ఎస్మా అంటే ఏమిటీ? అంగన్‌వాడీలు సమ్మెపై ప్రభుత్వం ఎందుకు ఎస్మా ప్రయోగించింది..?

By manavaradhi.com

Published on:

Follow Us

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రోజురోజుకు ఎన్నికల వేడి రాజుకుంటుంది. అయితే మరోపక్క రాష్ట్రంలో అంగన్వాడి, మున్సిపల్‌ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ… ధర్నాలు చేపట్టడంతో జగన్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. పరిస్థితి ఇలా ఉంటే.. అంగన్‌వాడీల సమ్మెపై ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించడంతో సమస్య మరింత జఠిలం అయింది. ప్రతిపక్షాలు, సంఘాలు, మేధావులు ఎస్మా ప్రయోగం కరెక్ట్‌ కాదని చెబుతున్నారు. ఎస్మా అంటే ఏమిటీ? ఈ చట్టం వలన ఆందోళనకారులకు జరిగే నష్టం ఏంటి…? ఇప్పుడు తెలుసుకుందాం…

మున్సిపల్‌ కార్మికులు ,అంగన్‌వాడీలు నెలరోజులు పైగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కాకపోవడంతో ఎవరికి వారు పట్టు వీడడం లేదు. దీంతో పాలన స్తంభించిపోయింది. మున్సిపల్‌ కార్మికుల సమ్మె కారణంగా పట్టణాలు, పల్లెలు చెత్తతో నిండిపోతున్నాయి. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం అని ప్రభుత్వం చెబుతున్నా అవి అంతంతమాత్రంగానే ఉన్నాయి. రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాలు దాదాపు మూతపడ్డాయి. పేదలకు లభించి కొద్దిపాటి ఆహారం అందక చిన్న పిల్లలు అర్ధాకలిలో గడుపుతున్నారు. 50 రోజులుగా గర్భిణులకు పోషక ఆహారం అందడం లేదు.

అంగన్వాడీల సమ్మెపై సర్కార్‌ ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారిని అత్యవసర సర్వీసు కిందకు తీసుకొస్తూ జీవో నెం.2 జారీ చేసింది. ఆరు నెలలు పాటు సమ్మె నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 2013 జాతీయ ఆహార భద్రత చట్టంలోని సెక్షన్‌ 39 కింద అంగన్వాడీలు అత్యవసర సర్వీసులు కిందకు వస్తారని సర్కార్‌ పేర్కొంది. 1971 అత్యవసర సేవల నిర్వహణ చట్టం కింద సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

‘ఎస్మా’ అనేది ‘ఎసెన్సియల్‌ సర్వీసెస్‌ మెయిన్‌టీనెన్స్‌ యాక్ట్‌’కు సంక్షిప్త రూపం. ఇది సమ్మెలు, హర్తాళ్లు వంటి సందర్భాల్లో ప్రజల దైనందిన జీవనానికి ఇబ్బంది కలగకుండా.. కొన్ని రకాల అత్యవసర సేవల నిర్వహణ అవిచ్ఛిన్నంగా కొనసాగేలా చూసేందుకు 1981లో రూపొందించిన చట్టమిది. అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు తమ విధులకు హాజరు కాకుండా ఆయా సేవలకు విఘాతం కలిగేలా సమ్మెలోకి దిగితే.. జనజీవనానికి ఇబ్బంది కలగకుండా చూసేందుకు ప్రభుత్వానికి ఈ చట్టాన్ని ప్రయోగించే అధికారం ఉంటుంది.

ఈ చట్టం ఎప్పుడు వచ్చిందంటే.. 1980లలో కార్మిక సంఘాల నిరసనలతో దేశం అట్టుడికి పోయింది. ముఖ్యంగా కార్మిక చట్టాల్లో కొన్ని మార్పులు తేవాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ ఉద్ధృత స్థాయిలో ఉద్యమించాయి. 1981లో కార్మిక సంఘాలు పార్లమెంట్‌ ముందు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. దేశవ్యాప్తంగా పరిశ్రమలన్నింటా పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మె కూడా చేయాలని పిలుపునిచ్చారు. క్రమంగా ఈ ఉద్యమం తీవ్రరూపం దాలుస్తున్నట్టు గుర్తించిన ప్రభుత్వం.. తొలుత 12 పరిశ్రమల్లో సమ్మెను నిషేధిస్తూ ‘ఎస్మా’ ఆర్డినెన్స్‌ని తీసుకొచ్చింది. ఆ తర్వాత ఈ ఆర్డినెన్స్‌ స్థానంలో ‘ఎస్మా’ చట్టం తీసుకొచ్చింది.

ఎస్మా నిబంధనలను అతిక్రమించి సమ్మెకు దిగినట్లు ఎవరిపైనైనా బలమైన అనుమానం ఉంటే.. నేరశిక్షాస్మృతి(సీపీసీ)తో సంబంధం లేకుండానే.. పోలీసు అధికారులు వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు. ఎస్మా నిబంధనలకు విరుద్ధంగా సమ్మె ప్రారంభించే, పాటించే ఉద్యోగులను డిస్మిస్‌ చేయడంతో సహా వివిధ రకాల క్రమశిక్షణా చర్యలూ చేపట్టవచ్చు. సమ్మెలో పాల్గొంటున్నవారికి, వారిని ప్రోత్సహిస్తున్న వారికి కూడా జైలు శిక్ష, జరిమానా, లేదా రెండూ విధించవచ్చు. ఈ చట్టం ప్రకారం సమ్మెకు ఆర్థిక సహకారం అందించేవారూ శిక్షార్హులే! ఇలా పలు కఠిన నిబంధనలు, శిక్షలు ఉన్నాయి. న్యాయమైన కోర్కెలపై కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయమని నిరసన తెలపడం తప్పా? సమ్మెను అణచివేసేందుకు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే చట్టాలను తీసుకొస్తారా అంటూ ఆందోళనకారు, రాజకీయ మేధావులు ప్రభుత్వ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎన్నికల వేళ సమస్య పరిష్కారం అవుతుందా.. మరింత జఠిలం అవుతుందో చూడాలి.

Leave a Comment