Chicken Soup:వేడి వేడి చికెన్ సూప్ తాగితే జలుబు తగ్గుతుందా?

By manavaradhi.com

Published on:

Follow Us
Chicken Soup Fights a Cold

అందరిలో అతిసాధారణంగా వచ్చే జలుబు…. వాతావరణంలో మార్పులొచ్చినప్పుడో, కొత్త ప్రదేశానికి వెళ్లొచ్చినప్పుడో ఈ జలుబు మొదలవుతుంది. తుమ్ములతో పాటు ముక్కు కారుతూ… తెగ ఇబ్బంది పెట్టేస్తుంది. ఈ జబ్బు సాధారణమైనదే అయినా… ఔషధం తీసుకోవడమే కాదు, ఆహారం విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చికెన్ సూప్ తో జలుబును తగ్గించుకోవచ్చు.

జలుబు అనేది ప్రధానంగా వైరస్‌ కారణంగా వచ్చే సమస్య. దీనికి రైనో వైరస్‌ వర్గానికి చెందిన ఎన్నో రకాల వైరస్‌లు కారణం కావచ్చు. పైగా ఈ వైరస్‌లు ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటూ ఉంటాయి. కొన్ని కొత్తగానూ పుట్టుకొస్తుంటాయి. కాబట్టి మన రోగ నిరోధక వ్యవస్థ వీటిని గుర్తుంచుకుని పోరాడటం, వీటికి వ్యతిరేకంగా యాంటీబోడీలు తయారు చేసుకోవటం కష్టం. అందుకే అందరినీ తరచూ జలుబు వేధిస్తూనే ఉంటుంది.

సాధారణంగా జలుబు ఒక వారం పాటు బాధిస్తుంది, తర్వాత చాలా వరకూ దానంతట అదే తగ్గిపోతుంది. కాకపోతే ఉపశమనం కోసం తీసుకోనే ఆహారాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మాంసాహారులు చికెన్ ముక్క అంటే ఇష్టపడని వారుండరు. అలాంటి చికెన్ ముక్కలతో తయారు చేసే సూప్‌తో ఎన్నో ఆరోగ్యకరమైన లాభాలు ఉన్నట్టు పరిశోధనాకారులు చెపుతున్నారు. ముఖ్యంగా, బాగా జలుబు చేసినప్పుడు వేడి వేడి చికెన్‌సూప్‌ను కాస్తంత తాగితే జలుబు ఇట్టే తగ్గిపోతుందట.

జలుబు చాలామందిని తరచూ వేధించే సమస్య. ముఖ్యంగా శీతాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది. చిన్నపాటి చిట్కాలతో ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. జలుబును దూరం చేసే వాటిలో ముఖ్యమైనది చికెన్ సూప్. దీనిద్వారా జలుబు ఇట్టే మాయమవుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఇతర వేడి ద్రవాల కన్నా దీనివల్ల శ్వాసనాళాలు తెరుచుకుని జలుబు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుందని స్పష్టం చేస్తున్నాయి. ఈ ద్రవం యాంటి ఇన్ఫ్లమేటరీ గుణం కలిగి జలుబును తగ్గిస్తుంది.

చికెన్‌ సూప్‌లోని ఎమినో యాసిడ్‌కు కండరాలు, రక్తనాళాలను ఉద్దీపింప చేసే గుణం ఉందని, అందుకే ఆ రసం తాగిన వెంటనే మనసు తేలిక పడుతుందని అంటున్నారు వైద్యులు.

చికెన్ సూప్ ఎంతో శ్రేయస్కరం. ఇది చిరుజబ్బుల నుంచి దూరంగా వుంచడంతోబాటు మరింత ఆరోగ్యంగా, సౌష్టవంగా వుండేలా చేస్తుంది. శరీరంలో శక్తిసామర్థ్యల స్థాయిని పెంచుతుంది. పైగా రుచికరంగా వుంటుంది. సూప్స్‌లోని ఎలక్ట్రొలైట్స్ ఆకలిని పెంచడమే కాదు శరీరాన్ని హైడ్రేట్‌ చేయడానికి ఎంతో సహకరిస్తాయి. ప్రత్యేకించి వెజిటబుల్, చికెన్‌ సూప్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని వేడిగా తీసుకోవడం వల్ల ముక్కు, గొంతు, ఛాతీలో ఆవిరి ప్రవేశించి కఫం కరిగి జలుబు, దగ్గు లాంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు.. హాట్‌ సూప్స్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అదనపు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

చికెన్‌సూప్‌ జలుబును తగ్గించడమే కాదు… దాని సువాసనలో ఉండే యాంటీ–ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్స్‌ వల్ల చాలా ప్రయోజనాలు ఒనగూరుతాయని చెబుతున్నారు పరిశోధకులు. అందుకే చికెన్ సూప్ సేవించడం అనేది కేవలం చిట్కా వైద్యం కాదనీ… దీనికి సశాస్త్రీయ ఆధారాలున్నాయని చెపుతున్నారు. జలుబు చేసినప్పుడు తెగ కంగారు పడిపోకుండా చిన్న చిన్న చిట్కాలు ద్వారా కూడా దానినుంచి బయటపడవచ్చు.

Leave a Comment