Obesity : ఊబకాయాన్ని తగ్గించుకునే మార్గాలు .. తీసుకోవలసిన జాగ్రత్తలు ..?

By manavaradhi.com

Published on:

Follow Us
Obesity: Definition, Causes, Diagnosis, Treatment

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అధిక బరువు, స్థూలకాయంతో సతమతమవుతున్నారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ఆరోగ్య సమస్యల్లో కాన్సర్, గుండెపోటు తర్వాత స్థానం ఊబకాయ సమస్యదే. ఒకప్పుడు పాశ్చ్యాత్య దేశాలకే పరిమితమైన ఈ సమస్య గత దశాబ్దంగా మన దేశంలోను ప్రవేశించింది. దీనికి కారణం భారతీయులు దేశీయ పద్ధతులను విడిచి విదేశీయ పద్ధతులను అలవాటు చేసుకోవడమే. ప్రపంచీకరణ పుణ్యమా అని జరిగిన మంచితో పాటు ఈ పాశ్చ్యాత్య జీవన విధానం మన సమాజంలోకి చాప కింద నీరులాగా చొచ్చుకువచ్చింది. ఆహారపు అలవాట్లు, జీవనశైలి, క్రమంగా విదేశీ విధానంలోకి మారిపోతున్నాయి. అసలే రోజువారీ పనులలో, విస్తరించిన యంత్రాల వాడకం, ఒకే చోట కదలకుండా పని చేసే పధ్ధతి మనకు శారీరక శ్రమ లేకుండా చేస్తున్నాయి. పైపెచ్చు మారిన ఆహారపు అలవాట్లు ఊబకాయ సమస్యను తెచ్చిపెడుతున్నాయి.

ఒక సర్వే ప్రకారం నడివయసు వాళ్ళకన్నా 7 నుంచి 26 సంవత్సరాల మధ్య వయసు వారిలోనే ఈ ఊబకాయ సమస్య ఎక్కువగా ఉంది. ఈ ఊబకాయం వల్ల మధుమేహం, గుండెపోటు, రక్తపోటు, కీళ్ళ నొప్పులు వంటి బాధలే కాక, ఆడవారిలో సంతానలేమి సమస్య కూడా రావచ్చు. మన దేశంలో పట్టణాల్లో ఉన్నత, మధ్య తరగతి మహిళల్లో 30-50 శాతం మంది.. పురుషుల్లో 32 శాతం మంది స్థూలకాయంతో బాధపడుతున్నారని జాతీయ పోషకాహార సంస్థ (NIN) నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

సాధారణంగా మన ఎత్తును బట్టి ఉండాల్సిన బరువును మూడు రకాలుగా విభజించారు. బాడీమాస్ ఇండెక్స్ అంటే ఎత్తు, బరువుల నిష్పత్తి ప్రకారం 20 : 25 ఉంటే సాధారణ బరువుతో ఉన్నట్టు, 25 : 30 ఉంటే అధిక బరువుతో ఉన్నట్టు, అదే విధంగా 30 : 35 ఉంటే స్థూలకాయంగానూ, 40కి పైగా ఉంటే మాత్రం వ్యాధిగ్రస్థ ఊబకాయంగానూ చెబుతారు. మార్బిడ్ ఒబేసిటి అంటే వ్యాధిగ్రస్థ ఊబకాయం మొదలైందంటే మాత్రం నడవడమే కష్టం అవుతుంది. ఏ మాత్రం వ్యాయామం చేయడం వీలు కాదు. వ్యాయామం చేసేందుకు ప్రయత్నించినా, తిండి తగ్గించినా బరువు తగ్గడం మాత్రం ఈ దశలో దుర్లభమే.

శరీరంలో అదనపు కొవ్వుచేరి నిలవుండటం వల్ల బరువు అధికమవటం జరుగుతుంది. స్థూలకాయం ఏర్పడిన వారి నడకలో కూడా మార్పు వస్తుంది. ప్రతివారూ ఆరోగ్యం కోసం నెలకు లేదా రెండు నెలలకు ఒకసారి బరువును పరీక్ష చేసుకోవాలి. అదనపు బరువు పెరిగితే బరువును నియంత్రించు కునేందుకు సరైన పద్ధతులను పాటించాలి. ఇది మానసిక ప్రభావంతో కూడిన వ్యాధి అని, ఎక్కువగా దిగులు పడే వాళ్ళలో, భయపడే వాళ్ళలో, ఆత్మన్యూనత పెరిగే వాళ్ళలో ఇది వేళ్ళూనుకు పోతోందని హెచ్చరిస్తున్నారు. స్థూలకాయులకు దగ్గరగా మసలే వారు, ముఖ్యంగా బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు స్థూలకాయం వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అతి బరువుతో బాధ పడేవారు తాము సాధారణ బరువుతోనే ఉన్నామని ఊహించుకుంటారు. ఇదే భావనతో వారు అతిగా ఆహారాన్ని తీసుకుంటుంటారు. ఇది వారి సహచరులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందంటున్నారు.

స్థూలకాయులతో సహవాసం వల్ల వారి అలవాట్లను వారితో ఉండే సహచరులు కూడా అనుసరిస్తారు. ఉదాహరణకు లావుగా ఉన్న కుటుంబ సభ్యులతో కలిసి మమూలు ఆకృతి ఉన్నవారు ఒక పక్క టెలివిజన్‌ చూస్తూ మరోపక్క తిండిని లాగిస్తూ, శరీరానికి ఎటువంటి శ్రమలేకుండా గడిపేస్తుంటారు. ఫలితంగా ఒకరి నుంచి మరొకరికి స్థూలకాయం వ్యాపిస్తుంది. స్థూలకాయంతో బాధపడుతున్న వారు సహజసిద్ధంగా బరువును తగ్గించుకోవటానికి వ్యాయామాన్ని మించిన మార్గం లేదు. ఆరోగ్యకరమైన జీవనశైలిని రోజూ పాటిస్తుంటే స్థూలకాయం ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. బరువు అధికమవుతున్నప్పుడు చాలామంది డైటీషియన్‌ సలహా తీసుకోకుండానే డైటింగ్‌ ఆరంభిస్తారు. డైటింగ్‌ను ఏవిధంగా చేయాలన్న విషయం పట్ల సరయిన అవగాహన ఉండాలి. డైటీషియన్‌ను సంప్రదించి ఆ ప్రకారంగా చేయాలి.

బరువును పెంచుకుని ఆ తర్వాత తగ్గించు కోవాలని ప్రయత్నం చేసేకంటే బరువు పెరగకుండా జాగ్రత్త పడటం మంచిది. సమతుల్య ఆహారం తీసుకుంటూ, శరీరవ్యాయామం చేయాలి. కడుపు పూర్తిగా నిండేంతవరకూ కాకుండా మితాహారాన్ని తీసుకోవాలి. ఆహారపదార్ధాల్లో పీచుపదార్ధాలు, ఆకుకూరలు, తాజా కూరగాయలు ఫ్రిజ్‌లో చాలా రోజులనుంచీ నిలువ ఉంచినవి కాకుండా ఉండేలా చూసుకోవాలి. జంతుసంబంధమయిన ఆయిల్స్‌ను అంటే వెన్న, నెయ్యి లాంటివి తగ్గించాలి. మీగడ పెరుగు తినకూదడు. మీగడ తీసేసిన చిక్కని, మజ్జిగను వాడాలి. దుంపకూరలు, కొవ్వు అధికంగా లభించే ఆహరపదార్ధాలు తీసుకోవడం మానెయ్యాలి. కొవ్వు పెంచని ఆహారపదార్ధాలు వారి ఆహారంలో ఉండాలి. పోషక విలువలు సమృద్ధిగా లభించే మితాహారాన్ని తీసుకోవాలి. ప్రతిరోజూ ఒక నిర్ణీత సమయంలో ఆహారాన్ని తీసుకోవాలి. కాబట్టి ఎప్పటికప్పుడు స్థూలకాయులు తమ బరువును బేరీజు వేసుకుంటూ బరువు నియంత్రణ చేసుకుంటూ ఉంటే ఆరోగ్యకరమైన జీవితాన్ని సుఖంగా, ప్రశాంతంగా గడపొచ్చు.

Leave a Comment