సాధారణంగా మనిషి యాంత్రిక జీవితానికి అలవాటు పడి తన ఆరోగ్యం గురించి పట్టించుకోవడం మానేశాడు. జబ్బు ముదిరితేగాని డాక్టరు గుర్తుకురాడు. మన శరీరం తనలో ఉన్న జబ్బులను బయటపెట్టడానికి నొప్పుల రూపంలో చూపిస్తుంది. ఇలాంటి వాటిలో అల్సర్స్ ఒకటి… ఈరోజుల్లో ఈ సమస్య బారిన పడని వారులేరంటే అతిశయోక్తి కాదేమో…! స్పీడు యుగంలో ఆహారాన్ని కూడా అంతే స్పీడుగా అదేదో మొక్కుబడి వ్యవహారంగా భావిస్తూ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎప్పటికప్పుడే తొందర, ఒత్తిడిలతో సతమతమవుతూ తీసుకునే ఆహారంపట్ల ఏమాత్రం శ్రద్ధ చూపడంలేదు.
మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేయడానికి స్రవించే ఆమ్లం… ఆహారంపై పనిచేయడానికి బదులుగా కడుపు కండరాలపై పని చేస్తే కడుపులో మంట వస్తుంటుంది. కానీ అదే యాసిడ్ క్రమక్రమంగా కడుపులోని కండరాలపై పనిచేస్తూ పోతే… జీర్ణవ్యవస్థ పొడవునా చాలా చోట్ల పుండ్లు పడే అవకాశం ఉంది. జీర్ణవ్యవస్థ అంతటా రక్షణగా ఉండే సున్నితమైన జిగురు పొర… రకరకాల కారణాల వల్ల దెబ్బతిని పుండ్లు పడటాన్నే అల్సర్లు అంటాం. వేళకు తినకపోవడం… హెచ్. పైలోరీ అనే బ్యాక్టీరియా, ఆస్పిరిన్ వంటి రక్తాన్ని పలచబరిచే మందులు, కొన్ని రకాల నొప్పి నివారణ మందులు అల్సర్లు రావడానికి కారణమవుతున్నాయి. జీర్ణాశయంతోపాటు అన్నవాహికలో, చిన్నపేగులో, పెద్దపేగులో కూడా అల్సర్లు వచ్చే అవకాశాలుంటాయి. ఈసోఫేజియల్ అల్సర్స్, గ్యాస్ట్రిక్ అల్సర్, డియోడినల్ అల్సర్లతో పాటు రిఫ్రాక్టీవ్ అల్సర్స్… ఇలా పలురకాలుగా అల్సర్స్ ఉంటాయి.
జీర్ణ కోశంలోని గాఢమైన హైడ్రో క్లోరిక్ ఆమ్లం.. అన్నవాహిక, జీర్ణాశయం, చిన్నపేగులలో పుండ్లు పడటానికి ముఖ్యమైన కారణం. చాలా మందిలో కడుపులో పుండ్లు రావడానికి హెలికో బ్యాక్లర్ పైలోరీ అనే బాక్టీరియా ముఖ్యమైన కారణం. కలుషితమైన ఆహారం, నీరు వంటి వాటి ద్వారా మన శరీరంలో చేరి జీర్ణ వ్యవస్థలో విషపదార్ధాలను విడుదల చేసి పుండ్లు రావడానికి కారణమవుతాయి. కీళ్ళనొప్పుల వంటి దీర్ఘ కాలిక సమస్యలతో బాధపడుతున్న వారు వాడే కొన్ని రకాల మందులు కూడా ఓ కారణం. గుండె జబ్బుల నివారణకు వాడే ఆస్పిరిన్, అమైనో సాలిసైలిక్ ఆమ్లం వంటి మందుల మూలంగా కూడా అల్సర్స్ వచ్చే అవకాశాలున్నాయి. పొగ త్రాగడం వల్ల జీర్ణాశయంలో గాఢ ఆమ్లం నుంచి గోడలకు రక్షణగా ఉండే బైకార్బనేట్ తగ్గిపోయి అల్సర్స్ వస్తాయి. అదేవిధంగా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకొనే వారిలో కూడా అల్సర్స్ కనిపిస్తాయి.
కడుపు నొప్పి వచ్చే సమయాలను బట్టి జీర్ణవ్యవస్థలో పుండు ఎక్కడ ఉందో ఓ అంచనాకు రావచ్చు. ఆహారం తీసుకొంటున్నప్పుడే నొప్పి వస్తుంటే అన్నవాహికలో… ఆహారం తీసుకున్న వెంటనే వస్తుంటే పుండు జీర్ణకోశంలో… మధ్య రాత్రి వస్తే నొప్పి వస్తే డుయోడినమ్‌లో… అల్సర్ ఉందని అనుమానించాలి. పుండు నుంచి రక్తం చాలా ఎక్కువగా పోతుంది. మలం నల్లగా రావడం, రక్తపు వాంతులు కావడం… కొన్నిసార్లు పైకి ఏమీ కనబడకుండానే రక్తం నెమ్మదిగా పోయి తీవ్రమైన రక్తహీనతలోనికి వెళ్లడం జరుగుతుంది. పేగులకు రంధ్రాల కారణంగా పేగులలోని పదార్ధాలు బయటికి వచ్చి ప్రమాదకరమైన పరిస్థితి కలుగుతుంది.
- కడుపులో మంటలా అనిపించే నొప్పి. ఒక్కోసారి ఈ మంట గొంతువైపునకు పాకుతున్నట్లుగా అనిపిస్తుంటుంది.
- ఛాతీ మీద మంటగా ఉన్నట్లుగా అనిపిస్తుంది.
- ఎప్పుడూ ఆకలిగానే ఉన్నట్లుగా అనిపిస్తుంది. కొద్దిగా తినగానే కడుపు నిండిపోయినట్లుగా ఉంటుంది.
- ఒక్కోసారి వికారంగా ఉంటుంది. వాంతులు కూడా కావచ్చు.
- వాంతులు అయినప్పుడు కొన్నిసార్లు రక్తం కూడా పడవచ్చు.
- ఛాతీకి కింద, కడుపు పైభాగంలో నొప్పిగా ఉండి, ఆ నొప్పి పెరిగి ఒక్కోసారి రాత్రివేళల్లో నిద్రాభంగం అవుతుంటుంది.
- అల్సర్ల నుంచి జరిగే రక్తస్రావం మలంలో కలవడం వల్ల మలం నల్లగా కనిపిస్తుంది.
- బరువు తగ్గడం, ఛాతీ మీద బరువు పెట్టినట్లుగా అనిపిస్తుంది.
ఎండోస్కోపీ పరీక్ష నిర్వహించడం ద్వారా అల్సర్లను గుర్తించవచ్చు. అదేవిధంగా బేరియమ్ మీల్ ఎక్స్ రే ద్వారా కూడా అల్సర్లను గుర్తించే వీలుంది. కొన్ని రకాల దీర్ఘకాలిక పుండ్లలో బయాప్పీ చేయడం ద్వారా… కాన్సర్, హెలికో బాక్టర్, అమీబా మొదలైన వాటిని గుర్తించవచ్చు.
- రక్తపరీక్షలూ, మల పరీక్షల ద్వారా ముందుగా హెలికోబ్యాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా ఉందా అనే నిర్ధారణ పరీక్షలు చేయాలి.
- ఎండోస్కోపీ ప్రక్రియతో జీర్ణవ్యవస్థ పైభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి.
- ఒకవేళ ఎక్కడైనా అల్సర్ కనిపిస్తే… ఆ భాగం నుంచి చిన్న ముక్క సేకరించి, దాన్ని బయాప్సీ పరీక్షకు పంపాలి.
- రోగి చేత బేరియం ద్రవాన్ని తాగించి ఎక్స్-రే తీసి పరీక్ష చేయడం ద్వారా కూడా అల్సర్లను నిర్ధారణ చేయవచ్చు.
- బయాప్సీ చేసినప్పుడు హెచ్. పైలోరీ గురించి నిర్ధారణగా తెలుసుకోవచ్చు.
- బయాప్సీ ద్వారా అల్సర్‌లో క్యాన్సర్ ఉంటే తెలుస్తుంది.
ఒకసారి ఒరుసుకుపోయిన చోటే మళ్లీ మళ్లీ ఒరుసుకుపోయి రంధ్రం పడే అవకాశాలుంటాయి. ఇది ప్రాణాపాయాన్ని కలిగించే స్థితి. నిత్యం విటమిన్ సి ఉండే పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా అల్సర్లను దరికి రాకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా శుభ్రమైన తాగునీరు, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. పొగ తాగడం, పొగాకు నమలడం, ఆల్కహాల్ తీసుకోవడం వంటి అలవాట్లను వెంటనే మానేయాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. బాగా ఉడికిన ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి. రోజూ సకాలంలో సమతుల ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం.