Dussehra 2023 : శరన్నవరాత్రుల్లో అమ్మవారి అలంకరణలు

By manavaradhi.com

Updated on:

Follow Us
  1. Dussehra 2023:15.10.2023 – శ్రీబాలాత్రిపుర సుందరి దేవి అలంకరణ

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, ఆదివారము, తేది. 15.10.2023 శ్రీకనకదుర్గమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి గా దర్శనమిస్తారు.

శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీకనకదుర్గమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి గా దర్శనమిస్తారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనది. శ్రీబాలామంత్రం సమస్త దేవీ మంత్రాల్లోకి గొప్పది, ముఖ్యమైనది. అందుకే శ్రీవిద్యోపాసకులకి మొట్టమొదట బాలామంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపురసుందరీదేవి నిత్యం కొలువైన పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత శ్రీబాలాత్రిపుర సుందరీ దేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలం. దసరా మహోత్సవాలలో భక్తులకు పూర్ణ ఫలం అందించే అలంకారం శ్రీబాలాత్రిపుర సుందరీ దేవి.

02. Dussehra 2023: రెండవ రోజు 16.10.2023 – శ్రీ గాయత్రీ దేవి అలంకరణ

ఆశ్వయుజ శుద్ధ విదియ, సోమవారము, తేది. 16.10.2023 శ్రీకనకదుర్గమ్మవారు శ్రీగాయత్రి దేవి గా దర్శనమిస్తారు.

శరన్నవరాత్రి మహోత్సవములలో రెండవ రోజున శ్రీకనకదుర్గమ్మవారు శ్రీగాయత్రీ దేవి గా దర్శనమిస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధిపొంది ముక్తా, విద్రుమ, హేమనీల, ధవళవర్ణాలతో ప్రకాశించు పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యా వందన దేవత గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలం గాయత్రీ దేవి అమ్మవారు. అమ్మను ఆరాధిస్తే జ్ఞానం సిద్ధిస్తుంది. గాయత్రీ మంత్రం జపిస్తే చతుర్వేదాలు చదివిన ఫలితం కలుగుతుందట.

  1. Dussehra 2023: మూడవ రోజు 17.10.2023 – శ్రీఅన్నపూర్ణా దేవి అలంకరణ – ఆశ్వయుజ శుద్ధ తదియ, మంగళవారము

శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీకనకదుర్గమ్మవారు. శ్రీఅన్నపూర్ణాదేవి గా అలంకారములో దర్శనమిస్తారు. శ్రీ అన్నపూర్ణా దేవి అన్నమును ప్రసాదించే మాతృమూర్తి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం సర్వజీవనాధారం, అన్నం లేనిదే జీవులకు మనుగడలేదు. శ్రీఅన్నపూర్ణాదేవి ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృతాన్నము, వజ్రాలు పొదిగిన గరిటెతో సాక్షాత్తుగా ఈశ్వరునికే భిక్షను అందించే అంశము అద్భుతము, ఆమె దర్శనము సర్వ పుణ్యప్రదాయకము. లోకంలో జీవుల ఆకలిని తీర్చటం కన్నా మిన్న ఏది లేదు. నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో శ్రీదుర్గమ్మని దర్శించి తరించడం వలన అన్నాదులకు లోపం లేకుండా, ఇతరులకు అన్నదానం చేసే సౌభాగ్యాన్ని పొందగలుగుతారు. కాశీ విశ్వేశ్వరుడి ప్రియ పత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతోంది. అన్నపూర్ణాదేవిని పూజిస్తే తిండికి లోటుండదు. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి.

  1. Dussehra 2023: నాల్గవ రోజు 18.10.2023 – శ్రీమహాలక్ష్మి దేవి అలంకరణ – ఆశ్వయుజ శుద్ధ చవితి, బుధవారము

శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీకనకదుర్గమ్మవారు శ్రీమహాలక్ష్మీ దేవి గా దర్శనమిస్తారు. మంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మీదేవి. జగన్మాత మహాలక్ష్మీ స్వరూపంలో దుష్టరాక్షస సంహారాన్ని చేయటం ఒక అద్భుత ఘట్టం. మూడు శక్తుల్లో ఒక శకైన శ్రీమహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుడిని సంహరించింది. లోక స్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమిష్టిరూపమైన అమృతస్వరూపిణిగా శ్రీదుర్గమ్మ ఈరోజు మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. శ్రీమహాలక్ష్మీ దేవి అమ్మవారిని దర్శించడం వలన భక్తులందరికీ ఐశ్వర్యప్రాప్తి, విజయము లభిస్తుంది.

  1. Dussehra 2023: ఐదవ రోజు 19.10.2023 – శ్రీ మహా చండీ దేవి అలంకరణ – ఆశ్వయుజ శుద్ధ పంచమి, గురువారము

శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీకనకదుర్గమ్మవారు శ్రీమహా చండీ దేవి గా దర్శనమిస్తారు. దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు మహాలక్ష్మీ, మహాకాళీ, మహాసరస్వతీ త్రిశక్తి స్వరూపిణిగా శ్రీమహా చండీ అమ్మవారు ఉద్భవించినది. శ్రీచండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. శ్రీమహా చండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లే. శ్రీఅమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారటం, ఏ కోరికలతో ప్రార్థిస్తామో ఆ కోరికలు అన్నీ సత్వరమే లభిస్తాయి.

  1. Dussehra 2023: ఆరవ రోజు 20.10.2023 – శ్రీ సరస్వతీ దేవి అలంకరణ (మూలానక్షత్రం) -ఆశ్వయుజ శుద్ధ షష్ఠి, శుక్రవారము, అమ్మవారి జన్మనక్షత్రం మూలానక్షత్రం

శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీకనకదుర్గమ్మవారు శ్రీసరస్వతీదేవి గా అలంకారములో దర్శనమిస్తారు. మూలా నక్షత్రం శ్రీ అమ్మవారి జన్మనక్షత్రం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా శక్తిస్వరూపాలతో దుష్ట సంహారం చేసిన శ్రీదుర్గాదేవికి శరన్నవరాత్రి ఉత్సవాలలో మూలానక్షత్రం రోజున. వాగ్దేవతామూర్తి అయిన సరస్వతీ అవతారంలో భక్తులను అనుగ్రహిస్తారు. సరస్వతీదేవిని సేవించడం వలన విద్యార్ధినీ విద్యార్థులు సర్వ విద్యల యందు విజయం పొందుతారు. భక్తులు మూలానక్షత్రం నుండి విజయదశమి వరకు విశేష పుణ్య దినాలుగా భావించి శ్రీదుర్గమ్మను ఆరాధిస్తారు. భక్తజనుల అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞానప్రదాయిని శ్రీసరస్వతీదేవి. శ్రీసరస్వతీదేవి దర్శనం అఖిల విద్యాభ్యుదయప్రదాయకం.

  1. Dussehra 2023: ఏడవ రోజు 21.10.2023 – శ్రీ లలితా త్రిపుర సందరీ దేవి అలంకరణ – ఆశ్వయుజ శుద్ధ సప్తమి, శనివారము

శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీకనకదుర్గమ్మవారు శ్రీలలితా త్రిపురసుందరీ దేవి గా దర్శనమిస్తారు. ఈ అమ్మవారు శ్రీచక్ర అధిష్ఠానశక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధిదేవతగా వేంచేసి, ఆరాధించే భక్తులను, ఉపాసకులను అనుగ్రహిస్తున్నది. శ్రీలక్ష్మీదేవి, శ్రీసరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తూ ఉండగా చిరుమందహాసంతో, వాత్సల్య రూపిణిగా చెరకుగడను చేతపట్టుకొని శివుని వక్షస్థలంపై కూర్చొని శ్రీలలితా త్రిపురసుందరీ దేవిగా దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడుగా, శ్రీఅమ్మవారు త్రిపురసుందరీ దేవిగా పూజలందు కుంటున్నారు.

  1. Dussehra 2023: ఎనిమిదో రోజు 22.10.2023 – శ్రీదుర్గా దేవి (దుర్గాష్టమి) అలంకరణ – ఆశ్వయుజ శుద్ధ అష్టమి, ఆదివారము

శరన్నవరాత్రి మహోత్సవములలో అష్టమి తిథి నాడు శ్రీకనక దుర్గమ్మవారు శ్రీ దుర్గా దేవి గా భక్తులకు దర్శనమిస్తారు. లోక కంటకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను పోగొట్టి దుర్గగా వెలుగొందినది. లోకకంటకుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవిగా కీలాద్రిపై స్వయంగా శ్రీఅమ్మవారు ఆవిర్భవించింది. ‘దుర్గే దుర్గతినాశని’ అనే వాక్యం భక్తులకు శుభాలను కలుగచేస్తుంది. శరన్నవరాత్రులలో దుర్గాదేవిని అర్చించటం వలన దుర్గతులను పోగొట్టి సద్గతులను ప్రసాదిస్తుంది. దివ్యరూపిణి అయిన శ్రీదుర్గమ్మవారి దర్శనము సకల శ్రేయోదాయకం.

  1. Dussehra 2023: తొమ్మిదవ రోజు 23.10.2023 – (శ్రీ మహిషాసురమర్దనీ దేవి మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరి దేవి ) అలంకరణ

ఆశ్వయుజ శుద్ధ నవమి సోమవారము,తేది. 23.10.2023 (దర్శన సమయం: ఉదయం 4 గంటలు నుండి మధ్యాహ్నం 12 గంటలు వరకు ‘శ్రీమహిషాసుర మర్దని దేవి (మహర్నవమి). దేవీ నవరాత్రులు చివరి రోజున రెండు అలంకారాలలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం శ్రీ మహిషాసురమర్దనీ దేవిగా కనిపిస్తారు. నవమి తిథి ఉదయం వరకు మాత్రమే ఉండటం.. మధ్యాహ్నం దశమి తిథి ప్రారంభమవుతుండటంతో ఈరోజు రెండు అవతారాల్లో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.

శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీకనకదుర్గమ్మవారు శ్రీమహిషాసుర మర్దనీ దేవి గా దర్శనమిస్తారు. అష్టభుజాలతో అవతరించి సింహవాహినియై, దుష్టుడైన మహిషాసురుని సంహరించి శ్రీదుర్గాదేవి దేవతల, ఋషులు, మానవుల కష్టాలను తొలగించింది. మహిషాసురమర్ధనీదేవి అలంకారములో ఉన్న శ్రీ అమ్మవారిని దర్శించడం వలన అరిష్వర్గాలు నశిస్తాయి, సాత్విక భావం ఉదయిస్తుంది. సర్వదోషాలు పటాపంచలు అవుతాయి. ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరుతాయి.

ఆశ్వయుజ శుద్ధ దశమి- (విజయదశమి), సోమవారము, తేది. 23.10.2023 దర్శన సమయం : మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 11 గంటలు వరకు శ్రీరాజరాజేశ్వరీ దేవిఅలంకరణ

శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీకనకదుర్గాదేవి చిరునవ్వులతో శ్రీరాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తుంది. చెరుకుగడను వామహస్తముతో ధరించి, దక్షిణ హస్తముతో అభయాన్ని ప్రసాదిస్తూ, శ్రీషోడశాక్షరీ మహామంత్ర స్వరూపిణిగా శ్రీచక్రరాజ దేవతగా వెలుగొందే శ్రీరాజరాజేశ్వరి దేవిని దర్శించి, అర్చించడం వలన సర్వ శుభములు కలుగును. దసరా ఉత్సవాల సంపూర్ణ పుణ్యాన్ని అందరికీ అందింపచేసే అపరాజితాదేవిగా, చల్లనితల్లిగా దుర్గమ్మ శ్రీరాజరాజేశ్వరీ దేవి. అలంకారంలో దర్శనం ఇస్తుంది. అమ్మను సేవించి జీవితాన్ని ధన్యం చేసుకుందాం. సకల శుభాలు, విజయాలు శ్రీఅమ్మవారి దివ్యదర్శనం ద్వారా మనకు లభిస్తాయి.