చాలా మంది ఈ రోజు నా కన్ను అదిరింది. ఏమి జరుగుతుందో అని ఆందోళన పడిపోతూ ఉంటారు. కానీ నిజానికి కొన్ని రకాల కంటి సంబంధిత రోగాల వల్ల కూడా కన్ను అదరడం జరుగుతుందని చెబుతున్నారు వైద్యులు. అసలు ఇంతకీ కన్ను ఎందుకు అదురుతుంది. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి..?
చాలా మందికి కనురెప్పలు అందురుతుంటాయి. కొందరికి కుడి కన్ను అదురితే.. మరికొందరికి ఎడమ కన్ను అదురుతూ ఉంటుంది. కొందరికి పై రెప్పలు అదిరితే.. మరికొందరికి కింది రెప్పలు అదరడం సహజంగానే జరుగుతుంటుంది. కంటి నరాలలో కలిగే అసంకల్పిత ప్రతీకార చర్యల కారణంగానే కనురెప్పలు అదురుతుంటాయన్నారు. మన శరీరంలో ఉన్న అన్ని కండరాల కంటే కంటి కండరం చాలా చురుకైనది. ఒక కంటిలో ఉన్న పనిచేసే అన్ని భాగాలను కలుపుకుంటే అవి దాదాపు 20 లక్షలకుపైగా ఉంటాయని అంచనా.
ఏ పని చేయాలన్నా కంటి చూపు చాలా ముఖ్యం. కళ్ళకి రక్షణగా రెండేసి కనురెప్పలున్నాయి. ధూళి సోకకుండా వాటి అంచులకు వెంట్రుకలున్నాయి. కనుగుడ్లను కాపాడేందుకు అస్తమానం తేమగా ఉంచగలిగిన గ్రంధులున్నాయి. కనురెప్పల కదలికకు తోడ్పడే కొవ్వును సరఫరా చేసే ప్రత్యేక గ్రంధులున్నాయి. కంట్లోకి స్వేదజలం కారకుండా పైన కనుబొమలున్నాయి. కళ్ళకు సులభంగా దెబ్బ తగలకుండా పుర్రెలో వాటికై తగిన ఆకారంలో గుంటలున్నాయి. అతేకాకుండా వెలుతురు నుంచి చీకటిలోకి, అకస్మాత్తుగా వెలుతురు పెరిగినప్పుడు వాటి సామర్య్థాన్ని పరిరక్షించడానికీ ఎన్నో ఏర్పాట్లున్నాయి.
కండరాలు సంకోచించటం వల్ల ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది. కండరాలు సంకోచించటం శరీరంలోని ఏ భాగంలోనైనా రావొచ్చు. కనురెప్పల మీద ఎక్కువగా ఇది వస్తుంది. కాబట్టి కన్ను కొట్టుకుంటుంది. కంటి చుట్టూ లాగేసినట్టుగా ఉంటుంది. కనురెప్పలు ఒక్కసారిగా కొట్టుకుంటాయి. రెండూ ఒకేసారి కొట్టుకునే అవకాశాలు తక్కువ. ఇది దీర్ఘకాలికంగా ఉన్నప్పటికీ గుర్తించడానికి సమయం పడుతుంది. కనురెప్పలు కొట్టుకునే లక్షణం కొన్ని రోజులు, కొన్నివారాలు, కొన్ని నెలలు ఉండొచ్చు. కనురెప్పలు కొట్టుకోవటం అంత ఈజీగా తీసుకోవాల్సిన అంశం కాదు. అలా అని సీరియస్ ప్రాబ్లమ్ అని కాదు. కనురెప్పలు కొట్టుకోవటం కొన్ని రోజులు ఉంటే పర్వాలేదు కానీ వారాలతరబడి కన్ను కొట్టుకుంటే మాత్రం వైద్యుడిని సంప్రదించాలి.
కనురెప్పలు కొట్టుకోవడానికి శరీరంలో ఉన్న అనారోగ్యానికి చిహ్నంగా భావించాలా..?
కనురెప్పలు కొట్టుకోవడానికి శరీరంలో ఉన్న అనారోగ్యానికి చిహ్నం క్రింద పరిగణించాలి. అంతేకాదు మన శరీరంలో వ్యాధులు ముదరకముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించే గైడ్ మాదిరిగా ట్విచ్చింగ్ పరిగణించాలి. కనురెప్ప కొట్టుకోవటం మెదడు, వెన్నుముక డిసార్డర్ అని ఒక అధ్యయనంలో తేలింది. సకాలంలో చికిత్స అందితే రోగం ముదిరే అవకాశం లేదు. కనురెప్ప భాగంలో అదిరితే కంటి డాక్టరు దగ్గరికి వెళుతుంటారు. తగ్గితే పర్వాలేదు కానీ అదే పరిస్థితి రిపీట్ అయితే మాత్రం సీరియస్ ప్రాబ్లం క్రింద చూడాలి. శరీరంలో వచ్చే మార్పులకు స్పందించే గుణమే కండరాలు సంకోచించటం, ఈ వ్యాధి వచ్చే ముందు మన కళ్లు ఎర్రగా మారతాయి. ఉబ్బినట్టుగా ఉంటాయి. కనుపై రెప్ప పడిపోయినట్టుగా ఉంటుంది. ఈ ట్విచ్చింగ్ వల్ల నొ్ప్పి ఉండదు. నష్టం జరగదు. కన్నుభాగంలోనే కాకుండా ముఖం మీద మరికొన్ని చోట్ల ట్విచ్చింగ్ లక్షణాలను గమనించవచ్చు.
కనురెప్ప కొట్టుకునే ముందు మీరు తీసుకున్న ఆహారం, ఒత్తిడి వల్ల వచ్చిందా అనే విషయాలు ప్రస్పుటమౌతాయి. సమతులాహారం తీసుకోవాలి. తాజా వెజిటేబుల్స్, పండ్లు, కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి. దీనివల్ల శక్తి సమకూరుతుంది. కోడి మాంసం ద్వారా ప్రోటీన్లు పొందవచ్చు. నిద్ర ద్వారా ఆరోగ్యం స్థిమితంగా ఉంటుంది. నిద్ర వల్ల శరీరం నూతన ఉత్తేజం పొందుతుంది. నిద్రవల్ల అలసి సొలసిన శరీరం త్వరగా కోలుకుంటుంది. కంటికి సంబంధించిన ఏ సమస్యలు వచ్చినా, వాటికి వీలైనంత త్వరగా పరిష్కార మార్గాలు వెతకాలి. ముఖ్యంగా పిల్లల్లో ఈ సమస్యలు ఎక్కువ కాలం కొనసాగితే… కళ్ళు మరింత సున్నితంగా మారి, అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది గనుక వెంటనే జాగ్రత్తపడాలి.
వాస్తవానికి మన శరీర భాగాలు అదరడానికి కారణాలు చాలా ఉన్నాయి. కొందరు ఉదయం నుంచీ రాత్రిదాకా అదిరిందంటారు. కళ్ళ వ్యాధులున్నాకూడా కంటి భాగాలు తరచూ అదరవచ్చు. అలాంటప్పుడు డాక్టరుని సంప్రదించాలిగానీ నమ్మకాలని పట్టుకుని వేళ్ళాడకూడదు.