Stress : ఈ జాగ్రత్తలు పాటిస్తే ఇట్టే మీ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు!

By manavaradhi.com

Updated on:

Follow Us

ప్రస్తుతం జీవితం ఉరుకులు పరుగులమయమైపోతోంది. దీంతోపాటు ప్రతి మనిషి తమ తమ కార్యాలయాలలో పని ఒత్తిడికి గురవుతుంటారు. శారీరక ఒత్తిడితోపాటు, మానసిక పరమైన ఒత్తిడిని కూడా ఎదుర్కోక తప్పడం లేదు. దీంతో వారిలో కోపం, నిరాశా.. నిస్పృహలు చుట్టుముడుతుంటాయి. వీటి వలన వారి పని, ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. టెన్షన్, పనిభారం, ఒత్తిడి, బాధ కలిగినప్పుడు మన శరీరంలోని కొన్ని ర‌కాల‌ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఆ సమయంలో మన శరీరంలో ఒత్తిడి స్థాయి పెరుగుతుంది. అలాంటప్పుడు మన శరీరానికి శక్తి లేదా అలసటతో కూడిన అనుభూతి కలుగుతుంది. పని ఒత్తిడి కారణంగా కోపం కూడా ఎక్కువవుతుంది. దీంతో పనిలో మనసు కేంద్రీకృతం కాదు. ఒత్తిడి మానసిక ఆరోగ్యంపైనే కాకుండా శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతోంది. జీవ‌న‌శైలిలో మార్పులు చేర్పులు చేసుకోవ‌డం ద్వారా ప్ర‌శాంతంగా ఉండొచ్చు. ఒత్తిళ్ల‌ను చిత్తు చేయ‌డం ద్వారా వివిధ వ్యాధులు రాకుండా కూడా చూసుకోవచ్చు.

ఒత్తిడి ఆడ, మగ ఇద్దరికీ ఉంటుంది. కానీ అది ఆడవారి మీద శారీరకంగా, మానసికంగా ఎక్కువ ప్రభావం చూపుతుంది. మహిళలకుండే శారీరక నిర్మాణం, కుటుంబంలోని బాధ్యతల వల్ల ఈ విషయంలో కొంత ఎక్కువగానే సమస్యను ఎదుర్కొంటున్నారు. వీటితో పాటు శరీరంలో జరిగే కొన్ని మార్పుల పైనా ప్రభావం పడుతుంది. ఫలితంగా అనారోగ్యాల పాలవుతున్నారు. భావోద్వేగ ఒత్తిడి సమస్య అధికంగా మగవారి కంటే ఆడవారికే ఎక్కువగా ఉంటుందని నిపుణులు సైతం పేర్కొంటున్నారు. సాధారణంగా మహిళలు ఎదుర్కొనే మానసిక సంఘర్షణ, ఒంటరి తనం, అభద్రత వంటివే మైగ్రేన్‌, తలనొప్పి, కడుపులో పుండ్లు, గుండె నొప్పి, హైపర్‌ టెన్షన్‌, మానసికంగా కుంగిపోవడం వంటి సమస్యలకు ఎక్కువగా దారితీస్తుంటాయి. ఒత్తిడి వల్ల శరీరంలో హార్మోన్లు ప్రభావితమవుతాయి. శరీరంలోని ప్రతి భాగం దీని ప్రభావం వల్ల అనేక సమస్యలకు లోనవుతుంది. కోపం, బాధ లాంటి నెగటివ్‌ ఎమోషన్స్‌ పెరిగి యాంగ్జయిటీ, డిప్రెషన్‌లకు దారితీస్తాయి. శారీరకంగా కూడా ఒత్తిడి ప్రభావం ఉంటుంది. ఫలితంగా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. ఒత్తిడి అనేది శ‌రీరంలో అద‌న‌పు కొవ్వును విడుద‌ల చేస్తోంది. ఒత్తిడితో అద‌నంగా విడుద‌లైన కొవ్వు స్థాయిలు స‌రైన శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డంతో శ‌రీరంలో పేరుకుపోతున్నాయి. ఫ‌లితంగా ఊబ‌కాయం వ‌స్తోంది.

ఒత్తిడి ఎక్కువ‌గా ఉన్న‌వారు త‌మ జీవ‌న‌శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. వ్యాయామంతో మ‌న రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ మెరుగ్గా ప‌నిచేస్తుంది. రోజూ క్ర‌మం త‌ప్ప‌కుండా ఏరోబిక్ వ్యాయామాలు చేస్తుంటే మ‌న శ‌రీరానికి ఒత్తిడిని త‌ట్టుకునే శ‌క్తి పెరుగుతుంది. ఒత్తిడికి గురయిన‌వారు మ‌రీ ఎక్కువ లేదా మ‌రీ త‌క్కువ ఆహారం తీసుకుంటూ ఉంటారు. ఇది కూడా ఆరోగ్యంపైన‌ ప్ర‌భావం చూపుతుంది. క‌నుక ఆందోళ‌న ఉన్న‌వారు ఆహారం విషయంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి. ధ్యానం యోగా శ్వాస వ్యాయామాలు లాంటి రిలాక్సేష‌న్ ప‌ద్ధ‌తుల ద్వారా ఆందోళ‌న‌ని త‌గ్గించుకునే శ‌క్తి పెరుగుతుంది. ధ్యానంతో…. మ‌న‌సుకి గ‌తం భ‌విష్య‌త్తుల‌లోకి వెళ్ల‌కుండా ప్ర‌స్తుతంలో ఉండ‌టం అల‌వాట‌వుతుంది. అలాగే ఒత్తిడి హార్మోన్లు స్ర‌వించ‌డం త‌గ్గుతుంది. నెగెటివ్ ఆలోచ‌న‌లు త‌గ్గి పాజిటివ్‌గా ఆలోచించ‌గ‌లుగుతారు. రోజువారీ జీవితంలో ఇలాంటి మార్పుల‌తో ఆందోళ‌న‌ నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. త‌మ‌కు తాముగా ఆందోళ‌న, మ‌నో వేద‌న‌ల‌ నుండి బ‌య‌ట‌ప‌డ‌లేని వారు మాన‌సిక నిపుణుల‌ను సంప్ర‌దించి ఈ స‌మస్య‌ని ఒదిలించుకోవాలి. లేక‌పోతే మ‌రిన్ని శారీర‌క మాన‌సిక అనారోగ్యాల‌ను కొనితెచ్చుకోవాల్సి వ‌స్తుంది.

Leave a Comment