Remedies for Depression – డిప్రెషన్ దూరం కావాలంటే ఈ పనులు చేయండి!

By manavaradhi.com

Published on:

Follow Us
Remedies for Depression

నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో ఎవరినీ చూసినా నిత్యం అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఒత్తిడికి లోనవుతున్నారు. దీంతో ఇది కేవలం మానసిక ఆరోగ్యమే కాకుండా శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతోంది.ఒకే దగ్గర కూర్చుని రోజంతా పని చేయడం వల్ల మనకు తెలీకుండానే ఒత్తిడీ, ఆందోళన గురౌతున్నాం. డిప్రెష‌న్ ఒక మాన‌సిక రుగ్మ‌త‌. దీన్నే కుంగుబాటు అని పిలుస్తారు.

మ‌హిళ‌లు.. పురుషులు, చిన్నా.. పెద్దా ఇలా ఎలాంటి భేదం లేకుండా ఎవ‌రికైనా ఇది రావొచ్చు. బాధ‌, కోపం, నిరుత్సాహం, ఆందోళ‌న లాంటి భావోద్వేగాలు అంద‌రికీ వ‌స్తుంటాయి. అయితే డిప్రెష‌న్ బాధితుల్లో ఇవి దీర్ఘ‌కాలం ఉంటాయి. అంతేకాదు వారి జీవితాన్ని ఇవి తీవ్రంగా ప్ర‌భావితం చేస్తుంటాయి.

కుంగుబాటు చాలా కార‌ణాల వ‌ల్ల‌ వ‌స్తుంది. ఇది వ్య‌క్తిని బ‌ట్టీ మారుతుంటుంది. అయితే ఆప్తుల్ని కోల్పోవ‌డం, భాగ‌స్వామి దూరం కావ‌డం, పెద్ద‌పెద్ద‌ జ‌బ్బులు.. లాంటి తీవ్రంగా కుంగ‌దీసే ప‌రిణామాల వ‌ల్లే ఎక్కువ మంది డిప్రెష‌న్ బాధితులుగా మారుతుంటారు. మెనోపాజ్‌, నిద్ర స‌మ‌స్య‌లు, కొన్ని ఔష‌ధాల దుష్ప్ర‌భావం, మంచి ఆహారం తీసుకోక‌పోవ‌డం, ఫిట్‌నెస్ లేకపోవ‌డం లాంటివీ కుంగుబాటు ముప్పును పెంచుతాయి. కొన్నిసార్లు జ‌న్యుప‌ర‌మైన కార‌ణాల వ‌ల్లా కుంగుబాటు సంక్ర‌మిస్తుంది.

డిప్రెష‌న్ ల‌క్ష‌ణాలు చాలా ఉంటాయి. ఇవి ఒక్కొక్క‌రిలో ఒక్కోలా క‌నిపిస్తుంటాయి. అయితే, అందరిలోనూ క‌నిపించే కొన్ని ల‌క్ష‌ణాలు .. భావోద్వేగాలు,దీర్ఘ‌కాలం బాధలో ఉండ‌టం,ఎప్ప‌టిక‌ప్పుడే ఏడుపు వ‌స్తున్న‌ట్లు అనిపించ‌డం,త‌ర‌చూ నిరాశ ఆవ‌హించ‌డం,స‌ర్వం కోల్పోయిన‌ట్లు అనిపించ‌డం,ఎక్కువ‌గా ఆందోళ‌న ప‌డ‌టం,చిన్న‌చిన్న విష‌యాల‌కే చిరాకు ప‌డ‌టం,స‌హ‌నం కోల్పోవ‌డం,శారీర‌క ప‌ర‌మైన ఈ ల‌క్ష‌ణాలు సాధార‌ణంగా చాలా మందిలో క‌నిపిస్తాయి. అయితే ఇవి దీర్ఘ‌‌కాలం ఉంటే వైద్యుల‌ను సంప్ర‌దించాలి. మాన‌సిక నిపుణులైతే ఇంకా మంచిది.

రెండు వారాల కంటే ఎక్కువ రోజులు ఈ ల‌క్ష‌ణాలు ప‌దేప‌దే క‌నిపిస్తే.. ఎలాంటి ఆల‌స్యం లేకుండా వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించాలి. అంతేకాదు ఈ ఆలోచ‌న‌ల గురించి స్నేహితులు, బంధువులు ఇలా ఎవ‌రో ఒక‌రితో మాట్లాడాలి.ప‌క్క‌నుండే వారిలో ఈ డిప్రెష‌న్ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఏం చేయాలంటే.. మొద‌ట వారు చెప్పేవన్నీ జాగ్ర‌త్త‌గా వినాలి. ఒక్కోసారి మాట్లాడ‌టం, భావాల‌ను పంచుకోవ‌డం కూడా డిప్రెష‌న్ త‌గ్గేందుకు స‌హాయ ప‌డ‌తాయి. అయితే, వినేట‌ప్పుడు ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌కూడ‌దు. వారిని ప్రోత్స‌హించేలా, భావాల‌ను పంచుకొనేలా మాట్లాడాలి. డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లేలా డిప్రెష‌న్ బాధితుల్ని ప్రోత్స‌హించాలి.

డిప్రెష‌న్ రోగుల‌ను.. స్వ‌ల్ప‌, మధ్య‌స్థం, తీవ్రం అనే మూడు కేట‌గిరీలుగా విభ‌జిస్తారు. వీటి ఆధారంగానే వైద్యులు చికిత్స అందిస్తారు. సాధార‌ణంగా ఎక్కువ మందికి కాగ్నిటివ్ బిహేవియ‌ర‌ల్ థెర‌పీ (సీబీటీ)తో చికిత్స ప్రారంభిస్తారు. ఇది ఒక కౌన్సెలింగ్ ప్ర‌క్రియ‌. దీనిలో భాగంగా నెగెటివ్ ఆలోచ‌న‌లు, తీవ్ర‌మైన బాధ‌కు కార‌ణాలు గుర్తించి.. వాటిని అధిగ‌మించేందుకు వైద్యులు సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇస్తుంటారు. ప్ర‌తికూల ఆలోచ‌న‌ల మూలాల‌తోపాటు వాటిని అధిగ‌మించే మార్గాలూ తెలుసుకోవ‌డం ద్వారా.. ప్ర‌తికూల ప్ర‌వ‌ర్త‌న‌ల జోలికి పోకుండా అడ్డుకోవ‌చ్చు.

కుంగుబాటు తీవ్రంగా ఉంటే.. యాంటీ-డిప్రెసెంట్ ఔష‌ధాల‌ను వైద్యులు సూచిస్తారు. ఇవి భావోద్వేగాల‌ను ప్ర‌భావితం చేసే మెద‌డులోని ర‌సాయ‌న చ‌ర్య‌ల‌ను క్రియాశీలం చేస్తాయి. దీంతో కొంత‌వ‌ర‌కు నిస్సత్తువ‌‌, నిరాశ‌, భావోద్వేగ స‌మ‌స్య‌ల‌ను అడ్డుకోవ‌చ్చు. అయితే ఈ ఔష‌ధాల‌తో కొన్ని ప్ర‌తికూల ప్ర‌భావాలూ ఉంటాయి.కొంతమంది రోగుల‌కు ధ్యానం, వ్యాయామం, మ్యూజిక్‌, ఆర్ట్ థెర‌పీల‌ను సూచిస్తారు. దినచర్యలో కొన్నిమార్పులు చేసుకుంటే ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.

వ్యాయామానికి ఒత్తిడిని తగ్గించే శక్తి ఉంటుంది. పొద్దున నిద్ర లేచిన వెంటనే కనీసం అరగంట వ్యాయామం చేయటం అలవాటు చేసుకోవాలి. దానివల్ల రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. రోజు మొత్తం హుషారుగా ఉండగలుగుతాం.

ఆందోళన తగ్గటానికి మనో నిబ్బరం ముఖ్యం. ఆందోళ‌నకు గుర‌యిన‌ట్టుగా క‌నిపించే భౌతిక‌ లక్షణాలు నార్మల్ గా కనిపించినా.. రోజులో కలిగే ఒత్తిడి కార‌ణంగా హ్యాండిల్ చేయలేకపోతాం. ఫ‌లితంగా అనేక ఆరోగ్య స‌మ‌స్య‌లు చుట్టుముడ‌తాయి. అందుక‌ని ఆందోళ‌నను త‌గ్గించుకొనే ప‌నులు చేయ‌డం మంచిది

Leave a Comment