అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా జగన్ అసెంబ్లీకి వెళతాడా లేదా? ప్రతిపక్ష హోదా కోసం పాకులాడినా ఫలితం లేకపోయింది. ఇదిలా ఉంటే వైసీపీలో నేతల సంఖ్య రోజురోజుకు పడిపోతుంది. ఇప్పటికే ముఖ్య నేతలు అందరూ వెళ్లిపోయారు. ఉన్న 11 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి ఎలా వెళ్లాలనేది ప్రశ్న… ప్రజా సమస్యలను ఎత్తిచూపేందుకు అసెంబ్లీ వేదిక. దానిని జగన్ ఉపయోగించుకోవాలి అని పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.
వైసీపీ అధినేత జగన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతి విషయంలోనూ పోరాడుతూ వచ్చారు. తన తండ్రి వైఎస్‌ఆర్ మరణం తరువాత జగన్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడారు. ఆయనపై కేసు నమోదైంది. దానిని కూడా లెక్క చేయలేదు. సీబీఐ జగన్ ను రిమాండ్ కు పంపింది. చాలా కాలం బెయిల్ కూడా రాకుండా చేశారు. అయినా పట్టించుకోలేదు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత పార్టీని తన భుజాలపై వేసుకుని ముందుకు నడిపించారు. ఒకసారి ఎంపీలను రాజీనామా చేయించారు. మరో సారి ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి బై ఎలక్షన్ కు వెళ్లారు. 2014లో ప్రతిపక్షంలో కూర్చున్నా తనకంటూ ఒక ప్రత్యేకత ఉందని అసెంబ్లీ వేదికగా తెలియజెప్పారు. ఎమ్మెల్యేలు ఎంత మంది ఉన్నారనేది కాదు. అసెంబ్లీలో ప్రజా సమస్యలను ఎంతవరకు లేవనెత్తి ప్రజలకు చేరువ కాగలిగామనేది తెలియజెప్పారు.
2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. 2014లో అప్పటి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు చేసిన అవమానాలను లెక్క చేయకుండా అడుగులు వేసిన జగన్ ఆ తరువాత అధికారం చేపట్టాక శివప్రసాదరావును అదే స్థాయిలో అవమానించారు. క్యాంపు కార్యాలయంలోని ఫర్నీచర్ తన కుమారుడి వ్యాపార కార్యాలయంలో ఉండటంపై కేసు నమోదు చేయించారు. ఇవి తట్టుకోలేక కోడెల చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తమ్మినేని సీతారామ్ ను స్పీకర్ గా పెట్టి కోడెల ఎలాగైతే ప్రవర్తించాడో అలాగే తమ్మినేని ప్రవర్తించేలా చేశాడు. వాటిని దృష్టిలో పెట్టుకుని జగన్ అసెంబ్లీకి వెళ్లడం లేదా అన్నది కూడా చర్చ జరుగుతోంది.
ప్రతిపక్ష నేతకు మైకు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా మాట్లాడుతుంటే మైకు కట్ చేస్తారు. అవమానాలు కొత్త కాదు. అసెంబ్లీలో ఉండి మైకు కోసం పోటీ పడటం కంటే అసెంలబ్లీకి వెళ్లకపోవడమే మంచిదని అంటూ, ప్రజా సమస్యలపై మీడియానే మాకు సహకరించాలని అనటం చర్చగా మారింది.
అసెంబ్లీ సమయంలో ప్రతి రోజూ ప్రజా సమస్యలు మీడియా వేదికగా ప్రస్తావించేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలు చర్చించి వాటిని పరిష్కరించేందుకు అసెంబ్లీనే మంచి వేదిక. కానీ ఎందుకో జగన్ వెనుకడుగు వేస్తున్నారు. వెళ్లటం వల్ల ప్రయోజనం లేదని మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మైకు ఇవ్వకుండా, మాట్లాడనీయకుండా అడ్డంకులు కల్పిస్తే అది ప్రభుత్వానికే అవమానంగా భావించాలి తప్ప తమకు అవమానంగా ఎందుకు భావించాలనేది రాజకీయ మేధావుల మాట.
తల్లిని, చెల్లిని దూరంగా పెట్టిన అంశాలు ప్రస్తావించి అసెంబ్లీలో ఇరుకున పట్టే అవకాశం ఉందని, అందుకే అసెంబ్లీకి వెళ్లకుండా ఉండాలని జగన్ నిర్ణయించారనే ప్రచారం కూడా సాగుతోంది. నిజానికి శాంతి భద్రతల సమస్య, హామీ ఇచ్చినట్లు డీబీటీ పథకాలు అమలు చేయక పోవడం, సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వంటి సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశం ఉంది. ప్రధానంగా బడ్జెట్ సమావేశాలు కాబట్టి బడ్జెట్ పై చర్చించే అవకాశం దొరుకుతుంది. ఇవన్నీ ఎందుకు జగన్ జారవిడుచుకుంటున్నారో అర్థం కావటం లేదని వైఎస్సార్సీపీలోని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.