Eye Care Tips: మన కళ్లను ఎలా కాపాడుకోవాలి?

By manavaradhi.com

Published on:

Follow Us
Eye Care Tips

మన శరీరంలో ప్రధానమైన అవయవాల్లో కళ్ళకు మించినవి లేవు. చూపులో ఏ సమస్య వచ్చినా, అది మన జీవితం మీద పెను ప్రభావాన్ని చూపుతాయి. మనకున్న కొన్ని అలవాట్లు మన కంటికి సమస్యలు కొనితెస్తూ ఉంటాయి. అలాంటి ప్రమాదాలు రాకుండా, కొన్ని ప్రత్యేక చిట్కాల ద్వారా మన కళ్ళకు మనమే రక్షణ కవచాన్ని ఏర్పరచవచ్చు.

శరీరంలో కీలకమైన అవయవాల్లో కళ్ళు ప్రధానమైనవి. వీటిని జీవితాంతం జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఎన్నో సమస్యలు ఎదురౌతాయి. దీని కోసం సరైన ఆహారం, ఆరోగ్యకరమైన అలవాట్లు కీలకం. దీంతో పాటు కాలుష్యం, ఎండ, కాంతి లాంటి వాటి నుంచి కళ్ళను కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించి తీరడం తప్పని సరి. ఇందులో ప్రధానంగా చేయవలసిన కళ్ళ మీద పడే ఒత్తిడిని తగ్గించుకోవడం. దీని కోసం చల్లటి నీటితో తరచూ కళ్ళను కడుగుతూ ఉండాలి.

కళ్ళు నిరంతరంగా పని చేయడం వల్ల అలసటకు గురౌతూ ఉంటాయి. దీంతో పాటు వాహనాలను నడపడం, చదవడం, కంప్యూటర్ ముందు కూర్చుని పని చేయడం వల్ల కళ్ళు ఒత్తిడికి లోనవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు కాసేపు బయట తిరగడం, చల్లని నీటితో కలగడం చేయాలి. ఇలా చేయకుంటే తీవ్రమైన కంటి లోపాలు రావచ్చు. తరచూగా కళ్ళ రెప్పలను వాల్చడం వల్ల కళ్ళ మీద ఒత్తిడి తగ్గుతుంది. అదే విధంగా కంటికి ఎప్పటికప్పుడు విశ్రాంతి ఇవాలి. కంప్యూటర్ మీద పని చేస్తుంటే కనీసం 20 నిముషాలకు ఓ సారైనా కాస్తంత విరామం ఇస్తూ ఉండాలి. కంటి చుట్టూ 10 సెకన్ల పాటు మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. రోజుకు కనీసం రెండు మార్లు ఇలా చేస్తూ ఉండాలి. దీని వల్ల కంటి మీద అధిక పీడన ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఇలా చేయడం వల్ల కన్నీటి గ్రంధులు ప్రవాహానికి గురై కళ్ళు పొడి బారడం తగ్గుతుంది.

ప్రిసర్వేటివ్స్ లేని కంటి చుక్కల మందు లాంటివి వాడాలి. మార్కెట్ లో లభించే ఐడ్రాప్స్ ను ఇష్టం వచ్చినట్లు వాడకుండా వైద్యుని సలహా మేరకు డ్రాప్స్ వాడుతూ ఉండాలి. చాలా మంది కంటి ఎరుపును తగ్గించే డ్రాప్స్ ను వాడుతూ ఉంటారు. ఇలాంటి వాటి వల్ల కళ్ళు పొడిబారే ప్రమాదం ఉంది గనుక, జాగ్రత్తలు తీసుకోవాలి.

కళ్ళ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకుని, తగిన విధంగా సంరక్షించుకోవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఎండలోకి వెళ్ళేటప్పుడు చాలా మంది కళ్ల జోడు లాంటివి వాడరు. దీని వల్ల కంటి మీద అల్ట్రావైలెట్ కిరణాలు ప్రభావం చుపూతాయి. అలాగే ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చునే వారు యాంటీ గ్లేర్ అద్దాలు వాడాలి. టీవీ ముందు కూర్చున్నప్పుడు మరీ దగ్గరగా కూర్చోవడం అంత మంచిది కాదు. అలాగే చదువుకునేటప్పుడు పరిసరాలు బాగా కాంతి వంతంగా ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. చీకటిలో చదవడం వల్ల కంటి మీద ఒత్తిడిది అధికమై కంటి సమస్యలకు కారణం అవుతుంది.

వీటితో పాటు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన పౌష్టికాహారం తీసుకోవాలి. విటమిన్ ఏ లోపం వల్ల కంటి చూపు సమస్యలు వస్తాయి. ముఖ్యంగా సిగరెట్ లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. సిగరెట్ పొగ కారణంగా కంటి సమస్యలు చాలా త్వరగా ఇబ్బంది పెడతాయి. ఇలా వచ్చే వాటిలో పెద్ద పెద్ద సమస్యలే ఎక్కువ. అదే విధంగా ఎక్కువ సేపు నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి.

సాధారణంగా 7 నుంచి 8 గంటల నిద్ర ప్రతి ఒక్కరికీ ఆవశ్యకం. చిన్న పిల్లలైతే 9 నుంచి 11 గంటలు కచ్చితంగా నిద్రపోవాలి. దీని వల్ల కళ్ళు వాటికవే పునరుత్తేజం పొందుతాయి. నిద్ర సరిగా లేకపోతే ఇరిటేషన్, దురద, కళ్ళు ఎర్రబారడం, వాపు లాంటి సమస్యలు వస్తాయి గనుక… కళ్ళకు సరైన విశ్రాంతి కలిగే వరకూ నిద్రపోవడం చాలా అవసరం.

చాలా మంది కళ్ళను ఇష్టం వచ్చినట్లు నలుపుతుంటారు. చాలా సున్నితమైన కళ్ళను అలా నలపడం వల్ల వివిధ కణాలు, ప్రారాన్ మార్గాలు దెబ్బ తినే ప్రమాదం ఉంది. అలాగే చేతుల మీద మనకు తెలియని క్రిములు ఉంటాయి. అందువల్ల నలపడం మంచిది కాదు. అస్పష్టంగా కనిపించే వాటిని ఎక్కువ సేపు చూడడం లాంటివి చేయకూడదు. దీని వల్ల కంటి చూపులో ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉంది. ముఖాన్ని పైకి చూస్తూ పడుకునే అలవాటు ఉన్న వారికి ఉదయాన్నే కళ్ళు పొడిబారతాయి.

ఎక్కువగా భారీ శరీరం ఉండే వ్యక్తుల్లో కంటికి దిండును ఆన్చి పడుకోవడం వల్ల కూడా ఇలాంటి సమస్య ఎదురౌతుంది. పడుకునే గదిలో ఏసీ ఉన్నా, ఫ్యాన్ వేగంగా తిరుగుతున్నా కూడా కళ్ళు పొడిబారతాయి. అందుకే నిద్రిస్తున్నప్పుడు గాలి విషయం మొదలుకుని, అన్నింటిలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అధిక రక్తపోటు మాత్రలు, స్టెరాయిడ్, నిద్ర మాత్రలు, అలర్జీ మందులు సహా అనేక మందులు కంటి చూపును మసకబారుస్తాయి. కాంటాక్ట్ లెన్స్ వాడే వారు వాటి సరిగా శుభ్రం చేస్తూ ఉండాలి. లేదంటే కంటికి చాలా త్వరగా ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. దీంతో పాటు ఎప్పటికప్పుడు కంటి వైద్యుని సంప్రదిస్తూ ఉండాలి. దీని వల్ల కంటిలో చిన్న సమస్యలు వచ్చినా మన దృష్టికి వస్తాయి. వెంటనే వైద్యం తీసుకోవచ్చు. లేదంటే కంటి సమస్యలు ముదిరే వరకూ మనకు తెలియదు. అప్పుడు జాగ్రత్తలు తీసుకున్నా పెద్ద ప్రయోజనం ఉండకపోవచ్చు. అందుకే కంటికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని గమనించి జాగ్రత్తలు తీసుకోవాలి.

వీటి పట్ల అవగాహన కలిగి ఉండడం ద్వారా… మీరు, మీ పిల్లలు కళ్ళకు ఏ విధమైన ఇతర సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. మీ చూపును సంరక్షించుకోవచ్చు.

Leave a Comment