అయోధ్యలో నూతనంగా నిర్మించిన మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అనేక విశేషాలు ఉన్నాయి. మనందరి ఆరాధ్య దేవుడు అయినటువంటి శ్రీరామ చంద్రమూర్తి వైభవం ఉట్టిపడేలా అయోధ్య నగర చరిత్ర, విశిష్టత తెలియజేసే విధంగా.. అంతేకాదు ఆధ్యాత్మిక వాతావరణం ప్రతిబింబించేలా ఈ విమానాశ్రయ రూపుదిద్దుకుంది.. ఈ విమానశ్రయం యొక్క మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం…
ఉత్తర్‌ప్రదేశ్ : ఎన్నో ఏళ్లు కలలు కన్న అయోధ్య లో అద్భుతమై శ్రీరామ చంద్రుని ఆలయం కళ్లముందు సాక్షాత్కారం కానుంది. ఈ తరుణంలో భక్తుల సౌకర్యార్థం అయోధ్యలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం సకల హంగులతో రూపుద్దిదుకుంది. ఈ విమానాశ్రయంకు రామాయణ మహా కావ్యమును రచించిన వాల్మీకి మహర్షి పేరున ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం’గా పేరుపెట్టిన దీన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అంతేకాదు కేవలం 20 నెలల్లో సకలసౌకర్యాలతో ఆధ్యాత్మిక వాతావరణం ప్రతిబింబించేలా ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. అంతేకాదు భక్తుల రద్ధిని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో దీన్ని మరింత విస్తరింపచేయనున్నారు.
అయోధ్య విమానాశ్రయం టెర్మినల్ భవనాన్ని శ్రీరామ మందిరాన్ని తలపించేలా తీర్చిదిద్దారు. ప్రధాన ద్వారంపై ఆలయ తోరణాల డిజైన్ రూపొందించారు. శ్రీరాముని జీవితాన్ని కళ్లకు కట్టే కళాఖండాలు, చిత్రాలు, కుడ్యచిత్రాలతో విమానాశ్రయం శోభాయమానంగా కనిపిస్తోంది. 6500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనం నిర్మించారు. భక్తులు ఎక్కువగా వచ్చే రద్దీ సమయాల్లో ప్రయాణికులకు మంచి సేవలు అందించడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయం సమీపంలో బస్సు పార్కింగ్‌తోపాటు దివ్యాంగులకు అనుకూలమైన వసతి సౌకర్యాలు కల్పించారు. ఎల్ఈడీ లైటింగ్, వాననీటి నిర్వహణ, సౌర విద్యుత్ ప్లాంట్, మురుగు శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేశారు. ప్రాంగణం చుట్టూ పరుచుకున్న పచ్చదనం నిర్వహణకు వాడిన నీటిని రీ సైకిల్ చేసి ఉపయోగిస్తున్నారు.
అంతకముందు ఇక్కడ 178 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌ను రూ.350 కోట్లు ఖర్చు చేసి అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేశారు. ఇందుకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం 821 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. రన్‌వే పొడవు 2200 మీటర్లు. ఎయిర్‌బస్-321 విమానాల నిర్వహణకు అనుకూలంగా ఉంటుంది. రెండు లింక్ ‘టాక్సీవే’లతోపాటు ఎనిమిది విమానాలను పార్కింగ్ చేయడానికి అనువుగా స్థలం కేటాయించారు. తొమ్మిది చెక్-ఇన్ కౌంటర్లు, మూడు కన్వేయర్ బెల్ట్‌లు, ఐదు లగేజీ స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేశారు.
ఫేజ్-2లో భాగంగా 50 వేల చ.మీల విస్తీర్ణంలో కొత్త టెర్మినల్ నిర్మాణానికి ప్రణాళిక. రద్దీ సమయాల్లో దాదాపు నాలుగు వేల మందికి, ఏటా 60 లక్షల మందికి సేవలు అందించేందుకు వీలుగా ప్రతిపాదించారు. ప్రస్తుతం 2200 మీటర్లుగా ఉన్న రన్‌వే.. 3750 మీటర్లకు పొడిగింపు. మరో ట్యాక్సీ వే, అదనంగా 18 విమానాల పార్కింగ్‌కు చోటు కల్పిస్తారు.