Health Tips: మీ ఎముకలు ఆరోగ్యంగా బలంగా ఉండాలంటే..!

By manavaradhi.com

Published on:

Follow Us
Bone Health

చిన్నచిన్న దెబ్బలకే ఎముకలు పుటుక్కుమని విరిగిపోతున్నాయా? అయితే.. అలర్ట్‌ కావాల్సిందే.. ఎందుకంటే.. మీ ఎముకలు గుళ్లబారిపోవడమే దానికి కారణం కావొచ్చు. ఇప్పుడు దేశంలో 80 శాతం మహిళలు, 20 శాతం పురుషుల్లో కనిపిస్తున్న ఆస్టియో పొరోసిస్‌ అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.

గతంలో 50 నుంచి 60 ఏళ్ల వారిలో బోలు ఎముకల వ్యాధి వచ్చేది. ఇప్పుడు 30 ఏళ్ల వారిలోనూ కనిపిస్తోంది. జీవనశైలిలో మార్పుల కారణంగా ఇప్పుడు తక్కువ వయస్సు వారిలోనూ కనిపిస్తోంది. ఎముకలకు సంబంధించి వస్తున్న రోగుల్లో 10 శాతం మంది బోలు వ్యాధికి గురవుతున్నట్లు అంచనా. తల్లిదండ్రులకు ఈ వ్యాధి సంక్రమిస్తే పిల్లలకు జన్యుపరమైన కారణాలతో వచ్చే అవకాశముంది. 35 ఏళ్ల దాటిన తర్వాత శరీరంలో క్యాల్షియం స్వీకరణ తక్కువై, బయటకు వెళ్లేది ఎక్కువవుతుంది. దీనివల్ల క్యాల్షియం కొరత ఏర్పడి.. సమతుల్యత దెబ్బతిని వ్యాధి మరింత విస్త్రృతమవుతుంది.

వృద్ధుల్లో ఎముక సాంద్రత తరిగిపోవడంతో ఈ సమస్య రావడం .. ఫ్రాక్చర్‌లు తొందరగా అయ్యే అవకాశాలుంటాయి. ఈ వ్యాధి మధ్య వయస్సు, వృద్ధాప్యంలో కనిపించినప్పటికీ మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్‌ దాటిన మహిళలలో తుంటి, వెన్నుముక, మణికట్టు ఫ్రాక్చర్లు అయ్యే అవకాశాలు పెరుగుతాయి.ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వారిలో, విటమిన్ డి లోపం ఉన్న వారిలో, పౌష్టికాహార లోపం ఉన్న వారిలో ఎక్కువగా ఈ వ్యాధి కనిపిస్తుంది.


వయసు పెరిగే కొద్దీ మనిషి శరీరంలోని ఎముకలు బలహీనంగా మారిపోతుంటాయి. ఇదే సమయంలో ఆస్టియోపోరోసిస్ వ్యాధికి గురైతే… ఎముకలు గుళ్లబారిపోయి విరిగిపోతుంటాయి. చిన్న దెబ్బ తగిలితేనే ఎముకలు విరిగి చాలా సమస్యలకు కారణమవుతుంది. స్త్రీ ఎముకలు బలహీనంగా ఉంటున్నందున పురుషులతో పోల్చుకుంటే స్త్రీలలో చాలా సాధారణంగా ఈ వ్యాధి సంభవిస్తుంది.

ఎముకలలో సామర్ధ్యం, సాంద్రత తగ్గడం వల్ల ఆస్టియోపోరోసిస్ జబ్బు వస్తుంది. ఎముకలు పెళుసుగా తయారై.. ఫలితంగా ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎముకలు విరిగే వరకు మీరు ఆస్టియోపొరోసిస్ తో బాధపడుతున్నారనే విషయం తెలియదు. స్త్రీలలో ఎముకలను ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ సంరక్షిస్తుంది. ఎముకలు బలహీనానికి కారణమయ్యే మేనోపాజ్‌కి చేరినప్పుడు ఈస్ట్రోజెన్ గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా స్త్రీలలో ఈ వ్యాధి రావడానికి ఆస్కారమెక్కువగా ఉంటుంది.

క్యాల్షియం మరియు విటమిన్ D ల లోపం కూడా, ఎముకలు బలహీనపడడానికి ఒక కారణం కావచ్చు. హైపర్ పారాథైరాయిడిజం ఉన్నప్పుడు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సీఓపీడీ వ్యాధికి గురైనప్పుడు, అధిక మద్యపానం, సిగరెట్లు తాగడం, కొన్ని రకాల మందుల వద్ద ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రారంభ దాశలో గుర్తించడం చాలా వరకు జరగదు. ఈలోపు ఎముకలకు జరగాల్సిన నష్టం జరిగిపోవడం, చిన్నపాటి ప్రమాదాలకే ఎముకలు విరిగే పరిస్థితి తలెత్తుతుంది.

డ్యూయల్‌ ఎనర్జీ ఎక్స్‌రే అబ్జార్‌ప్సమెట్రీ పద్ధ్దతిలో అది ఆస్టియోపోరోసిస్‌ అన్న విషయాన్ని నిర్థారిస్తారు. ఆస్టియోపోరోసిస్ ఉన్నవారికి ఎముకల్లో నొప్పి ఎక్కువగా ఉంటే మణికట్టు, వెన్నెముక, తుంటి ఎముక భాగాలను ఈ బోన్ డెన్సిటో మీటర్ ద్వారా పరీక్షిస్తారు.

ఆస్టియోపొరోసిస్ నిర్మూలనకు సరైన జీవనశైలి అలవాట్లను, తీసుకునే ఆహారాన్ని అనుసరిస్తే చాలు, ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. బలమైన, దట్టమైన ఎముకల అభివృద్ధికి తగినంత క్యాల్షియం, విటమిన్ D అవసరం. రోజూ నడక వంటి వ్యాయామాలు చేయటంతో పాటు తగినంత క్యాల్షియం, విటమిన్‌ డి తీసుకుంటే ఎముక పుష్టిని కాపాడుకోవచ్చు.క్యాల్షియం ఎక్కువగా లభించే పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోవాలి. నిత్యం 1200 మిల్లీగ్రాముల క్యాల్షియం అందేలా చూసుకోవాలి.

రోజూ కాసేపు ఎండలో గడిపడం ద్వారా విటమిన్ డి పొందవచ్చు. ప్రోటీన్ అధిక శాతం కలిగి ఉండే పాలు, పెరుగు, చీజ్ వంటి పాల పదార్ధాలు తీసుకోవాలి. విటమిన్ B6, B12, ఫోలేట్ అధికంగా ఉండే గుడ్డును రోజువారి మెనూలో చేర్చుకోవాలి. ఆస్టియోపొరోసిస్ కి ఆపిల్, ఆరంజ్, పియర్,అరటిపండు, నిమ్మ, పాలకూర, అల్లం చాలామంచి ఆహార పదార్ధాలు. చిక్కుళ్ళు, సోయాబీన్స్ స్త్రీలలో ఎముక ఖనిజ సాంద్రతను మెరుగుపరిచి, ఆస్టియోపొరోసిస్ సమస్యను తగ్గిస్తాయి.

బోలు వ్యాధితో బాధపడే వయసు మళ్లినవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచం పక్కన బెల్‌ ఉంచుకోవాలి. ఎవరి సాయం లేకుండా కదలకూడదు. వాకర్స్‌ సాయంతో తిరగాలి. బాత్‌రూం వద్ద కూడా సపోర్టర్స్‌ ఉండాలి. సిలికాన్‌ హిప్‌ ప్రొటెక్టర్స్‌ ఉపయోగించాలి.

ఆస్టియోపొరాసిస్‌ వ్యాధి సోకకుండా ఉండాలంటే జీవనశైలిని మార్చుకోవాలి. ఆహారంలో క్యాల్షియం లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తోంది. సూర్యరశ్మి తగలకపోవడం, ఏసీలోనే ఎక్కువ సేపు గడపటం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. కాబట్టి జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ … మన ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం…

Leave a Comment