Health Benefits:మెదడు చురుగ్గా పనిచేయాలంటే ?

By manavaradhi.com

Published on:

Follow Us

ఏ వ్యక్తి అయినా మరింత చురుగ్గా ముందుకు దూసుకుపోవాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండడంతోపాటు మానసికంగా దృఢంగా ఉండాలి. అలా ఉండాలంటే మెదడు చురుగ్గా పనిచేయాలి. మెదడు నుండి శరీరంలోని వివిధ అవయవాలకు నాడులు కలుపబడి ఉంటాయి. మెదడు జ్ఞానేంద్రియాలన్నింటికి ముఖ్యమైన కేంద్రం. మన మెదడులో దాదాపు 90 బిలియన్ల వరకు న్యూరాన్లు ఉంటాయి. ఇవి కంటిన్యూగా సిగ్నల్స్ పంపిస్తుండటం వల్లే మనం హాయిగా జీవించగలుగుతున్నాము. మెదడు చెప్పినవిధంగానే మన శరీరం నడుచుకుంటుంది. కాబట్టి మెదడు చురుగ్గా ఉన్నంత కాలం మన శరీరం చురుకుగా ఉంటుంది.

మెదడు చురుగ్గా ఉండాలి, దాంతో మన ఆరోగ్యం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని బ్రెయిన్ డ్యామేజ్ లేకుండా చూసుకోవాలి. అందుకు కొన్ని చెడు అలవాట్లను దూరం చేసుకోవాలి. మెదడు ఏదైనా ఒక భాగం సమస్యాత్మకంగా ఉన్నప్పుడు, అప్పుడు నిస్సందేహంగా మొత్తం శరీర ఉనికి మరియు అన్ని చర్యలు సమస్యాత్మకంగా మారుతాయి. కాబట్టి మన మెదడు మీద మనకు శ్రద్దఉండాలి. మెదడుకు ఎటువంటి హానీ కలగకుండా చూసుకొన్నప్పుడే మన శరీరంలో అన్ని అవయవాలు క్రమంగా పనిచేస్తాయి. అప్పుడే మనం అరోగ్యంగా ఉండగలం.

వయసు మళ్లే కొద్దీ చాలామందిలో మెదడు పనితీరు మందగిస్తుంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే, మెదడును పదిలంగా ఉంచుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. శరీరానికి తగినంత నిద్ర, విశ్రాంతి అవసరం. కలత నిద్ర, మగతగా నిద్రించడం వంటివి కాకుండా పూర్తిస్థాయి గాఢనిద్ర ఉండాలి. మొత్తంగా రోజుకు కనీసం ఆరు గంటల నుంచి 8 గంటల వరకు నిద్ర అవసరమని, పని మధ్యలోనూ అప్పుడప్పుడు పది పదిహేను నిమిషాలు విశ్రాంతి తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. తగినంత నిద్ర లేకపోతే దీర్ఘకాలంలో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది.

ధూమపానం, మద్యపానం వంటి అలవాట్ల వల్ల శరీరంలో రక్తనాళాలు దెబ్బతినడం, హానికర రసాయనాలు చేరడంతో మెదడు పనితీరు దెబ్బతింటుంది. అందువల్ల వీటికి దూరంగా ఉండాలి. కాలుష్యం కూడా మన మెదడుపై ప్రభావాన్ని చూపెడుతుంది. మనం పీల్చుకునే ఆక్సిజన్ లో ఎక్కువ శాతం మన మెదడు వినియోగించుకుంటుంది. కలుషిత గాలి పీల్చడం వల్ల మెదడు ఆక్సిజన్ సరఫరా తగ్గి, దాంతో మెదడు సామర్థ్యం తగ్గుతుంది. అలాగే ఎక్కువగా చక్కెర కలిగిన పదార్థాలు తీసుకోవడం కూడా మెదడు అభివృద్ధిపై ప్రభావితం చూపుతుంది.

అతిగా తినడం వల్ల మెదడు శక్తి తగ్గుదలకు దారితీస్తుంది. అది మెదడు క్షీణత కారణమవుతుంది. మెదడుకు సరైన మోతాదులో పోషకాలు అందక మెదడు పనిచేసే శక్తి తగ్గుతుంది. బ్రెయిన్ డ్యామేజ్ కు ఇది కూడా ఒక కారణం. నిద్ర మన మెదడుకు విశ్రాంతి కలిగిస్తుంది. అయితే అతిగా నిద్రపోవడం వల్ల మెదడు కణాల పనిచేయక చురుకుదనం తగ్గి, మెదడు పనితీరు మందగించేలా చేస్తుంది. అలాగే అనారోగ్య సమయంలో ఎక్కువగా పనిచేయడం లేదా చదడం వంటి వాటివల్ల మెదడు మీద ప్రభావం చూపించడంతో పాటు మెదడుకు నష్టం కలిగే అవకాశం ఉంది.

మెదడు పనితీరు మెరుగుపడాలంటే జీవనశైలిలో తప్పనిసరిగా మార్పులు చేసుకోవాలి. అప్పుడు మెదడు యాక్టివ్ గా, హెల్తీగా ఉంటుంది. సరైన ఆహారాలు.. మెదడు చురుగ్గా పనిచేయడానికి, ఏకాగ్రత పెరగడానికి, జ్ఞాపకశక్తి మెరుగవడానికి సహాయపడతాయి. మన శరీరంలో మెదడు రెండుశాతం మాత్రమే ఉంటుంది. కానీ మనం తీసుకునే ఆహారంలో 20శాతం క్యాలరీలు అవసరం అవుతాయి. కాబట్టి, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల మెదడు మీద ప్రభావం చూపుతుందన్న విషయాన్ని గుర్తుంచుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

మెదడును షార్ప్ గా ఉంచి ఏకాగ్రతను పెంచే ఆహారాలను తీసుకోవాలి. ఉదయం అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. అల్పాహారం తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు రోజువారీ కార్యక్రమాలు చురుగ్గా చేసుకోవచ్చు. మెదడు ఆరోగ్యం మెరుగవ్వాలంటే ఒమేగా 3 ఆమ్లాలుండే చేపలను తినాలి. వేరుశనగ గింజలు, ఆక్రోట్, బాదం లాంటి నట్స్ నిద్రలేమిని పోగొట్టి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ప్రతిరోజు మెదడులోకి అనవసరపు ఆలోచనలను చొప్పించకుండా ప్రశాంతంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

మన మెదడులోకి మంచి ఆలోచనలు చేరాలంటే సరైన వ్యాయామం, ధ్యానం, నడక కొంత సమయం పాటు చేయడం తప్పనిసరి. ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండటం ద్వారా మెదడు చురుగ్గా ఉంటుంది. సంగీతం వినడం వల్ల కూడా మన మెదడు చురుగ్గా ఉంటుంది. మెదడుకు పదును పెట్టే పనులు, ఆలోచనలతోనే అది చురుకుగా, సమర్థంగా తయారవుతుంది. అందుకే మన మెదడుకు వ్యాయామం అవసరం. నిత్యం ఏదో ఒక పనిలో, ఏదో ఒక ఒత్తిడితో సతమతం అవుతూంటే మెదడుపై భారం పెరిగిపోతుంది. అందువల్ల అప్పుడప్పుడూ.. అన్ని రకాల పనులు, ఒత్తిళ్లకు దూరంగా సరదాగా గడపడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు

మెదడు ఆరోగ్యంగా ఉండటానికి పోషకాహార నిపుణులు సూచించే ఆహార పదార్థాలను తీసుకోవాలి. అప్పుడవి వయసు ప్రభావాన్ని మెదడుపై పడకుండా చేస్తాయి. అంతేకాదు ఫిజికల్ యాక్టివిటీని పెంచుకుంటే కూడా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఈ జాగ్రత్తలు పాటించండి. మెదడు పనితీరును మెరుగుపర్చుకోండి.

Leave a Comment