Obesity – ఊబకాయం – తెలుసుకోవాల్సిన వాస్తవాలు

By manavaradhi.com

Published on:

Follow Us
Obesity health issues

బొజ్జ ఉండడం ఒక సంపద అంటూ ఒబేసిటీతో బాధపడుతున్న వారు తమకు తాము సరదాగా సర్దిచెప్పుకుంటూ ఉంటారు. ఆహార‌పు అల‌వాట్ల‌తో మ‌నం మ‌న‌ శ‌రీరాన్ని పెంచుకోవ‌డ‌మే కాకుండా వివిధ జ‌బ్బుల‌ను కొని తెచ్చుకొంటున్నాం. ఒబేసిటీ చాలా మందిలో గుండెజబ్బులతోపాటు ప‌లు క్యాన్స‌ర్లు వ‌స్తాయ‌ని ఇటీవ‌లి ప‌రిశోధ‌న‌ల్లో తేలింది.

ప‌్ర‌స్తుత రోజుల్లో చిన్న, పెద్ద అనే తేడాల్లేకుండా అందరినీ ఊబకాయం బాధిస్తోంది. నిజానికి వూబకాయం అనేది ఓ వైద్య స్థితి. శరీరంలో అధికంగా చేరిన కొవ్వు కార‌ణంగా ఊబ‌కాయం ఏర్పడుతుంది. ఇది ఆరోగ్యంపై దుష్పరిణామాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఊబకాయంతో పలు రకాల వ్యాధులు, మరీ ముఖ్యంగా కార్డియోవాస్క్యులర్ స‌మ‌స్య‌లు, టైప్ 2 మధుమేహం, అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా, కొన్ని రకాల క్యాన్సర్‌లు, ఆస్టియో ఆర్థ్రరైటిస్, హైపో థైరాయిడిజం, లూప‌స్‌, నెల‌స‌రిలో తేడాలు, పోరియోసి అనే చ‌ర్మ‌సంబంధ వ్యాధుల‌తోపాటు డిప్రెషన్ వంటివి వచ్చే అవకాశం ఉందని వైద్యనిపుణులు సెల‌విస్తున్నారు.

ఊబకాయం వల్ల ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌ వచ్చే ఆస్కారం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈస్ట్రోజన్‌ హార్మోను ఎక్కువగా విడుదల కావడం, అధికరక్తపోటు ఉండటం, సంతానలేమి వంటివివన్నీ ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌ రావడానికి దారితీస్తాయి. ఇవన్నీ పరోక్షంగా పీసీఓఎస్‌ సమస్యతో ముడిపడి ఉంటాయి. ఈ పరిస్థితిని వూపేక్షిస్తే రొమ్ము, కొలోన్‌ క్యాన్సర్లకు దారితీస్తాయ‌ని ప‌రిశోధ‌కులు హెచ్చ‌రిస్తున్నారు. అతి బరువుతో భిన్నరకాల క్యాన్సర్‌ల ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది.

సాధారణంగా 50ఏళ్లు పైబడినవారిని ఎక్కువగా క్యాన్సర్‌ చుట్టుముడుతుంటుంది. బాడీ మాస్ ఇండెక్స్ 30 కి మించినవారిలో ప్రమాదకర క్యాన్స‌ర్ కణితులు విజృంభించే ముప్పు చాలా ఎక్కువని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. శరీరంలో అవసరానికి మించి చేరిన కొవ్వు నిల్వలు క్యాన్సర్ కారకాలైన హార్మోన్లను మరింత ప్రభావితం చేస్తాయని ఈ పరిశోధనల్లో తేలింది. భవిష్యత్తులో బరువు తగ్గినప్పటికీ.. క్యాన్సర్‌ ముప్పు మాత్రం అలానే ఉంటోందని తేల్చారు. దీనికి ప్రధాన కార‌ణంగా డీఎన్‌ఏల్లో మార్పులేనని పరిశోధకులు తెలిపారు. మొత్తంగా 25 రకాల క్యాన్సర్‌ల ముప్పును ఊబకాయం పెంచుతున్నట్లు ప‌రిశోధ‌కులు గుర్తించారు.

ఊబకాయం వల్ల వృద్ధ మహిళల్లో అండాశయ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వంటివి ఎక్కువగా వస్తున్నాయి. అలాగే ఊబకాయంతో బాధపడే యువతుల్లో మలద్వారానికి సంబంధించిన క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ అని గుర్తించారు. ఊబకాయం,ఎక్కువ బరువు పెరగడం వల్ల.. కడుపు, కాలేయం, పిత్తాశయం, క్లోమం, అండాశయం,బ్రెయిన్ ట్యూమర్, థైరాయిడ్, రక్త క్యాన్సర్లు వంటి దాదాపు 25 ర‌కాల క్యాన్స‌ర్లు మ‌న‌ల్ని చుట్టుముడ‌తాయ‌ని వాషింగ్ట‌న్ విశ్వవిద్యాలయం క్యాన్సర్ వ్యాధి నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

సిగ‌రెట్ ఎక్కువ‌గా స్మోకింగ్ చేసేవారిలో ఒబేసిటీ వ‌చ్చి లంగ్ క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. బ‌రువు చాలా పౌండ్ల మేర పెరుగ‌డం వ‌లన అడ్వాన్స్‌ ప్రోస్టేట్ క్యాన్సర్తో పాటు నోరు, గొంతు, స్వ‌ర‌పేటిక క్యాన్స‌ర్లు వ‌స్తాయని ప‌రిశోధ‌కులు చెప్తున్నారు.

‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ డిసీజెస్‌’ అని వైద్య‌ప‌రిభాష‌లో ఒబేసిటీని సంబోధిస్తారు. నిజ‌మే.. ఊబ‌కాయం ఉన్న‌వారిలో అన్నిర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌లు క‌నిపిస్తుంటాయి. ఇప్పుడు ఈ జాబితాలో క్యాన్స‌ర్ కూడా చేరినందున బొజ్జ‌ను క‌రిగించుకునే ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌వ్వండి.

Leave a Comment