Cough causes : దగ్గు ఎందుకు వస్తుంది? ఎలా నివారించాలి?

By manavaradhi.com

Published on:

Follow Us

కాలంతో సంభంధం లేకుండా కొందరిని దగ్గు తీవ్రంగా వేధిస్తుంది. విపరీతంగా దగ్గడం వల్ల రాత్రి పూట సరిగా నిద్ర కూడా పట్టదు. దీంతో ఆరోగ్యం దెబ్బతింటుంది. అసలే దగ్గు రానివారంటూ ఎవరూ ఉండరు. ఎప్పుడో అలా అరుదుగా దగ్గు వచ్చినా, ఎవరికీ ఆందోళనకరంగా ఏమీ అనిపించదు. ఏదో జలుబు, జ్వరం, బ్రాంకైటిస్‌, న్యుమోనియా వంటి సమస్యలేమైనా వచ్చినప్పుడు కూడా దగ్గు రావచ్చు కాకపోతే, కొద్ది రోజుల్లో లేదా ఒకటి రెండు వారాల్లో తగ్గిపోతుంది.

ఈ దగ్గు కేవలం ఏదో ఆయాసాన్ని కలిగించేది మాత్రమే కాదు. ఇది నిద్రా భంగం చేస్తుంది. ఇందుకు భిన్నంగా కొన్ని రకాల దగ్గు సమస్యలు, ఎనిమిది వారాలైనా, తగ్గకుండా అలా కొనసాగుతూనే ఉంటాయి. కొంతమందిలో ఈ సమస్య నెలలే కాదు ఏడాది గడచినా తగ్గకపోవచ్చు. నిజానికి ఈ రోజుల్లో ఎక్కువమంది డాక్టర్‌ను కలుస్తున్న ఒక పెద్ద కారణం ఈ దగ్గు సమస్యే. దగ్గు అనేది నిజానికి వ్యాధి లక్షణమే తప్ప వ్యాధి కాదు. అందువల్ల దగ్గు కారణాన్ని కనుక్కుంటే దగ్గుకు వైద్యం కనుకున్నట్లే అవుతుంది.

  • సీజన్ మారినప్పుడల్లా కొందరికి జలుబుతోపాటు దగ్గు కూడా వస్తుంటుంది. కొందరికి ఇతర కారణాల వల్ల కూడా ఎప్పటికప్పుడు దగ్గు వస్తుంది. అయితే దగ్గు రావడానికి కారణం ఏమైనా అది వచ్చిందంటే చాలు ఓ పట్టాన పోదు. దీంతో దగ్గు వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది.
  • ముఖ్యంగా రాత్రి పూట నిద్రకు ఆటంకం కలుగుతుంది. చాలామందికి ముక్కులోనూ, సైనస్‌ గదుల్లోనూ ఇన్ఫెక్షన్లు, అలర్జీల వంటివి సమస్యలుంటాయి. వీటివల్ల పల్చటి స్రావాలు, కఫం వంటివి తయారవుతుంటాయి. కానీ కొందరిలో ఈ స్రావాలు ముందు నుంచి కాకుండా.. ముక్కు వెనకాల భాగం నుంచి బొట్లుబొట్లుగా గొంతులోకి జారి పడుతుంటాయి.
  • ఇది దగ్గుకు దారి తీస్తుంది. ఈ సమస్య వారాల తరబడి కొనసాగుతూ… ఇది దీర్ఘకాలిక దగ్గుకు ముఖ్యకారణంగా పరిణమిస్తుంది. దీనికి వైద్యుల సలహాతో అలర్జీ చికిత్స, అవసరమైతే యాంటీబయాటిక్స్‌ తీసుకోవటం వంటివి చేస్తే ఈ సమస్య తగ్గుతుంది, దగ్గూ పోతుంది.
  • సాధారణంగా అసిడిటీ సమస్య ఉన్నవారిలో గుండెల్లో మంట, గొంతులోకి పుల్లగా రావటం వంటి లక్షణాలుంటాయి. కానీ కొందరిలో అలాంటివేమీ లేకుండా, కేవలం దగ్గు మాత్రమే ఉండొచ్చు.
  • సాధారణంగా ఆస్థమాలో చాలావరకూ పొడి దగ్గు, విడవకుండా వేధిస్తుంటుంది. రోజంతా ఉన్నా రాత్రిపూట మరీ ఎక్కువగా ఉండొచ్చు.దీన్ని గుర్తించి వైద్యులు ఆస్థమాకు సంబంధించిన పరీక్షలు చేయిస్తే విషయం బయటపడుతుంది. వీరికి ఆస్థమా చికిత్స ఆరంభిస్తే దగ్గు తగ్గిపోతుంది.
  • ఊపిరితిత్తుల్లోని శ్వాసనాళాలు వాచిపోయి వచ్చే బ్రాంకైటిస్‌లో కూడా దగ్గు ఇలాగే దీర్ఘకాలం వేధిస్తుంటుంది. హైబీపీ వంటి కొన్ని రకాల సమస్యలకు వాడే మందుల వల్ల కూడా దగ్గు వీడకుండా వేధిస్తుంటుంది.
  • కాబట్టి ఏవైనా మందులు మొదలుపెట్టిన తర్వాత దగ్గు వేధిస్తుంటే ఆ విషయాన్ని తప్పనిసరిగా వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి.
  • శరీరాన్ని ఏ సీజన్ లో అయినా హైడ్రేషన్ లో ఉంచుకోవాలి. అందుకు నీరు ఒక ఉత్తమైన మార్గం. గోరువెచ్చని నీళ్ళను త్రాగడం వల్ల గొంతు నొప్పిని తగ్గిస్తుంది.
  • దగ్గుకు గురైనప్పుడు కొద్దికొద్దిగా నీళ్ళను త్రాగడం మొదలుపెట్టండి. ఇది ఖచ్చితంగా దగ్గు తగ్గుముఖం పడేలా చేస్తుంది. వేడిగా కాఫీ లేదా టీ లేదా వేడి వేడిగా మీకు ఇష్టమైన సూప్స్ తీసుకోవడం వల్ల దగ్గకు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.
  • గాలిలో వివిధ రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. మనకు తెలియకుండానే మన దుపట్లు, తలగడ దిండల్లో చేరతాయి. కాబట్టి వాని ఎప్పుటి కప్పుడు మారుస్తూ ఉండాలి.
  • అత్యధికుల్లో ఉండే పొగతాగే అలవాటు ఈ సమస్యకు ఒక పెద్ద కారణం. పొగతాగడం మానుకోవాలి. మద్యం అలవాటు ఉంటే వెంటనే మానేయడం తప్పనిసరి.
  • ఫ్యాటీ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. భోజనం ఎప్పుడూ తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. భోజనం చేసిన రెండు గంటల దాకా నిద్రపోకూడదు.
  • నిద్ర సమయంలో కడుపులోని ఆమ్లాలు కింది వైపే వెళ్లేందుకు వీలుగా తలకింద ఎత్తైన దిండు పెట్టుకోవాలి. ఈ జాగ్రత్తలతో సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • ఒకవేళ అప్పటికీ ఉపశమనమూ కలగకపోతే, మీకు ద గ్గు రావడానికి మరేదో కారణం ఉందని భావించాలి. ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించాలి.

Leave a Comment