ఆశ్వయుజ శుద్ధ నవమి సోమవారము,తేది. 23.10.2023 (దర్శన సమయం: ఉదయం 4 గంటలు నుండి మధ్యాహ్నం 12 గంటలు వరకు ‘శ్రీమహిషాసుర మర్దని దేవి (మహర్నవమి). దేవీ నవరాత్రులు చివరి రోజున రెండు అలంకారాలలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం శ్రీ మహిషాసురమర్దనీ దేవిగా కనిపిస్తారు. నవమి తిథి ఉదయం వరకు మాత్రమే ఉండటం.. మధ్యాహ్నం దశమి తిథి ప్రారంభమవుతుండటంతో ఈరోజు రెండు అవతారాల్లో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.
అయిగిరినందిని, నందితమోదిని, విశ్వవినోదినీ నందినుతే
గిరివర వింధ్య శిరోధినివాసిని, విష్ణువిలాసిని జిష్ణునుతే |
భగవతి హే శితికంఠ కుటుంబిని, భూరికుటుంబిని భూరికృతే
జయజయహే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥
శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీకనకదుర్గమ్మవారు శ్రీమహిషాసుర మర్దనీ దేవి గా దర్శనమిస్తారు. అష్టభుజాలతో అవతరించి సింహవాహినియై, దుష్టుడైన మహిషాసురుని సంహరించి శ్రీదుర్గాదేవి దేవతల, ఋషులు, మానవుల కష్టాలను తొలగించింది. మహిషాసురమర్ధనీదేవి అలంకారములో ఉన్న శ్రీ అమ్మవారిని దర్శించడం వలన అరిష్వర్గాలు నశిస్తాయి, సాత్విక భావం ఉదయిస్తుంది. సర్వదోషాలు పటాపంచలు అవుతాయి. ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరుతాయి.
ఈరోజు అమ్మవారు ఎరుపురంగు చీరలో దర్శనం ఇస్తారు. పాయసం, చక్కెర పొంగలి నైవేద్యం పెట్టాలి. పూల మాలలు దానం చేస్తే మంచిది. ఈరోజు అమ్మవారిని పూజించిన వారికి అఖండ కీర్తి, సౌభాగ్యం కలుగుతుంది. దశమి రోజు ఆయుధ పూజ చేసేవారు అక్టోబరు 24 మంగళవారం సూర్యోదయానికి దశమి తిథి ఉండడంతో ఆ రోజు చేస్తారు.