ఎవవరికైనా ఆరోగ్యం బాగోలేదంటే పండ్లరసాలు తీసుకోమని వైద్యులు సూచిస్తారు. అయితే ఏ పండ్ల రసాలు అనే విషయంలో పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరమే. అన్ని రకాల పండ్ల రసాలు ఆరోగ్యానికి మేలు చేయవు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. పండ్ల రసాలాల్లో ఆరోగ్యానికి మేలు చేసేవి ఏమిటో, చేటు చేసేవి ఏమిటి..?
వేసవికాలం ఆరంభం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల నుంచి ఎంతో ఉపశమనం కలిగించేవే పండ్లు, ఫలాలు. వాటి రసాలను నిత్యం తీసుకోవడం వల్ల ఎండలోనూ కష్టపడే వారికి కొంత ఉపశమనం కలుగుతుంది. ప్రస్తుత రోజులలో ఒత్తిడి ప్రతి ఒక్కరిని అలసిపోయేలా చేస్తోంది. ఎన్ని ఆహారాలు తీసుకొన్నప్పటికీ ఒత్తిడి కారణంగా అవన్నీ మనలను నీరసించేలానే చేస్తూంటాయి. అందుకు ప్రత్యామ్నాయంగా పండ్ల రసాలను తీసుకోవడం చాలా మంచిది.
సాధారణంగా తీసుకొనే ఆహారం జీర్ణమవడం, శక్తినివ్వడం జరగడానికి కొంత సమయం పడుతుంది. ప్రక్రియను పూర్తిగా శరీరం నిర్వహించలేని స్థితిలో పళ్ళరసాలు తేలికగా అదేశక్తినిస్తాయి. పళ్ళరసాలలో ఉండే 95 శాతం పోషకాలను శరీరం సులువుగా గ్రహించగలుగుతుంది. రక్తాన్ని, శుద్ధిచేయడంతో పండ్ల రసాలు సహకరిస్తాయి. పళ్ళ రసాల వల్ల మూత్ర విసర్జన ఎక్కువగా అవుతుంది. అందువల్ల హానికరమైన పదార్థాలు, సూక్ష్మజీవులు శరీరం నుండి ఎక్కువగా బయటకు పోతాయి. డైటింగ్ చేసేవారు చాలామంది కొద్ది వారాలపాటు జ్యూస్ తీసుకుంటూ తమ అధిక బరువు తగ్గించుకుంటారు. పోషకాహార నిపుణుల మేరకు ప్రధాన పోషకాలు కల పండ్ల రసాలు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యమే.
తాజా పండ్ల రసాల వల్ల కలిగే ఆరోగ్యప్రయోజాలు ఏంటి ?
ఆరోగ్యకరమైన జ్యూస్‌లలో అగ్రస్థానం దానిమ్మ రసానిదే. చక్కెరలో పాటు యాంటీయాక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. మెరుగైన పోషకాలు దానిమ్మపండు రసంలో ఉంటుంది. ద్రాక్ష పళ్ల రసంలో విటమిన్ సితోపాటు శరీర మెటబాలిజంను వేగవంతం చేసే ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. శరీరంలో పేరుకుపోయే విష పదార్థాలను ఇది బయటికి పంపివేస్తుంది. లివర్ పనితనాన్ని మెరుగు పరుస్తుంది. బరువు తగ్గించడంలోనూ గ్రేప్ జ్యూస్ చక్కగా పనిచేస్తుంది. ఉదయాన్నే అల్పాహారం తీసుకునే సమయంలో ఈ రసం తాగితే బరువు తగ్గించేందుకు బాగా పనిచేస్తుంది. ఎవరైనా నిమ్మరసం తరచూ తీసుకుంటే మంచిది. శరీరాన్ని రిఫ్రెష్ చేయటంతో పాటు ఎనర్జీ లెవల్స్‌ను పెంచుతుంది. నారింజలో విటమిన్ - ఏ, బి స్వల్పంగా, విటమిన్ – సి ఎక్కువగా ఉంటాయి. మనిషికి ఆ రోజుకు కావలసిన ‘సి’ విటమిన్ ఈ పండు నుంచి లభిస్తుంది.
మామిడి పళ్ల రసం తీసుకోవడం వల్ల గుండె జబ్బులతో బాధపడే వారికి మంచి ఔషధంగా ఉపయోగ పడుతుంది, బీటా కెరోటిన్ ఉండటం వల్ల వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వదు. బప్పాయి తేలికగా జీర్ణం అవుతుంది. మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు, అతిసారం, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. కమలాపళ్లలో-సి విటమిన్, కాల్షియం ఎక్కువగా లభిస్తాయి. కనుక కీళ్లు నొప్పులతో బాధపడేవారికి, మెనోపాజ్ దగ్గరలో ఉన్న స్త్రీలకు మంచి మందుగా పని చేస్తుంది. కమలాపండు రసం తాగితే హార్ట్ పేషెంట్లు తొందరగా కోలుకుంటారు, ఎముకలు, దంతలు ధృడపడతాయి. 90 శాతం నీరు వుండే కాయ పుచ్చకాయ. దాహార్తిని తీర్చడం తోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి చలువను ఇస్తుంది. అందాన్ని ఇనుమడింపజేస్తుంది. పుచ్చకాయ జూసును తీసుకోవడం వల్ల చర్మం మరింత తేటగా మారుతుంది.
పండ్ల రసాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
శరీరానికి కావాల్సిన ద్రవాలను అందించడం ఎంత ముఖ్యమే.. అవి ఎంత మేర మనకు ఉపయోగపడతాయో అనే విషయాలు తెల్సుకోవడం కూడా అంతకన్నా ముఖ్యం. ఏది దొరికితే అది తాగేయకుండా శరీరానికి లాభం చేకూర్చే ద్రవాలను తీసుకోవాలి. రంగురంగుల్లో ఆకర్శించే ద్రవాలు మన శరీరానికి చేటు చేకూర్చేవి చాలా ఉంటాయి. ప్రిజర్వేటీవ్ కలర్స్, యాడెడ్ ఫ్లేవర్స్ వల్ల మంచి కన్నా కీడే ఎక్కువగా ఉంటుందని మర్చిపోవద్దు. అన్ని రకాల పండ్ల ద్రవాలు నూరు శాతం ఆరోగ్యాన్నిచ్చేవి కావు. అయితే వీటిలో పొటాషియంతో పాటు విటమిన్ సి ఉండటం శ్రేయస్కరం. పండ్లలో ఉండే పోషకాలు అదే మాదిరిగా పండ్ల రసాల్లో ఉండవని గుర్తుంచుకోవాలి. అన్నివిధాలుగా ఇంట్లోని పండ్లరాసాలే శ్రేయస్కరం.
పళ్లరసాలు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుటకు, మూత్రపిండాల పనితీరుకు, శరీరాన్ని చైతన్య పరచుటకు, తక్షణ శక్తికి ఎంతగానో దోహదం చేస్తాయి.మీరు బయట షాపుల నుండి కొనుగోలు చేసే నిల్వ ఉంచిన లేదా, షాపులలో తయారు చేసే పళ్లరసాలలో చక్కెరలు, లేదా కృత్రిమ చక్కెరలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవి శరీరానికి బరువును, రక్తపోటుని పెంచడంలో వీటి పనితీరును చూపిస్తాయి. ఇవి శరీరానికి మంచి చెయ్యకపోగా ఖచ్చితంగా చెడును మాత్రం చేయగలదు. రోజులో 2,3 పండ్లరసాలు ఇలా తీసుకునే వారు మాత్రం అధిక కాలరీలకు గురికాక తప్పదు. కావున మోతాదును మించి తీసుకోవడం కూడా మంచిది కాదు. పండ్లరసాలలో ఫైబర్ పండ్లలో లాగా ఎక్కువగా ఉండవు. అందువలనే నిపుణులు, రోజుకు ఒకే ఒక్క జ్యూస్ తీసుకునేలా ప్రణాళిక చేసుకోమని సలహా ఇస్తుంటారు.