Dental Health:ఈ రోజు వారి అలవాట్లే మీ దంతాలను పాడు చేస్తాయి..!

By manavaradhi.com

Updated on:

Follow Us

మన శరీరంలోని అవయవాలన్నింటిలో మనం దంతాలను చాలా అశ్రద్ధ చేస్తుంటాం. చాలామంది వాటి శుభ్రత విషయంలో తగిన శ్రద్ధ చూపించరు. అయితే ఆ అశ్రద్ధ ఎప్పుడో ఒకసారి ప్రభావం చూపించకమానదు. దంత సమస్యలు వచ్చాక అవి చాలా బాధిస్తాయి. చిన్నపాటి శ్రద్ధ, అవగాహనలతో…ఎన్నో రకాల దంత అనారోగ్యాలను రాకుండా నివారించవచ్చు. హాయిగా అందమైన, ఆరోగ్యకరమైన చిరునవ్వుని జీవితమంతా సొంతం చేసుకోవచ్చు. చాలా మందిలో గోళ్ళు కొరకడంసాధారణ అలవాటుగా ఉంటుంది. గోర్లను కొరకడం వలన దంతాలు అధిక ఒత్తిడికి లోనవడం వలన అనేక రకాల దంత సంబంధ ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా దవడ కు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.

కొందరు ఏదైనా ఆహారాన్ని గంటల తరబడి నములుతూ ఉంటారు ముఖ్యంగా నాన్ వెజ్ తీసుకునే సమయాలలో, మరియు గట్టిగా ఉండే పదార్ధాలు నములుతున్నప్పుడు ఇలా చేస్తుంటారు. ఇలా అధికంగా నమలడం వలన, దంతాలు ఒత్తిడికి లోనై, పళ్ల మద్య సందులు, చిగుళ్ళ వాపు, వంటి సమస్యలు అధికమవుతాయి. సిట్రస్ జాతి పండ్లు ఆరోగ్యానికి మంచిది. కానీ ఇవి తీసుకున్న వెంటనే నోరుకడిగే అలవాటు చేసుకోవాలి , లేక పోతే ఈ సిట్రస్ సమ్మేళనాలు బాక్టీరియా తో చర్య జరిపి పంటి ఏనామిల్ ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తాయి. దీని కారణంగా సెన్సిటివిటీ, కావిటీలు, దంత క్షయం వంటి సమస్యలు వస్తాయి.

దంతాలను దెబ్బతీసే అలవాట్లు ఏవి ?
కెఫీన్ దంతాలకు మంచిది కాదు, దంతాలమీద గారలు ఏర్పడడం, రంగు తగ్గడం, తద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తడం వంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కాఫీ తీసుకున్న తర్వాత నోటిని శుభ్రపరచుకోవడం మంచిది. లేదా కెఫీన్ ని దూరం ఉంచడం కూడా మంచిది. అదేవిధంగా అధిక వేడి గల పదార్ధాలు కూడా తీసుకోవడం మంచిది కాదు. సోడా దంతాలకు అత్యంత ప్రమాదకారి. ముఖ్యంగా కార్బొనేటెడ్ చక్కెర స్థాయిలు కలిగిన సోడాలు, కూల్ డ్రింక్స్ తీసుకోవడం మూలంగా స్వల్పకాలంలోనే అనేక దంత సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. ఇందులో ఉన్న పాస్ఫారిక్, సిట్రిక్ యాసిడ్స్ నోటిలోని బాక్టీరియాతో అధికంగా చర్యలను జరుపుతాయి. కాబట్టి సోడాలను , ముఖ్యంగా కృత్రిమ చక్కెరలను కలిగిన సోడాలకు దూరంగా ఉండడం చాలా మంచిది.

చక్కెర తో కూడిన చాక్లెట్లు తినడం అధికమైతే అనేక దంత సమస్యలు చుట్టుముట్టాడుతాయి. స్వీట్స్ , కాండీలు వలన వీటిలో చక్కెర తత్వాలు బాక్టీరియాతో అధికంగా చర్యలను జరపగలవు. తద్వారా పళ్ళు ఏనామిల్ లోపానికి గురై పుచ్చడం,కావిటీస్, సెన్సిటివిటీ లకు గురికావడం వంటి సమస్యలను ఎదుర్కొంటాయి. కాబట్టి వీటిని తగ్గించడం మంచిది. లేదా ఇవి తీసుకున్నప్పుడు నోటిని శుభ్రంగా కడగడం అలవాటుగా చేసుకోవాలి.ఇలాంటి సమస్యలన్నీ రాకుండా ఉండాలంటే దంతాల శుభ్రత పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిందే.

దంతాల ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
దంత ఆరోగ్యంలో కీలకమైనది దంతాల పరిశుభ్రత. రోజుకి రెండు సార్లు దంతధావనం తప్పనిసరిగా చేయాలి. దంతాలకు ఆహారం అతుక్కో కుండా చూసుకోవాలి. తినగానే తప్పనిసరిగా పుక్కిలించాలి. ఆరు నెలల నుంచి సంవత్సరానికి ఒకసారి దంతాలను డాక్టర్‌చేత స్కేలింగ్‌ చేయించుకోవాలి. దీనివల్ల దుర్వాసన రాదు. దంత క్షయాన్ని నివారించ వచ్చు. పొగతాగడం, ఆల్కాహాల్‌, గుట్కా లాంటి అలవాట్లు దంతాలకు శత్రువులు. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి బలమైన దవడలు, దంతాలు ఏర్పడతాయి. కాబట్టి మంచి ఆహారమే దంతాలకు క్షేమకరం. తాజా పండ్లు ఎక్కువగా తినాలి. క్యాల్షియం ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోవాలి. కొందరు నెలల తరబడి, వీలైతే సంవత్సరాల తరబడి ఒకే బ్రష్ బాడుతూ ఉంటారు. ఇది మంచి పద్దతి కాదు. ఎక్కువ కాలం వాడిన బ్రష్ లోని బ్రేసిల్స్ గట్టితనానికి లోనవ్వడం కానీ, లేదా బ్రేసిల్స్ మద్య దూరాలు పెరిగి చిగుళ్లను దెబ్బతీయడం కానీ చేస్తాయి. కనీసం 3,4 నెలలకు ఒకసారి బ్రష్ మార్చడం మంచిది. మరియు సున్నితమైన బ్రెసిల్స్ ఉండేలా బ్రష్ ఎంచుకోండి. దంతాలు చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా దంతవైద్యుని సంప్రదిస్తూ నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి.

శీతల పానీయాలు, శక్తి పానీయాలు, ఆల్కహాల్, అతి వేడి పదార్ధాలు, ధూమపానం వంటివి మీ దంత సమస్యలకు ప్రధాన కారకాలుగా ఉన్నాయి. కొందరు జార్ మూతలు, కూల్ డ్రింక్ మూతలు తీయడానికి కూడా పళ్లను వాడుతుంటారు. వీటివల్ల దంతాలు ఎక్కువ ఒత్తిడికి లోనవుతుంటాయి. ఇది మంచి పద్దతి కాదు. కాబట్టి దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లకు దూరంగా ఉంద్దాం … దంత సిరిని కాపాడుకుందాం…

Leave a Comment