మనిషి శరీరంలో అతిసున్నితమైన వ్యవస్థలో వినికిడి వ్యవస్థ ఒకటి. బయటకు కనిపించే చెవికి.. మెదడుకు సంధానం చేసే వ్యవస్థకు మధ్యలో కొంత భాగం ఉంటుంది. దీన్ని వైద్య పరిభాషలో మధ్య చెవి అంటారు. బయట చెవికి పెద్దగా సమస్యలు రావు. లోపలి చెవికి బయట నుంచి ఎటువంటి హాని జరగదు. అయితే ఈ మధ్య చెవికి మాత్రమే బయట నుంచి ఇబ్బందులు ఎదురువుతాయి. అది కూడా ఎవరి చెవికి వారు చేసుకునే హాని అన్నమాట. మనిషి తనంతట తానే కర్ణభేరిని పాడు చేసుకోవడం తరచూ జరిగేది. దీన్నే చెవిలో రంధ్రం పడటం, కర్ణభేరికి చిల్లు పడటం అని కూడా అంటారు.
మనిషికి జ్ఞానేంద్రియాలు అత్యంత అవసరమైనవి. వాటిలో అతి ముఖ్యమైనది, సున్నితమైనది కన్ను అయితే ఆ తరువాత చెవికి అంతటి ప్రాధాన్యత ఉంటుంది. నిర్లక్ష్యంగా చేసే కొన్ని కొన్ని పనుల వల్ల కర్ణభేరికి రంధ్రం పడుతుంది. దీంతో శాశ్వతంగా వినికిడి శక్తి నశించిపోతుంది. ఈ ప్రపంచం ఒక్కసారిగా నిశ్శబ్ధం అయితే.., ఆ నిశ్శబ్ధానికి మనమే కారణం అనుకుంటే.. అదెంత భయంకరంగా ఉంటుందో కదా. కర్ణభేరికి చిల్లు పడిన వ్యక్తి పరిస్థితి కూడా అలానే ఉంటుంది.
చెవికి రంధ్రం పడటం అనేది సాధారణంగా వచ్చే వ్యాధి కానే కాదు. కొన్నిసార్లు చెవికి ఇన్ ఫెక్షన్లు సోకి, దీర్ఘకాలం పాటు చీము కారుతున్నా పట్టించుకోకపోతే అది కర్ణభేరిని దెబ్బతీస్తుంది. అయితే ఈ సమస్య కంటే ఎక్కువగా నిత్య జీవితంలో వినే అతి శబ్దాలు కర్ణభేరికి రంధ్రం పడుతుంది. లౌడ్ స్పీకర్ల ద్వారా పెద్ద పెద్ద శబ్ధాలు తరచూ వినడం.., హఠాత్తుగా వినిపించే భారీ శబ్దాలు, ఎక్కువ ఎత్తు నుంచి స్విమ్మంగ్ కోసం నీటిలో దూకడం వంటి అతి చర్యల వలన కర్ణభేరీ దెబ్బతింటుంది. విమానం ల్యాండింగ్ సమయంలో వచ్చే శబ్ధాలు కూడా చాలమంది చెవిలో రంధ్రం పడేలా చేస్తాయి. కర్ణభేరి పాడయితే ఆ చెవిలో పూర్తిగా వినికిడి లోపిస్తుంది. క్రమంగా అది మనిషిని మిగతా మనుషుల నుంచి వేరుచేస్తుంది. దీంతో ఒంటరి అయ్యి డిప్రెషన్ లోకి జారుకునే అవకాశం కూడా ఉంది.
కర్ణభేరీ రంధ్రం పడిన వెంటనే దాదాపుగా తెలిసిపోతుంది. హఠాత్తుగా వినిపించే శబ్ధాలతో కర్ణభేరీకి చిల్లు పడిన వెంటనే రక్తం కారుతుంది. ఆ వెంటనే ఒక చెవి ద్వారా వినలేకపోతున్నామనే విషయం అర్థమవుతుంది. కొంతమందిలో మాత్రం చెవిలో రంధ్రం సమస్యను నెమ్మదిగా గుర్తిస్తారు. చెవిలో చీము, గులిమి పెరిగిపోయి,ఇతర సమస్యల వలన రంధ్రం పడినప్పుడు ఇలా నెమ్మదిగా గుర్తించడం ఉంటుంది. ఫోన్ లో మాటలు వినిపించకపోవడం.., టీవీ పెద్ద సౌండ్ లో చూస్తుండటం.., ఎదుట మనుషుల తమతో సంభాషించడానికి అరుస్తున్నట్టుగా అనిపించడం లాంటి లక్షణాలతో ఈ సమస్యను గుర్తించవచ్చు.
శ్వాస సంబంధమైన వ్యాధులు ఉన్నవారిలోనూ చెవి సమస్యలు కనిపిస్తాయి. ముక్కు ద్వారా గట్టిగా శ్వాస పీల్చుకున్నప్పుడు, చీముడు చీదినప్పుడు ఆ ప్రభావం చెవిపై మనకు తెలుస్తుంది. ఇలాంటి సమయాల్లో కూడా కర్ణభేరి దెబ్బతింటుంది. అయితే ఇలాంటివి అరుదుగా మాత్రమే జరుగుతాయి.
కర్ణభేరికి రంధ్రం పూడ్చడానికి చిన్న పాటి మైక్రోసర్జరీలు, ప్రాథమిక దశలో అయితే మందులు ఉన్నాయి. కానీ సున్నితమైన వినికిడి వ్యవస్థ నాశనం అయిన తరువాత బాగు చేసుకునే కంటే కాపాడుకోవడమే ఉత్తమం. చెవిలో పిన్నులు, పెన్నులు, పుల్లలు పెట్టి తిప్పుకోవడం… హఠాత్తుగా అవి చెవిలోపలకు గుచ్చుకోవడం వలన తరుచూ కర్ణభేరికి రంధ్రం పడుతుంది. అలాంటి అలవాట్లు మానుకోవాలి.
పెద్దవారిని చూసి పిల్లలు చేస్తారు కాబట్టి ఈ విషయంలో మరింత జాగ్రత్త అవసరం. చిన్నారుల్లో పెన్సిళ్ళు చెవిలో పెట్టుకోవడం వలన ఎక్కువగా కర్ణభేరీ దెబ్బతింటూ ఉంటుంది. కాబట్టి వారికి వివరించి చెవి జాగ్రత్తగా ఉంచుకునేలా అప్రమత్తం చేయాలి. అతిగా శబ్ధాలు వినడం వలన చెవి ఎంత ఇబ్బంది పడుతుందో అందరికీ తెలుసు. అలా చెవి ఇబ్బంది పడుతుందని తెలియగానే లౌడ్ స్పీకర్ల వాల్యూమ్ తగ్గించాలి. కర్ణభేరికి రంధ్రం పడిందని అనిపించగానే వైద్యుడ్ని సంప్రదిస్తే వీలయినంత త్వరగా సమస్య పరిష్కారం అవుతుంది. అలాంటి సమయంలో మరో చెవి ఉంది కదా అని నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తే.. జీవితాంతం ఒక్క చెవికే పరిమితం కావాల్సి వస్తుంది.
సౌండ్ తగ్గించు… చెవులు చిల్లులు పడుతున్నాయి అంటారు. ఇది అక్షరాలా నిజం. అతి ఎక్కడైనా అనర్ధదాయకమే. ప్రమాదావశాత్తు కర్ణభేరికి రంధ్రం పడితే అర్థం చేసుకోవచ్చు. చిల్లును పూడ్చుకోవచ్చు. కానీ అనాలోచితంగా మన వినికిడి శక్తిని మనమే నాశనం చేసుకోవడం మూర్ఖత్వం.