తళతళ మెరిసిపోవాలని పళ్లను గట్టిగా తోముతున్నారా..!

By manavaradhi.com

Updated on:

Follow Us
Damaging Tooth Enamel ?

బ్రష్‌ చేసుకుంటున్నన్నా, చల్లని, వేడి పదార్థాలు తగిలినా పళ్లు జివ్వుమంటాయి. ప్రతి నలుగురిలో ఒకరు ఈ విధమైన సమస్యతో బాధపడుతుంటారు. ఇందుకు కారణం పళ్లపై ఎనామిల్‌ దెబ్బతినడం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే చిగుళ్ల దగ్గర ఒక సన్నని పొరగా పాచి ఏర్పడి చిగుళ్లు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అస‌లింత‌కీ ఎనామిల్ ఎందుకు దెబ్బతింటుంది.. అలాగే దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

మనలో చాలామంది దంతాల ఆరోగ్యం విషయంలో తగిన శ్రద్ధ చూపించరు. అయితే ఆ అశ్రద్ధ ఎప్పుడో ఒకసారి ప్రభావం చూపించకమానదు. దీని కారణంగా సెన్సిటివిటీ, కావిటీలు, దంత క్షయం వంటి సమస్యలు వస్తాయి. దంతాల్లో అన్నింటికన్నా పైన ఉండేది ఎనామిల్ పొర. ఇది పాక్షికంగా పారదర్శకంగా, తెలుపు రంగులో ఉంటుంది. దంతాలకు అత్యంత దృఢత్వాన్ని ఇచ్చేది ఇదే. దంతాలు ఎముకతో నిర్మితమైనా.. అత్యంత దృఢంగా ఉన్నా అవి పూర్తి స్థాయి ఎముకలు కాదు. పైన ఉండే ఎనామిల్ పొర మినహా లోపల మరో రెండు పొరల జీవ కణజాలంతో దంతాలు తయారవుతాయి. ఆ కణజాలానికి రక్త నాళాలు, నాడులు అనుసంధానమై ఉంటాయి కూడా. అయితే దంతాలపై ఉండే ఎనామిల్ పొర దెబ్బతిని క్యావిటీలు ఏర్పడినప్పుడు.. ఏవైనా చల్లటి లేదా వేడి పదార్థాలు తీసుకుంటే నేరుగా డెంటిన్ పొరపై, దాని లోపల ఉన్న మెత్తని కణజాలంపై ప్రభావం పడుతుంది.

మనం తినే ఆహారం నోటి మూలల్లో, దంతాల మధ్య ఉండిపోయినప్పుడు దానిపై బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. ఇది పాచిగా మారి.. దాని నుంచి కొన్ని రకాల ఆమ్లాలు వెలువడి దంతాలకు రక్షణగా ఉండే ఎనామిల్ పొర దెబ్బతిని, రంధ్రాలు ఏర్పడతాయి. వయసు పెరిగిన కొద్దీ మ‌న దంతాల‌ ఎనామిల్ మందం తగ్గిపోయి పసుపురంగులో కనిపిస్తుంటాయి. దీనికితోడు శుభ్రత విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఎనామిల్ పొరపై మరకలు పడతాయి.

ప్రధానంగా ఆహార అలవాట్లు, దంతాలు సరిగా శుభ్రపరచుకోకపోవడం దీనికి కారణాలు. ముఖ్యంగా యాసిడిక్, ముదురు రంగు ఆహార పదార్థాలు, శీతల పానీయాలు, పొగాకు ఉత్పత్తులు వంటి వాటితో దంతాలపై ఉండే ఎనామిల్‌ పసుపుబారుతుంది. ఇక కాఫీ, టీ వల్ల కూడా ఎనామిల్ పై మరకలు ఏర్పడతాయి. ఎనామిల్ పొర మందం తగ్గిపోకుండా ఉండాలంటే నోట్లో లాలాజలం ఊరుతూ ఉండాలి. లాలాజలం ఎనామిల్‌ను దెబ్బతీసే బ్యాక్టీరియాను ఎప్పటికప్పుడు సంహరిస్తుంది. దంతాల‌ను అదేప‌నిగా గ‌ట్టిగా బ్ర‌ష్ చేయ‌డం ద్వారా కూడా ఎనామిల్ చెడిపోతుంది. సిగ‌రెట్ స్మోకింగ్ అతిగా చేసేవారిలో ఎనామిల్ దెబ్బ‌తిని దంతాలు పూర్తిగా చెడిపోతాయి.

దంతాలు తెల్లగా అవుతాయి కదాని టూత్ వైటెనింగ్ ఉత్పత్తులు, మౌత్ వాష్ లు విపరీతంగా వాడడం మంచిదికాదు. దానివల్ల ఎనామిల్ దెబ్బతింటుంది. మెత్తని బ్రష్‌తోనే పళ్లు తోముకోవాలి. పళ్లు తోముకునేటప్పుడు గట్టిగా రుద్దకూడదు. గట్టిగా తోమితే పైనున్న ఎనామిల్‌ అరిగిపోతుంది. ఒక పద్ధతి ప్రకారం బ్రష్‌ చేయాలి. ప్రతి రెండు నెలలకు ఒకసారి బ్రష్‌ తప్పనిసరిగా మార్చాలి.నాన్‌వెజ్‌ తిన్నప్పుడు తప్పనిసరిగా పళ్లు తోముకోవాలి. పళ్ల మధ్య ఇరుక్కున్న పదార్థాలను వెంటనే తీసేయాలి. తీపి పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల దంతాలపై పేరుకుపోవడం జరుగుతుంది. ఇలా పేరుకుపోవటం చాలా ప్రమాదకరం మరియు పంటి పై పొర అయినట్టి ఎనామిల్ కూడా ప్రమాదానికి గురి అవుతుంది.

చక్కెర పదార్థాలు తిన్నపుడు, చక్కెర అణువులు వెంటనే తొలగిపోవటానికి వెంటనే నీటితో పుకిలించి శుభ్రపరుచుకోవాలి. దీని ఒక అలవాటుగా మార్చుకోవటం వలన నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. సాధ్యమైనంత వరకు చాక్లెట్లు, స్వీట్స్‌, ఐస్‌క్రీములు తగ్గించాలి. పచ్చి కూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో అధికంగా ఉండే పీచు పదార్థాలు పళ్లను శుభ్రపరుస్తాయి. చిగుళ్లలో చిన్న సమస్య కనిపించినా డాక్టర్‌ను సంప్రదించాలి.

సాధారణంగా దంతాలను సరైన రీతిలో శుభ్రం చేయకపోవడంతో దంత సమస్యలు వస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. తీపి పదార్ధాలు ఎక్కువగా తినడం, ఆహార పదార్ధాలు తిని పళ్లను శుభ్రం చేయకపోవడంతో పళ్ల మధ్య ఆహార పదార్ధాలు ఇరికిపోయి వాటి నుంచి బ్యాక్టీరియా ఏర్పడి అది పళ్లపై ప్రభావం చూపుతుంది. కాబట్టి దంతాల ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Leave a Comment