Jammu and Kashmir : జమ్మూకశ్మీర్ లో ‘ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే’-సుప్రీం కోర్టు

By manavaradhi.com

Published on:

Follow Us

జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir) కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ‘ఆర్టికల్‌ 370 #Article370 రద్దు రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగబద్ధమే అని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. జమ్మూకశ్మీర్‌ అంశంలో రాష్ట్రపతి ప్రకటనపై తాము జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ అంశంపై పిటిషనర్ల వాదనను తోసిపుచ్చిన రాజ్యాంగ ధర్మాసనం.. ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. జమ్మూకశ్మీర్‌ పై కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాల్‌ చేయలేరన్న ధర్మాసనం. భారత్‌లో విలీనం తర్వాత జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని తెలిపింది.

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే 370 ఆర్టికల్‌ను కేంద్రం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జమ్మూకశ్మీర్‌కు చెందిన పలు పార్టీలు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వాటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి సుదీర్ఘంగా విచారణ జరిపింది. సెప్టెంబరు 5న తన తీర్పును రిజర్వులో ఉంచి నేడు తీర్పు వెల్లడించింది.

Leave a Comment