్యాయామం చేయడం వల్ల శారీరక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
చాలా మంది ఎక్కువసేపు ఆఫీసుల్లోనే గడుపుతుంటారు. పని ఎక్కువ అవటం, ఇతర కారణాల కారణంగా అలసిపోతుంటారు. ఇలాంటి వారికి వ్యాయామం చేయడానికి సమయం దొరకదు. ఈ నేపథ్యంలోనే మీ మెటబాలిజాన్ని పెంపొందించడానికి, చురుకుగా ఉండేందుకు ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. డ్యూటీలో ఉన్నప్పుడు మధ్య మధ్యలో కాస్త విరామం తీసుకోండి. అప్పుడప్పుడు కాసేపు నడవండి. దీని వల్ల బరువు తగ్గడమే కాకుండా.. పని మీద ఏకాగ్రత పెరుగుతుంది. జీవక్రియల విషయలో నిద్ర కూడా చక్కని పాత్ర పోషిస్తుంది.
ప్రతి రోజు ఎనిమిది గంటలకు తక్కువ కాకుండా నిద్రపోయినట్టయితే జీవక్రియలు మెరుగుపడతాయి. రోజుకి 6 నుంచి 8 గ్లాసుల నీరు తాగటం వల్ల జీవక్రియల వేగాన్ని పెంచి శరీరం నుంచి విష పదార్థాలు, అధిక కొవ్వును తొలగించటానికి తోడ్పడుతుంది. ఉదయం పూట అల్పాహారం తీసుకోవడం వల్ల రోజంతా జరిగే జీవక్రియల పద్ధతిని గాడిలో పెడుతుంది. కొంచెం కొంచెంగా రోజుకి 3-4 సార్లు ఆహారం తీసుకోవటం మంచిది. రాత్రి పడుకొనే ముందు కెఫిన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు.. కాఫీగానీ మరే ఇతర ద్రవపదార్థాలనుగానీ తీసుకోవడం వల్ల జీవక్రియలు మందగిస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉంటే మంచిది.
రోజుకి 70 గ్రాములకు తక్కువ కాకుండా ప్రోటీన్లనూ తీసుకోవాలి. ఇవి రక్తంలోకి ఇన్సులిన్ స్రావాన్ని నియంత్రించి, జీవక్రియలకు ఉత్తేజాన్నిస్తాయి. ఎక్కువ కేలరీలు బర్న్ చేయడానికి మీకు సహాయపడే ఆహారాలు ఉన్నాయి. ఆహారాన్ని నమలడం, జీర్ణం చేయడం, నిల్వ చేయడం వంటి ప్రక్రియలో మీ శరీరం కేలరీలను బర్న్ చేయాల్సి ఉంటుంది. ప్రోటీన్స్ అధికంగా ఉన్న ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ శక్తి అవసరం. ఆహారంలో ఎక్కువ సుగంధ ద్రవ్యాలను ఉపయోగించడం కూడా ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి ఉపకరిస్తుంది.
ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల గంటల కొద్దీ ఆకలి వేయదు. తద్వారా అతిగా తినాలనే కోరిత సహజంగానే తగ్గిపోతుంది. జీవక్రియను నిర్వహించడానికి, కాయధాన్యాలు, తృణధాన్యాలు, గుడ్లు, బీన్స్, నల్ల మిరియాలు, అవోకాడో, కాఫీ, అల్లం మొదలైనవి తీసుకోవచ్చు. మధ్యాహ్నం భోజనం పౌష్టికాహారం మాత్రమే తినండి. ఇక సాయంత్రం వేళలో చిప్స్, చాక్లెట్లు, కేకులు వంటి అస్సలు తినకండి. అనారోగ్యకర కార్బొహైడ్రేట్లు ఎక్కువగా తీసుకోకుండా జాగ్రత్తపడాలి. నైట్ షిప్టుల్లో పనిచేసేవారు నిద్ర గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన సమయానికి భోజనం చేసేలా ప్లాన్ చేసుకోవలి. ఒత్తిడిని అధిగమిస్తూ యోగా, ప్రాణాయామం వంటివి అలవాటుచేసుకోవాలి
శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరుగాలంటే ఆరోగ్యం దృఢంగా ఉండాలి. అందుకు ముఖ్యంగా వ్యాయామంపై దృష్టిసారించాలి. శారీరకశ్రమ మెటబాలిజానికి ఎంతగానో తోడ్పడుతుంది. రోజుకి కనీసం 2-3 కి.మీ నడవాలి. రాత్రి భోజనానికి ముందు అరగంట సేపు కదలికలు వేగంగా ఉండే వ్యాయామం చేస్తే జీవక్రియల వేగమూ పెరుగుతుంది.