ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయం వెళ్తే సాయంత్రం వరకు ఆఫీసులో కుస్తీ పడుతూ పని భారంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ తీరిక లేని జీవితంలో సమయానికి తినకపోవడం, జంక్ ఫుడ్ తినడం లాంటివి చేస్తున్నారు. ఫలితంగా నేటి యువతలో చాలా మంది స్థూలకాయులుగా మారుతున్నారు. మళ్లీ ఆ చెడు కొవ్వును కరిగించేందుకు జిమ్‌లో ఆప సోపాలు పడుతున్నారు.. జిమ్‌లో గంటల పాటు కుస్తీలు పడకుండా సులభమైన రీతుల్లో బరువును తగ్గించుకోవచ్చు.
అధిక బరువుతో అనేకమంది బాధపడుతుంటారు. అధిక బరువును తగ్గించేందుకు ఎంతో శ్రమిస్తుంటారు. నిజానికి అధిక బరువుతో బాధపడేవారు చిన్నపాటి చిట్కాలను పాటించినట్టయితే ఖచ్చితంగా అధిక బరువు సమస్య నుంచి గట్టెక్కవచ్చు. ఇందుకు ప్రతి రోజూ మితంగా అల్పాహారం తీసుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ అల్పాహారం మానెయ్యకూడదు. అల్పాహారం మానెయ్యడం వల్ల బరువు తగ్గకపోగా, పెరుగుతారు. కనుక ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరిగా చేయాలి.
వేగంగా బరువు తగ్గేందుకు తిండి మానేస్తుంటారు. ఇలా చేయరాదు. శరీరానికి రోజువారీ అవసరం అయ్యే శక్తిని ఇవ్వడం కోసం మనం రోజూ నిర్దిష్టమైన పరిమాణంలో ఆహారాన్ని తీసుకోవాలి. వేళకు పోషకాలతో కూడిన పౌష్టికాహారాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి.
కొవ్వు పదార్థాలను తింటే బరువు అధికంగా పెరుగుతారనే అపోహ చాలా మందిలో ఉంది. ఇది తప్పు. నిజానికి అన్ని రకాల కొవ్వులు అలా కాదు. కొన్ని కొవ్వు పదార్థాలు మన బరువును తగ్గిస్తాయి. నెయ్యి, ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనె తదితర నూనెలు బరువు తగ్గించడానికి ఉపయోగపడతాయి. అందువల్ల మనం తీసుకునే ఆహారంతో మితంగా వీటిని తీసుకోవడం ఉత్తమం. జంక్ ఫుడ్స్ తినడం మానేయాలి. వీటి స్థానంలో సీజనల్ పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, నట్స్, చేపలు, పాలు తదితర ఆహారాలను తీసుకుంటే శరీరానికి సంపూర్ణ పోషణ అందుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది.
ప్యాకింగ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. అలాగే, డైట్ ఫుడ్స్‌ను తీసుకోకపోవడమే ఉత్తమం. వ్యాయామం చేసే వారు ఆహారం కూడా సరిగ్గా తీసుకోవాలి. రోజూ తాము చేసే పనిని బట్టి ఎన్ని క్యాలరీలనిచ్చే ఆహారం అవసరం అవుతుందో అంతే తినాలి.
శరీరం బరువు తగ్గటానికి వ్యాయామం, ఆహార నియమాల వంటి వాటిని సరైన క్రమంలో చేయటం ఎంతో ముఖ్యం. మనం చేసే పనిని బట్టి శరీరానికి రోజుకు అవసరమైన పోషకాలు, కేలరీల ప్రకారం ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారం మితంగా రోజుకు అయిదారుసార్లు తీసుకోవడం ఉత్తమం. ఉదయం లేవాలనుకున్న టైం కన్నా 20 నిమిషాల ముందు లేచి వ్యాయామం చేయండి. ఉదయం వ్యాయామం ద్వారా ఎక్కువ ఫలితం పొందవచ్చు.
నిత్యం బరువు తూచుకోవడంపై దృష్టిపెట్టకూడదు. అలా చేయడం వల్ల అనుకున్న లక్ష్యానికి చేరుకోవడం ఆలస్యమవుతుంది. ఆఫీసుగానీ, బయటకుగానీ వెళ్లినప్పుడు అక్కడ దొరికే జంక్ పుడ్ తీసుకోవడం కన్నా ఇంటి నుంచే తీసుకెళ్లడం అలవాటు చేసుకోవాలి. చక్కెరలు, ఆయిల్, ఫ్యాట్స్ తక్కువగా ఉండేట్లు చూసుకోవాలి. తినేప్పుడు గబగబా కాకుండా మెల్లగా తినడం అలవాటుచేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కడుపు నిండిపోయిన భావన కలిగి తినడం ఆపేస్తాం. ఇకపోతే మరో మంచి అలవాటు నీరు తాగడం. రోజులో 4 లీటర్లకు తక్కువ కాకుండా నీరు తాగడం అలవాటు చేసుకోవడం ద్వారా శరీరం సదా హైడ్రేటెడ్‌గా ఉండి ఆకలి ఎక్కువ కాకుండా ఉంటుంది.
ఇంట్లో అయినా బయట అయినా జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం మానేయాలి. కృత్రిమ షుగర్స్ ఉండే పానీయాలను దూరం పెట్టాలి. వీటన్నింటి కంటే వేళకు నిద్రపోవడం, నిత్యం వ్యాయామం చేయడం, సరైన పోషకాలతో కూడిన పౌష్టికాహారాన్ని తీసుకోవడం వల్ల కూడా బరువు తగ్గొచ్చు.
కృత్రిమ పద్దతులలో బరువు తగ్గడం వలన భవిష్యత్ లో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది… కాబట్టి సహజ పద్ధతుల్లో బరువు తగ్గవచ్చు, సహజ పద్దతాల్లో ప్రయతించడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేదు…..వ్యూహాత్మకమైన ఆహార ప్రణాళిక, హెల్తీ డైట్ లైఫ్ స్టైల్‌ను అనుసరిస్తే బరువు తగ్గడమే కాకుండా ఫిట్ గాను ఉంటారు.