ఆరోగ్య రక్షణలో అయోడిన్ పాత్ర ఎంతో కీలకమైంది. శరీరంలో అయోడిన్ లోపిస్తే అనారోగ్యం తప్పదు. శరీరంలోని హర్మోన్ల ఉత్పత్తికి కూడా అయోడిన్ కీలకపాత్ర వహిస్తుంది. జీవక్రియలు చురుగ్గా ఉండేలా చేస్తుంది. శరీరానికి అవసరమైన సూక్ష్మపోషకాల్లో అయోడిన్ చాలా ముఖ్యమైనది. అయితే దీనిపై తగిన అవగాహన లేకపోవడంతో దీనిని తీసుకోలేక చాలామంది రకరకాల అనారోగ్యాలకు గురవుతున్నారు.
ఇటీవల కాలంలో అయోడిన్ లోపంతో గర్భిణీలు, చిన్నారులు అధిక సంఖ్యలో అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రతీ వంద మందిలో ఇరవై మందికి ఈ లోపం ఉన్నట్లు వైద్య పరిశోధనల్లో తేలింది. మన దేహంలో జీవక్రియలు సక్రమంగా జరగాలంటే సూక్ష్మ పోషకాలకు చెందిన అయోడిన్ వంటి మూలకాలు అవసరం. ఈ సూక్ష్మ పోషకాన్ని గొంతు భాగంలో ఉన్న థైరాయిడ్ గ్రంధి ఉపయోగించుకుని థైరాక్షిన్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. వీటి వల్ల మన జీవక్రియలు సక్రమంగా జరిగి శరీర పెరుగుదల, ఆరోగ్యం సమతూకంలో ఉంటుంది. అయోడిన్ లోపం వల్ల తలెత్తే వ్యాధుల నివారణకు అయోడైజ్‌డ్ ఉప్పును ప్రజలు వాడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తోంది.
అయోడిన్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ?
- మన శరీరానికి సంపూర్ణ పోషణ అందాలంటే విటమిన్లు, మినరల్స్ ఉన్న ఆహారాలను తినాలని అందరికీ తెలిసిందే. అయితే మినరల్స్ విషయానికి వస్తే వాటిల్లో ఒక్కో మినరల్ మనకు ఒక్కో రకంగా ఉపయోగపడుతుంది.
- ముఖ్యంగా అయోడిన్ అయితే మన శరీరానికి ఎంతగానో అవసరమవుతుంది. దీని వల్లే థైరాయిడ్ గ్రంథులు సరిగ్గా పనిచేస్తాయి. దీంతో హార్మోన్లు నియంత్రణలో ఉంటాయి. శరీర మెటబాలిజం ప్రక్రియ సరిగ్గా ఉంటుంది. పిల్లల్లో చురుకుదనం తగ్గడానికి కారణం వారు తీసుకునే ఆహారంలో సరైన సూక్ష్మ పోషకాలు లేకపోవడం.
- మన శరీరం ఎదుగుదలకు, ఆరోగ్యానికి చాలా తక్కువ పరిమాణంలో అవసరమయ్యే వాటిని సూక్ష్మ పోషకాలు అంటాం. వీటిలో ముఖ్యమైనది అయోడిన్. అయోడిన్ సరిగ్గా అందకపోతే థైరాయిడ్ గ్రంథి వాపుకు లోనవుతుంది. ఫలితంగా థైరాయిడ్ సమస్యలు వస్తాయి. అలసట, నీరసం, బరువు బాగా పెరగడం లేదా బాగా తగ్గిపోవడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. దీంతోపాటు కండరాల నొప్పులు, నోట్లో ఎప్పుడు పొడిగా ఉండడం తదితర సమస్యలు కూడా వస్తాయి. ఇక గర్భిణీలకు అయోడిన్ చాలా ఎక్కువ మోతాదులో కావల్సి ఉంటుంది.
అయోడిన్ మనకు ఎలాంటి ఆహారాల్లో లభిస్తుంది ?
- సాధారణంగా మనం రోజూతినే ఆహారం నుంచే శరీరానికి కావల్సిన అయోడిన్ లభిస్తుంది. దీన్ని థైరాయిడ్ గ్రంథి గ్రహించి హార్మోన్ తయారీ చేస్తుంది. శరీరం ఎదగడానికి, మెదడు పూర్తిస్థాయిలో పనిచేయడానికి ఈ హార్మోన్ అవసరం.
- అయోడిన్ మనం తీసుకునే ఆహార పదార్థాలలో, తాగే నీటిలో ఉంటుంది. పాలకూరలో అయోడిన్ పుష్కలంగా ఉంటుంది. తరచూ పాలకూరను తింటే శరీరానికి అయోడిన్ సరిగ్గా అందేలా చూసుకోవచ్చు.
- పాలు, దాని సంబంధ ఉత్పత్తుల్లో అయోడిన్ సమృద్ధిగా ఉంటుంది. ఒక కప్పు పాలు తాగితే మనకు రోజు మొత్తానికి కావల్సిన అయోడిన్‌లో 59 నుంచి 112 శాతం వరకు అందుతుంది. మనం తినే ఉప్పు అయోడైజ్డ్ ఉప్పు అయి ఉండాలి.
- సాధారణ ఉప్పు తింటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. అయోడైజ్డ్ ఉప్పు అయితే మన శరీరానికి అయోడిన్ అందుతుంది. అయితే ఈ ఉప్పును సరైన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అధికంగా తీసుకోకూడదు.
- సముద్రపు చేపల్లో అయోడిన్ పుష్కలంగా ఉంటుంది. దీంతోపాటు మన శరీరానికి కావల్సిన ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఈ చేపల్లో సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చక్కని పోషణను అందిస్తాయి.
- రోజూ ఒక ఉడకబెట్టిన కోడిగుడ్డును తిన్నా చాలు. దాంతో మన శరీరానికి కావల్సిన అయోడిన్ అందుతుంది.
- అరటిపండ్లు, క్యారెట్లు, స్ట్రాబెర్రీలు, తృణ ధాన్యాలు తదితర ఆహారాల్లోనూ అయోడిన్ సమృద్ధిగా లభిస్తుంది. వీటిని తరచూ తీసుకుంటుంటే అయోడిన్ లోపాన్ని సరిచేసుకోవచ్చు.