కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మంచి పధకాల్లో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఒకటి. దీని ద్వారా కేవలం 20 రూపాయలకే 2 లక్షల ప్రమాద బీమా పొందవచ్చు. ఈ పథకం సంవత్సర కాలానికి వర్తిస్తుంది. ప్రతి సంవత్సరం పునరుద్ధరించుకోవచ్చు. ఈ పథకం గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం…
ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ద్వారా ప్రతి వ్యక్తి 20 రూపాయాలు చెల్లించి 2 లక్షల ప్రమాద బీమా పొందవచ్చు. ఏదైనా ప్రమాదం జరిగి పాలసీ కలిగిన వ్యక్తి మరణిస్తే లేదా అంగవైకల్యం సంభవిస్తే ఈ బీమా వర్తిస్తుంది. బ్యాంకులో పొదుపుఖాతా ఉన్న 18 నుండి 70 సంవత్సరాల వయస్సు గల బ్యాంక్ ఖాతాదారులందరూ ఈ పథకానికి అర్హులే. ఒకే బ్యాంకులో 2, 3 ఖాతాలు లేదా వేరే బ్యాంకులో ఖాతాలు ఉన్న ఒక వ్యక్తి ఏదో ఒక ఖాతా ద్వారా మాత్రమే ఈ బీమా సౌకర్యం పొందగలుగుతారు. ఆధార్ కార్డు ఉన్నట్లయితే ఇక ఏ ఇతర గుర్తింపు పత్రాలు అవసరం ఉండదు. లేని యెడల బ్యాంకు నియమావళిని అనుసరించి గుర్తింపు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కాల వ్యవధి ఏంటి..?
ఈ బీమా రక్షణ ప్రతి ఒక్కరికి ఏడాది కాలానికి వర్తిస్తుంది. (జూన్ 1వ తేదీనుండి మే 31వ తేదీ వరకూ) ప్రతి సంవత్సరం మే 31 తేదీన నిర్దేశిత దరఖాస్తును సమర్పించి పథకంలో చేరవచ్చు, పునరుద్ధరించుకోవచ్చు. పథకం కొనసాగుతున్నపుడు ప్రతి ఏడాది అర్హులైన కొత్తవారు చేరవచ్చు. అర్హత ఉండి ఇంతవరకూ పథకంలో చేరనివారు కూడా భవిష్యత్తులో చేరవచ్చు. పొదుపు ఖాతా నుండి ఆటోడెబిట్ ద్వారా మన ప్రీమియంను బ్యాంకు వసూలు చేస్తుంది. ఈ పథకంలో మధ్యలో వైదొలగిన వ్యక్తులు, మళ్ళీ ఈ పథకంలో చేరవచ్చు. పథకం కొనసాగుతున్నప్పుడు ప్రతి ఏడాది అర్హులైన కొత్తవారు చేరవచ్చు. అర్హత ఉండి ఇంతవరకూ పథకంలో చేరని వారు కూడా భవిష్యత్తులో చేరవచ్చు.
ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రయోజనాలు ఏంటి..?
పాలసీదారుడు ఏదైనా ప్రమాదం వలన మరణిస్తే 2 లక్షల రూపాయల బీమా సౌకర్యం నామినీ పొందుతారు. రెండు కళ్ళుకాని, రెండు చేతులు కాని, రెండు పాదాలు కాని పూర్తిగా నష్టపోయినా, ఒక కన్ను పూర్తిగా చూపు కోల్పోయినా, మరియు చేయి లేదా పాదం పనిచేయకపోయినా రూ.2 లక్షల బీమా సౌకర్యం పాలసీదారుడు పొందుతారు. ఒక కన్ను లేక ఒక చేయి లేదా పాదం పాక్షికంగా పనిచేయకపోయినపుడు రూ. ఒక లక్ష బీమా సౌకర్యం పాలసీదారుడు పొందగలుగుతారు. పాలసీ తీసుకునేటపుడే నామినీని దరఖాస్తు ఫారంలో ప్రతిపాదించాలి. ప్రతిపాదిత నామినీకి 18 సంవత్సరాలు వయసు లేకపోతే, 18 సంవత్సరాలు వచ్చేవరకూ సంరక్షకుని పేరుకూడా తెలియజేయాలి.
ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకు చెల్లించాల్సిన ప్రీమియం ఎంత ..?
ఒక వ్యక్తికి సంవత్సరానికి రూ.12 మాత్రమే. ఒకేసారి జూన్ 1వ తేదీన కాని, అంతకు ముందుకాని ఖాతాదారుల ఖాతానుండి ఆటో డెబిట్ పద్ధతిలో బ్యాంకు వసూలు చేస్తుంది. ఆటో డెబిట్ జూన్ 1వ తేదీ తరువాత జరిగితే ఆ తరువాతి నెల 1వ తేదీనుండి బీమా రక్షణ వర్తిస్తుంది.
బీమా రక్షణ లభ్యం కాని పరిస్థితులు ఏంటి..?
- 70 సంవత్సరాల వయసు నిండినపుడు ఈ పథకం వర్తించదు అలాగే బ్యాంకు ఖాతా మూసివేసినపుడు లేదా బీమా కొనసాగించడానికి తగినంత సొమ్ము బ్యాంకు ఖాతాలో లేనపుడు
- సభ్యునికి ఒక ఖాతా కన్న ఎక్కువ ఖాతాలు ఉండి అన్ని ఖాతాల నుండి బీమాకు ప్రీమియంలు చెల్లించినా, బీమా ఒక ఖాతాకు మాత్రమే వర్తిస్తుంది. అదనంగా కట్టిన ప్రీమియం తిరిగి ఇవ్వబడదు.
- ప్రీమియం చెల్లించాల్సిన గడువు రోజు తగినంత మొత్తం ఖాతాలో లేనందువలన లేదా సాంకేతిక మరియు పరిపాలనా కారణాలవలన పథకం వర్తింపు ఆగిపోతే వార్షిక ప్రీమియం మొత్తాన్ని చెల్లించి షరతులకు లోబడి బీమా రక్షణ పునరుద్ధరించుకోవచ్చు. బీమా రక్షణ పునరుద్ధరించడం, బీమా కంపెనీ నిర్ణయానికి లోబడి ఉంటుంది.
- ఆటో డెబిట్ ద్వారా వసూలు చేసే అవకాశాన్ని మనం కల్పించిన నెలలోనే అంటే ప్రతి సంవత్సరం మే నెలలో ప్రీమియం మొత్తాన్ని ఖాతానుండి తీసి, అదే నెలలో బీమా కంపెనీకి భాగస్వామ్య బ్యాంకు చెల్లిస్తుంది. ఇది పూర్తిగా సంబంధిత బ్యాంకు బాధ్యత.
- పథకం అమలు తీరు మరియు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరం పథకంలో అవసరమైన మార్పులు చేయవచ్చు.
- త్వరితంగా బ్యాంకు బ్రాంచి అధికారిని లేదా బ్యాంకు మిత్ర, మైక్రో, ఇన్స్యూరెన్సు ఏజెంట్లను సంప్రదించండి. బ్యాంకు నిర్వహించే క్యాంపుల గురించి తెలుసుకొని సందర్శించి అక్కడే ఫారాలను పూర్తిచేసి బ్యాంకు ప్రయోజనాలను పొందవచ్చు. సందేహాలు ఉన్నట్లయితే టోల్ ఫ్రీ నెంబరు 1800 110001 ను సంప్రదించవచ్చు.
ప్రమాదవశాత్తు చందాదారుడు మరణిస్తే, దాన్ని ధ్రువీకరించడానికి సరైన పత్రాలను సాక్ష్యంగా చూపించినట్లైతే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద క్లెయిమ్ మంజూరు అవుతుంది. ఒకవేళ రోడ్డు, రైలు, ఏదైనా వాహన ప్రమాదం, నీటిలో మునిగిపోవడం, హత్యకు గురికావడం వంటి మరణాలు సంభవించినట్లైతే వాటిని పోలీసులకు ధ్రువీకరించాలి. అలాగే పాము కాటు, చెట్టు పై నుంచి కింద పడి చనిపోయినట్లైతే ఆ మరణాలను ఆసుపత్రి వారు ధ్రువీకరించాల్సి ఉంటుంది. అప్పుడే, ఈ పథకం ద్వారా క్లెయిమ్ లభిస్తుంది.