HEALTH TIPS : ఫోబియా అంటే ఏమిటి? దీనికి కారణం ఏమిటి?

By manavaradhi.com

Published on:

Follow Us
What is a phobia?

చిన్నా పెద్ద తేడా లేకుండా… ప్రస్తుతం కంటి సమస్యలు అందరినీ బాగా ఇబ్బంది పెడుతున్నాయి. వీటిలో కాంతిని చూడలేకపోవడం ఒకటి. దీన్నే ఫోటో ఫోబియాగా చెబుతారు. దీనికి కంటిలో సమస్యలు ఉండొచ్చు, లేదా మన ఆలోచన విధానంలోనే సమస్యలు ఉండొచ్చు. ఎందుకిలా అనే విషయాన్ని వెంటనే గుర్తిస్తే మాత్రం మంచి చికిత్స సులభం అవుతుంది.

రక్తనాళాల్లో క్రమబద్ధమైన సంకోచ వ్యాకోచాల వల్ల మెదడుకు రక్తం అందుతుంది. కంటి ద్వారా మనం చూసిన కాంతి ఇదే మార్గంలో మెదడుకు అందుతుంది. ఇందులో ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు తలనొప్పి రావడం, కళ్ళు తిరగడం, వాంతులు రావడం లాంటివి జరుగుతుంటాయి. అసలు కాంతిని చూడాలంటేనే చాలా ఇబ్బంది ఎదురౌతుంది. కొద్దిపాటి కాంతిని చూసినప్పుడు కూడా తట్టుకోలేని స్థితినే ఫోటో ఫోబియాగా చెప్పుకోవచ్చు.

నిజానికి కళ్ళు ఎక్కువ కాంతిని తట్టుకోలేవు. నేరుగా సూర్యుణ్ని చూడ్డానికి ప్రయత్నించిన ఎవరికైనా ఇవన్నీ సర్వసాధారణంగా ఎదురయ్యే సమస్యలే. సూర్యుణ్ని చూడ్డానికి ప్రయత్నిస్తే… కళ్ళు చిన్నవి కావడం, అదే విధంగా తుమ్ములు రావడం లాంటివి జరుగుతుంటాయి. ఫోటో తీసేటప్పుడు ముఖం మీద పడ్డ లైట్లు కూడా చూడలేకపోవడం, ఇబ్బంది పడ్డం లాంటివీ మనకు తెలుసు. అదే విధంగా ఎప్పుడన్నా రాత్రిళ్ళు చీకటిలో లైటు వేసిన వెంటనే మన కళ్ళు దాన్ని స్వీకరించలేవు. వెంటనే కళ్ళు మూసుకుని నిదానంగా… ఆ వెలుగుకు అలవాటు పడిన తర్వాత గానీ కళ్ళు తెరవలేము. ఇవి సాధారణంగా ప్రతి ఒక్కరికీ ఎదురైన సందర్భాలే.

ఫోటో ఫోబియా మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. చిన్న పాటి కాంతిని చూసినా తట్టుకోలేం. తప్పనిసరి పరిస్థితుల్లో చూడవలసి వస్తే… ముందు కళ్ళు ఇబ్బంది పడతాయి, ఒక్క మాటలో చెప్పాలంటే… కళ్ళలో సూదులు గుచ్చుకుంటున్నంత ఇబ్బందిగా ఉంటుంది. అంతే కాదు ఒక్కసారిగా తలనొప్పి ప్రారంభం అవుతుంది. కళ్ళల్లో వాపు, కళ్ళు మండటం, శుక్లపటల రాపిడి, ఎక్కువగా కళ్ళ అద్దాలు ఉపయోగించడం, లేదా ఇతర కళ్ళ వ్యాధుల వలన ఫోటో ఫోబియా సంభవించవచ్చు. తక్కువ వెలుగును చూసినా కూడా… తీవ్రమైన నొప్పి, మండుతున్న భావన కనిపిస్తే… వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఇతర కంటి సమస్యలు ఉన్నవారికి ఫోటో ఫోబియా వచ్చే అవకాశం ఉంది. అంతే కాదు… కంటి మీద తీవ్ర ఒత్తిడి కలిగించడం, లేదా అసలు కంటికి వెలుగును అలవాటు చేయకపోవడం లాంటివి కూడా ఫోటో ఫోబియాకు కారణం అవుతాయి. చాలా మంది బయటకు వెళ్ళేటప్పుడు నల్ల కళ్ళద్దాలు ధరిస్తారు. నిజానికి ఇది చాలా మంచి అలవాటు. అయితే… ఎండ పెద్దగా లేని సమయంలో కూడా వాళ్ళు కళ్ళద్దాలు తీయరు. దీని వల్ల తక్కువ వెలుగును చూడ్డానికి కళ్ళు అలవాటు పడతాయి. ఆ తర్వాత చిన్న పాటి వెలుతురుకే కళ్ళు ఇబ్బందులు పడుతుంటాయి. ఇంకొంత మంది ద్విచక్రవాహనాల మీద వెళ్ళే సమయంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరు. ఫలితంగా పొగ, దుమ్ము ధూళి వారి కళ్ళల్లో కి వెళ్ళి పోతాయి. ఆ తర్వాత ఇన్ఫెక్షన్లు మొదలై ఫోటోపోబియాగా మారుతుంది.

పార్శ్వపు నొప్పి ఉన్న వారిలో కూడా ఫోటో ఫోబియా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. మైగ్రేన్‌ నొప్పి ఉన్నప్పుడు ఈ రక్తనాళాలు గట్టిగా ముడుచుకుపోయి… వెంటనే వ్యాకోచిస్తాయి. దాంతో రక్తం ఓ ప్రవాహంలా (గషింగ్‌) వచ్చేస్తుంది. ఫలితంగా తీవ్రమైన నొప్పి వస్తుంది. ఈ సంకోచ, వ్యాకోచాల సమయంలో మెదడులో ఉండే సెరిటోనిన్‌, ఎపీనెఫ్రిన్‌, 5 హైడ్రాక్సీట్రిప్టమిన్‌ (5హెచ్‌టీ), ఎసిటైల్‌కోలిన్‌ వంటి రసాయనాలు నొప్పికి కారణమవుతాయి. నొప్పికూడా విచిత్రంగా సాధారణంగా ఒకవైపే వస్తుంది. కొంత మందిలో వెలుగును చూడడం వల్ల ఈ నొప్పి మరింత ఎక్కువ అవుతుంది. ఇలాంటి వారిలో ఫోటో ఫోబియా ఉందని మనం గుర్తించాలి.

  • ఎక్కువ వెలుగులో కంటి అద్దాలు తప్పని సరిగా ధరించాలి.
  • ఫోటోలు, సెల్ఫీలు లాంటి వాటికి అతిగా అలవాటు పడ కూడదు.
  • తక్కువ వెలుగు ఉన్నప్పుడు కంటి అద్దాలు లాంటి వాడ కూడదు.
  • కంటి పై ఒత్తిడి పడే పనులకు దూరంగా ఉండాలి.
  • కంప్యూటర్ల మీద పని చేసేటప్పుడు యాంటీగ్లేర్ అద్దాలను వాడాలి.
  • స్మార్ట్ ఫోన్ వాడేటప్పుడు కూడా యాంటీ గ్లేర్ అద్దాలు వాడితే మరీ మంచిది.
  • ఎప్పటికప్పుడు కంటి సమస్యలను చెక్ చేయించుకుంటూ ఉండాలి.
  • కంటికి తగినంత విశ్రాంతి ఇవ్వాలి. ఈ విశ్రాంతి మరీ ఎక్కువ కాకుండా జాగ్రత్త పడాలి.
  • ప్రతి రోజు ఉదయం ఎండలో కాసేపు ఉంటూ ఉండాలి.

ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఫోటో ఫోబియా నుంచి బయపడ వచ్చు. అంతే కాదు… ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు చేసుకోవాలి. సమయానికి భోజనం చేయడం, నూనెలో వేయించిన పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండడం, నిల్వ ఆహారాన్ని తీసుకోకపోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా ఆకుకూరలు, పళ్ళు, విటమిన్స్ ఉండే కాయగూరలు తీసుకోవాలి. సరైన వేళలో ఆహారం తీసుకుంటే… ఈ సమస్యలేవీ బాధించవు. ఎక్కువ ఒత్తి కూడా ఫోటో ఫోబియాను తెచ్చి పెడుతుంది. మన మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

Leave a Comment