చాల మందిలో చల్లటి పదార్థాలేవైనా తాకితే పళ్లు జివ్వుమంటున్నాయి. ఐస్ క్రీమ్ తిన్నప్పుడు, కూల్డ్రింక్, కాఫీ, టీ, సూప్ వంటి తాగినపుడు చాలా మందికి పళ్లు జివ్వున లాగుతాయి. బ్రష్ చేసుకుంటున్నన్నా, చల్లని, వేడి పదార్థాలు తగిలినా పళ్లు జివ్వుమనడాన్ని సెన్సిటివిటీ అంటారు. చాలా మంది ఈ విధమైన సమస్యతో బాధపడుతుంటారు. ఇందుకు కారణం పళ్లపై ఎనామిల్ దెబ్బతినడం. అసలింతకీ ఎనామిల్ ఎందుకు దెబ్బతింటుంది.
మన శరీరంలోనే అత్యంత దృఢమైనవి దంతాలు. ఎముకల తరహాలో బలమైన పదార్థాలతో ఇవి ఏర్పడతాయి. దంతాల్లో ఎనామిల్ పొర, డెంటిన్ పొర, మెత్తటి కణజాలం అని మూడు భాగాలు ఉంటాయి.అన్నింటికన్నా పైన ఉండేది ఎనామిల్ పొర. ఇది పాక్షికంగా పారదర్శకంగా, తెలుపు రంగులో ఉంటుంది. దంతాలకు అత్యంత దృఢత్వాన్ని ఇచ్చేది ఇదే. ఇది ఎంత గట్టిగా ఉంటుందంటే అదే పరిమాణమున్న ఉక్కు కంటే ఎనామిల్ ఎక్కువ దృఢంగా ఉంటుంది.
దంతాలు ఎముకతో నిర్మితమైనా.. అత్యంత దృఢంగా ఉన్నా అవి పూర్తి స్థాయి ఎముకలు కాదు. పైన ఉండే ఎనామిల్ పొర మినహా లోపల మరో రెండు పొరల జీవ కణజాలంతో దంతాలు తయారవుతాయి. ఆ కణజాలానికి రక్త నాళాలు, నాడులు అనుసంధానమై ఉంటాయి కూడా. అయితే దంతాలపై ఉండే ఎనామిల్ పొర దెబ్బతిని క్యావిటీలు ఏర్పడినప్పుడు.. ఏవైనా చల్లటి లేదా వేడి పదార్థాలు తీసుకుంటే నేరుగా డెంటిన్ పొరపై, దాని లోపల ఉన్న మెత్తని కణజాలంపై ప్రభావం పడుతుంది.
మనం తినే ఆహారం నోటి మూలల్లో, దంతాల మధ్య ఉండిపోయినప్పుడు దానిపై బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. ఇది పాచిగా మారి.. దాని నుంచి కొన్ని రకాల ఆమ్లాలు వెలువడి దంతాలకు రక్షణగా ఉండే ఎనామిల్ పొర దెబ్బతిని, రంధ్రాలు ఏర్పడతాయి. వయసు పెరిగిన కొద్దీ మన దంతాల ఎనామిల్ మందం తగ్గిపోయి పసుపురంగులో కనిపిస్తుంటాయి. దీనికితోడు శుభ్రత విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఎనామిల్ పొరపై మరకలు పడతాయి. ప్రధానంగా ఆహార అలవాట్లు, దంతాలు సరిగా శుభ్రపరచుకోకపోవడం దీనికి కారణాలు.
ముఖ్యంగా యాసిడిక్, ముదురు రంగు ఆహార పదార్థాలు, శీతల పానీయాలు, పొగాకు ఉత్పత్తులు వంటి వాటితో దంతాలపై ఉండే ఎనామిల్ పసుపుబారుతుంది. దంతాలకు అంటుకుపోయే క్రోమోజెన్స్ అనే రసాయనాలు వాటిల్లో ఉండడమే దీనికి కారణం. ఇక కాఫీ, టీ వల్ల కూడా ఎనామిల్ పై మరకలు ఏర్పడతాయి. ఎనామిల్ పొర మందం తగ్గిపోకుండా ఉండాలంటే నోట్లో లాలాజలం ఊరుతూ ఉండాలి. లాలాజలం ఎనామిల్ను దెబ్బతీసే బ్యాక్టీరియాను ఎప్పటికప్పుడు సంహరిస్తుంది. దంతాలను అదేపనిగా గట్టిగా బ్రష్ చేయడం ద్వారా కూడా ఎనామిల్ చెడిపోతుంది. సిగరెట్ స్మోకింగ్ అతిగా చేసేవారిలో ఎనామిల్ దెబ్బతిని దంతాలు పూర్తిగా చెడిపోతాయి.
దంతాల ఆరోగ్యం కోసం ఎప్పటికప్పుడు నోటిని శుభ్రపర్చుకోవాలి. రోజూ ఉదయం, రాత్రి నిద్రపోయే ముందు దంతాలను బ్రష్ చేయడం అలవాటు చేసుకోవాలి. నోటిని శుభ్రపర్చుకోవడమంటే కేవలం బ్రషింగ్ చేయడమే కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎక్కువసేపు ఏమీ తినకుండా ఉన్నా కూడా మధ్య మధ్యలో నీటితో పుక్కిలిస్తే దంతాల మధ్య బ్యాక్టీరియా పెరగడాన్ని నియంత్రించవచ్చు.
ఆహారంలో చక్కెర, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటే అవి దంతాల మధ్య చేరి.. బ్యాక్టీరియా పెరుగుదలకు కారణమవుతాయి. అందువల్ల ఇవి ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్న వెంటనే నోటిని శుభ్రం చేసుకోవాలి. కూల్ డ్రింక్స్, యాసిడిటిక్ పదార్థాల్లోని యాసిడ్లు దంతాలను దెబ్బతీస్తాయి. అందువల్ల దంతాల సంరక్షణ కోసం అలాంటి వాటి వినియోగాన్ని తగ్గించాలి.
దంతాలు తెల్లగా అవుతాయని… టూత్ వైటెనింగ్ ఉత్పత్తులు, మౌత్ వాష్ లు విపరీతంగా వాడడం మంచిదికాదు. దానివల్ల ఎనామిల్ దెబ్బతింటుంది. ఇక అప్పుడప్పుడూ దంత వైద్యుడిని సంప్రదించి దంతాలను పరీక్షించుకోవడం మంచిది. దానివల్ల ఏవైనా సమస్యలు తలెత్తితే ప్రారంభ స్థాయిలోనే గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.
ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే చిగుళ్ల దగ్గర ఒక సన్నని పొరగా పాచి ఏర్పడి చిగుళ్లు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. గట్టి టూత్ బ్రష్తో తోముకోవడం వల్ల సెన్సిటివిటీ సమస్య వస్తుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే.. క్రమంగా దంతాలు బలహీన పడి ఊడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నేటి నుంచే దంతాల ఎనామిల్ను కాపాడుకోవడానికి ప్రాథాన్యం ఇవ్వండి. మీ దంతాలను సంరక్షించుకోండి.