Mint health benefits: పుదీనాతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ..!

By manavaradhi.com

Published on:

Follow Us
Mint health benefits

పుదీనా ఆకులు సువాసనాభరితంగా ఉంటాయి. వీటిని రుచి కోసం కూరల్లో వాడతాం. వంటకాల్లో అలంకరణకూ ఉపయోగిస్తాం. వీటి ఉపయోగాలు ఇంతేనా అంటే కాదనే చెప్పాలి. ఈ ఆకుల్లో ఔషధగుణాలు మెండుగా లభిస్తాయి. తరచూ తీసుకోవడం ద్వారా చాలా అనారోగ్య సమస్యలని తగ్గించుకోవచ్చు. అంతే కాదు జలుబు,సైనస్ వంటి సమస్యలకు చాలా చక్కగా పనిచేస్తుంది.

పుదీనా చాలా మంది నిత్యం వంటల్లో వినియోగించే ఆకుకూర. పుదీనాను కూరల్లో వేసుకున్నా దీనితో విడి వంటకాన్ని తయారు చేసుకున్నా ఆ రుచే వేరు. పుదీనా ఆకులో వెలకట్టలేని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పోషకాలు పుష్కలంగా ఉన్న పుదీన ఆకు క్రిములను నాశనం చేస్తుంది. మలినాలను శరీరం నుంచి బయటకు పంపుతుంది. పుదీనా ఆకును నిత్యం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికే కాదు.. చర్మానికి ఎంతో మేలు చేకూరుతుంది.

పుదీనాలో క్యాల్షియం, ఫాస్ఫరస్‌, విటమిన్‌ సి, డి, ఇ-లతోపాటు తక్కువ మొత్తంలో విటమిన్‌ బి కాంప్లెక్స్‌ ఉంటుంది. ఇవన్నీ మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పుదీనా జీర్ణక్రియకు తోడ్పడుతుంది. కడుపు నొప్పి, మంటను తగ్గిస్తుంది. మలబద్ధకంతో బాధపడేవారు పుదీనాను తరచూ తీసుకోవడం వల్ల ఆ సమస్య తగ్గుతుంది. భోజనం తర్వాత ఓ కప్పు పుదీనా టీ తీసుకోవడం వల్ల అజీర్తి సమస్య ఎదురుకాదు.

పుదీనాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లూ రకరకాల అలర్జీలనూ, ఆస్తమానూ తగ్గిస్తాయి. జలుబూ, దగ్గుతో బాధపడుతున్నప్పుడు వేడినీటిలో పుదీనా ఆకులను వేసి ఆవిరి పట్టి చూడండి. అలాగే ఈ వేడి ఆవిరిని నోటితో పీల్చి ముక్కుతో వదిలేయాలి. ఇలా చేయడం వల్ల ముక్కు, నోరు, గొంతు శుభ్రపడతాయి. గాలి పీల్చడానికి ఇబ్బంది ఉండదు. మీరు చేసే ఏ సూప్‌లోనైనా చివరగా గుప్పెడు పుదీనా ఆకులను వేసి మరిగించండి. అప్పుడు దాని రుచి అంతకంతకూ పెరిగిపోతుంది. ఆరోగ్యంతోపాటు మీ జిహ్వకు చక్కటి రుచి దొరుకుతుంది. ఇది జలుబు, దగ్గు…శ్వాస కోస సమస్యల్ని అదుపు చేస్తుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పులను పుదీనా నియంత్రిస్తుంది. గర్భిణులకు ఉదయం పూట ఎదురయ్యే బడలికనూ, అసౌకర్యాన్నీ నివారించడంలోనూ పుదీనా అద్భుతంగా పనిచేస్తుంది.

చాలా మందికి పుదీనా వాసన నచ్చదు. అయితే వీటి ప్రయోజనాలను తెలుసుకుంటే మాత్రం తప్పకుండా పుదీనాను తినటం ప్రారంభిస్తారు. పుదీనా ఆకుల‌ను నిత్యం తీసుకోవ‌డం ద్వారా డైజెస్టివ్ సిస్ట‌మ్‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించి శ‌రీరం బ‌రువు త‌గ్గించుకోవ‌డం లో ముఖ్య‌పాత్ర పోషిస్తుంది. జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌ర్చ‌డ‌మేకాకుండా క‌డుపునొప్పి, పొట్ట ఉబ్బ‌రం త‌గ్గించ‌డంలో చాలా బాగా ప‌నిచేస్తాయి. వీటిని రెగ్యుల‌ర్‌గా తీసుకోవ‌డం వ‌ల్ల‌ ఇర్రిట‌బుల్ బౌల్ సిండ్రోమ్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు.

చ‌ర్మ సంబంధ వ్యాధులు, దుర‌ద‌, చికాకుల నుంచి విముక్తిపొంద‌వ‌చ్చు. త‌ల‌నొప్పి, మైగ్రేన్ స‌మ‌స్య‌ల‌కు మంచి ఔష‌ధంగా ప‌నిచేస్తుంది. పుదీనాలో యాంటి ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఎక్కువ. ఇవి రకరకాల ఇన్ఫెక్షన్లూ, నొప్పుల నుంచి మనల్ని కాపాడతాయి. దంత క్షయాన్ని నివారిస్తాయి. దంతాలూ, నాలుకనూ శుభ్రం చేసి నోటి దుర్వాసనను పోగొడతాయి. ప్రతిరోజూ కొన్ని పుదీనా ఆకులను నమలడం వల్ల దంత సమస్యలు రాకుండా నిరోధించవచ్చు.

ఘాటైన సువాసనతో పాటు.. కమ్మని రుచితో నోరూరించే పుదినలో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. రుచితో పాటు ఔషధ గుణాలున్న పుదినా ఆకును డైట్ లో చేర్చుకుంటే.. రకరకాల సమస్యలకు గుడ్ బై చెప్పవచ్చు.

Leave a Comment