చాలా మందిని ఎన్నో రకాల సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. చర్మం పొడిబారడం దగ్గర్నుంచి, పగుళ్ళ వరకూ అనేక సమస్యలు ఇబ్బందికరంగా మారతాయి. ఈ పరిస్థితుల్లో చర్మాన్ని కాపాడుకోవడానికి చిన్న పాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు. డై స్కిన్ తో బాదపడుతున్న వారుచర్మ సంరక్షణ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలేంటి..?
ఈ వర్ష కాలంలో ఒక పక్క దాహం వేయదు, మరో పక్క చర్మంలో తేమ తగ్గిపోతూ ఉంటుంది. సాధారణంగానే పొడి చర్మం ఉండే వారి పరిస్థితి ఈ సమయంలో మరింత తీవ్రంగా ఉంటుంది. ఒక్కో సారి చర్మం మీద తెలియని గాయాలు కూడా సతమతం చేస్తూ ఉంటాయి. నిజానికి చర్మ సమస్యలు ఎదురు కావడానికి ప్రధాన కారణాల్లో దాహం వేయకపోవడం కూడా ఒకటి. బయట చల్లగా ఉండడం వల్ల ఎక్కువ మంది నీరు తాగేందుకు ఆసక్తి చూపరు. ఫలితంగా శరీరంలో డీ హైడ్రేషన్ మొదలౌతుంది. అందుకే చర్మ సంరక్షణ కోసం ప్రధానంగా చేయవలసిన పని నీటిని ఎక్కువగా తీసుకోవడమే.
చాలా మంది ఈ డ్రై స్కిన్ నుంచి రక్షణ కోసం రకరకాల లోషన్లను వాడుతూ ఉంటారు. అయితే వైద్యుని సలహా లేకుండా ఏ విధమైన లోషన్లు, క్రీములు వాడడం అంత మంచి పద్ధతి కాదు. ఎందుకంటే చాలా మందిలో వారసత్వం కారణంగా కూడా డ్రైస్కిన్ సమస్య ఏర్పడుతుంది.
చర్మం పొడి బారడానికి కారణాలు ఏంటి ?
డ్రై స్కిన్ తో భాదపడుతున్నవారు చర్మం ఎందుకు పొడిబారుతుందో తెలుసుకోవాలి. సాధారణంగా ఆరోగ్యవంతమైన చర్మం మీద స్వభావ సిద్ధమైన పలుచని నూనె పొర ఉంటుంది. ఇది చర్మం యొక్క తేమను కోల్పోకుండా సంరక్షిస్తుంది. చర్మం పొడిబారడానికి అనేక కారణాలున్నాయి. సాధారణంగా చర్మం మీద ఏ ఉత్పాదనలను ఉపయోగిస్తున్నారో, వాటి వలన చర్మం యొక్క సహజ సిద్ధమైన నూనె తక్కువైపోతుంది. అందుచేత చర్మం సంరక్షణను కోల్పోతుంది. కొన్ని రకాల వ్యాధుల వల్ల కూడా చర్మం పొడతబారుతుంది. ముఖ్యంగా డయాబెటిస్, థైరాయిడ్, క్యాన్సర్ సమస్యలు ఉన్న వారిలో ఇలాంటి పరిస్థితి ఎదురౌతుంది. ఇటువంటి వారు వైద్యుని సలహా లేకుండా అధికంగా కాస్మటిక్స్ వాడడం వల్ల, ఇందులోని కెమికల్స్ చర్మం లోపల అలానే ఉండిపోయి, సమస్యను మరింత జటిలం చేస్తాయి.
డ్రై స్కిన్ కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
పొడి చర్మంతో బాధపడుతున్నవారు ముందుగా చేయాల్సిన పని.. చర్మానికి తేమను అందించడం లేదా చర్మం తేమను కోల్పోకుండా చూడ్డం. పెట్రోలియం జెల్లీ, మినరల్, ఆయిల్స్ వంటివి ఇందుకు సహకరిస్తాయి. వీటిని పైపూతగా ఉపయోగించడం వల్ల చర్మం తేమతో నిగారిస్తుంది. గంటల కొద్దీ స్నానం చేయకుండా పది నిమిషాల్లో, అదీ వేడివేడి నీటితో కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం ముగించేయాలి. లేకపోతే చర్మంలోని సహజసిద్ధమైన నూనెలని కోల్పోయే అవకాశం ఎక్కువ. ఆ నూనెలు తొలగిపోతే చర్మం పొడిగా మారుతుంది. సబ్బు వాడకాన్ని వీలైనంత వరకూ తగ్గించుకోవడం మంచిది. తప్పనిసరై వాడాల్సి వచ్చినా.. తేమ శాతం ఎక్కువ ఉండేవి ఆల్కహాల్ గాఢత లేనివి వాడాలి. స్నానం చేసి వచ్చిన వెంటనే శరీరం పూర్తిగా తడారక ముందే కాళ్లూ, చేతులకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అలా అయితే తేమ ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది.
వేడి వేడి నీటితో స్నానం చేయడం, గాఢత ఎక్కువగా ఉండే సబ్బులు వాడటం వల్ల కూడా చర్మం పొడి బారుతుందని గుర్తుంచుకోవాలి. దీని పట్ల అవగాహనతో మీ చర్మంతో పాటు, మీ కుటుంబం చర్మాన్ని సంరక్షించుకోండి.