ఈ రోజుల్లో చాలామంది నిద్ర విషయంలో చాలా అశ్రద్ధ చేస్తున్నారు… ఫలితంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా నిద్రలేమి సమస్య అధికంగా వేధిస్తోంది. దీనికి రోజువారీగా అనుసరిస్తున్న జీవన విధానాలే కారణమవుతున్నాయి. నిద్రా భంగానికి కారణాలు ఏంటి…. నిద్ర సమస్యలకు దూరంగా ఉండాలంటే జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో ఉప్పుడు మనం తెలుసుకుందాం…
ప్రతి ఒక్కరి జీవన గడియారం సరిగా గడవాలంటే నిద్ర తప్పనిసరి. చక్కని తిండి, సరైన వ్యాయామంతో పాటు మంచి నిద్ర కూడా అవసరమే. ఆహారం లేకపోయినా, వ్యాయామం లేకపోయినా పెద్ద సమస్యలు ఎదురు కాకపోవచ్చు. కానీ నిద్ర లేకపోతే మాత్రం ప్రశాంతత ఉండదు. నిద్రలేమి అనేక అనారోగ్య సమస్యలకు హేతువు అని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం బీజీ జీవితంలో ఉదయం లేచింది మొదలు, పడుకునే వరకూ అనేక ఒత్తిడులను ఎదుర్కొవల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో నిద్రలేమి ప్రధాన సమస్యగా మారింది.
ఈ కారణంగా అనేక శారీరక మానసిక సమస్యలు ఎదురౌతూ ఉన్నాయి. సరైన స్థాయిలో నిద్ర లేకుంటే జీవక్రియలు సరిగా జరగవు. శరీరంలోని అలసట పూర్తిగా దూరం కాదు. ఫలితంగా జీర్ణ సమస్యలు, మానసిక సమస్యలు దరి చేరుతాయి. గుండె సంబంధిత వ్యాదులు, డయాబెటిస్, కీళ్ళనొప్పులు, ప్రీమెచ్యూర్ ,ఏజింగ్ వంటి సమస్యలన్నీ నిద్రలేమి వల్ల కలుగుతాయని అద్యయనాలు చెబుతున్నాయి.
నిద్ర సమస్యకు కారణాలు ఏంటి…?
నిద్రపోవడానికి కనీసం 6 గంటల నుంచి 7 గంటలు సమయం కేటాయించాలి. దీనివల్ల మరో రోజు ఉత్సాహంగా పనిచేయడానికి మార్గం సుగమం అవుతుంది. ఐతే పని ఒత్తిడి కారణంగానే ఇతరత్రా అలవాట్లు , జీవన విధానం వల్ల చాలామంది ఈ రోజుల్లో నిద్రకు తక్కువ సమయం కేటాయిస్తున్నారు. పైగా చేజేతులా నిద్రపోయే అలవాటును తమకు తామే భంగం కలిగించుకుంటున్నారు. రాత్రి భోజనం తర్వాతా చాలా మంది టీ, కాఫీ, చాక్లెట్లు, కూల్ డ్రింక్ లు తాగడం అలవాటు చేసుకుంటున్నారు. ఇది అస్సలు మంచి పద్దతి కాదు. దీని వల్ల నిద్రాభంగం కలుగుతుంది. టీ, కాఫీ ఇతర పదార్థాల్లో ఉండే కెఫిన్ . . కారణంగా శరీరంలో నరాలు మరింత ఉత్తేజితంగా తయారవుతాయి. దీని వల్ల నిద్ర రాకుండా మేల్కునే పరిస్థితి వస్తుంది. కాబట్టి రాత్రి పడకునే ముందు కెఫిన్ కలిగిన పదార్థాలు తీసుకోవడం మంచిది కాదు . .. రాత్రిపూట మద్యం తీసుకోవడం వల్ల కూడా నిద్రాభంగం అవుతుంది.
ఒకవేళ మద్యం తీసుకునే అలవాటు ఉన్నవారు మితంగానే తీసుకోవాలి. అది కూడా సాయంత్రం వరకే ముగిస్తే మంచిది. రాత్రిపూట ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు ఉపయోగించడం వల్ల కూడా నిద్ర పట్టడం కష్టమవుతుంది. టీవీ, కంప్యూటర్ , ట్యాబ్లెట్ , స్మార్ట్ ఫోన్ లో ఎల్ఈడీ బ్లూ లైట్లు నిద్రా భంగానికి కారణమవుతాయి. అందుకే రాత్రిపూట పడక గది చేరే సమయం కంటే 2 నుంచి 3 గంటల ముందుగానే టీవీ , స్మార్ట్ ఫోన్ , కంప్యూటర్ లాంటి పరికరాలను వీలైనంత దూరం పెట్టాలి.
నిద్ర సమస్యలకు దూరంగా ఉండాలంటే జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి..?
- నిద్ర లేమి సమస్యను అందిగమించి, నాణ్యమైన నిద్ర కోసం ప్రయత్నించడం ద్వారా నాణ్యమైన జీవితాన్ని అందుకోవచ్చు.
- ఇందుకోసం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. వాటిలో ప్రధానమైనది రోజూ ఒకటే వేళ నిద్రకు ఉపక్రమిస్తుండాలి.
- 20 నిముషాల వరకూ నిద్ర పట్టకుంటే, ధ్యానం లాంటి వాటి ద్వారా సాంత్వన పొంది నిద్రకు ఉపక్రమించాలి.
- పడక గదిని నిద్ర పోవడానికి, విశ్రాంతికి మార్గంగా మార్చుకోవాలి. అక్కడే తినడం, టీవీ చూడడం, ఆఫీసు పనులు చేసుకోవడం లాంటివి చేయకూడదు.
- నిశ్శబ్ధంగా, రణ గొణ ధ్వనులు లేకుండా తీర్చిదిద్దుకోవాలి.
- నిద్ర పోయే ముందు మరీ ఎక్కువ ఆహారం తీసుకోకూడదు.
- నిద్ర పట్టడం కోసం ప్రత్యేకమైన మందులు లాంటివి అస్సలు వాడకూడదు.
- నిద్రకు ఉపక్రమించడానికి ముందు గోరు వెచ్చని నీటితో స్నానం చేసినట్లైతే చక్కని నిద్ర పడుతుంది.
- గదిలో ఉష్ణోగ్రతను ఆహ్లాదంగా ఉంచుకోవడం, పరిమళ భరితంగా మార్చుకోవడం వల్ల కూడా చక్కని నిద్రకు అవకాశం ఉంటుంది.
రాత్రి పూట ఎక్కువగా ఆహారం తీసుకోవద్దు. అలాగే త్వరగా జీర్ణం కాని ఆహారాల జోలికి వెళ్లవద్దు. అలాగేరోజూ సరైన సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. నిద్రపోవడానికి ప్రాధాన్యమిస్తేనే మంచి ఆరోగ్యం సొంతమవుతుంది. ఐతే నిద్ర రావడానికి రోజంతా శ్రమించడంతోపాటు తేలికపాటి వ్యాయామాలు కూడా క్రమం తప్పకుండా చేయాలి. పడకగది వాతావరణం కూడా గందరగోళం లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం అని గుర్తుంచుకోండి.