Neck Pain – మెడ నొప్పా ? ఈ జాగ్రత్తలు తీసుకోండి

By manavaradhi.com

Updated on:

Follow Us
Neck Hurt

మెడ శరీరంలో అతి ముఖ్యమైన భాగం. ఇక మెడ పట్టేసిందంటే అంతే! ఆ బాధను వర్ణించలేం…. సాధారణంగా అనేకమంది కాలానుగుణంగా, కొన్ని రకాల భంగిమల కారణంగా మెడనొప్పిని ఎదుర్కొంటూ ఉంటారు. కొన్ని సందర్భాలలో గాయాలు, ప్రమాదాల వంటి వాటివలన కూడా సంభవించవచ్చు. నొప్పి తీవ్రత దాని కారకాల మీద ఆధారపడి ఉంటుంది. . అసలు మెడ నొప్పి రావడానికి గల కారణాలు ఏంటి.. దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

మెడ భాగం మన శరీరంలోని అత్యంత సున్నితమైనది. ఇది పుర్రెభాగం నుండి మొండెం మద్య భాగం వరకు విస్తరించిన వెన్నుపూసతో అనుసంధానించబడి ఉంటుంది. మెడలోని కణజాలం, స్నాయువులు మరియు కండరాలు అత్యంత మృదువుగా ఉంటాయి. కావున ఇబ్బందికరమైన లేదా చెడు కోణంలో ఎక్కువసేపు మెడను వంచడం ద్వారా మెడ కండరాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కంప్యూటర్ ముందు పనిచేస్తున్నప్పుడు లేదా చెవికి మరియు భుజం మధ్య ఎక్కువసేపు ఫోన్ ఉంచి మాట్లాడడం మూలంగా లేదా నిద్రపోతున్నప్పుడు చెడు భంగిమల కారణంగా మెడనొప్పి కలిగే అవకాశాలు ఉన్నాయి.

వ్యాయామం చేసే సమయంలో కాని ఏదైనా పనిచేస్తున్నప్పుడు , వాహనాలు నడుపుతున్న సమయంలో ఒక్కోసారి కుదుపులు లేదా అదుర్లకు శరీరం ప్రభావితం అయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. క్రమంగా ఈ ప్రభావం మెడమీద ఎక్కువగా పడుతుంది. ఒక్కోసారి బరువులను ఎత్తడంలో మరియు యోగాభ్యాసం చేసే సమయంలో మెడ మీద అధిక ఒత్తిడి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్రమంగా సున్నితమైన కండరాలు ఉన్న మెడ భాగం తీవ్ర ప్రభావానికి లోనై నొప్పికి కారణం అవుతుంది.

  • అత్యధిక శాతం మెడ కండరాలు పట్టుకోవడం వల్లనే మెడ నొప్పి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. మెడ భాగంలో సుమారు 30-40 కండరాలు ఉంటాయి. ఈ కండరాల కదలికతో మెడలోని ఎముకలు అరిగిపోవడాన్నే స్పాడిలోసిస్‌ అంటారు. వయసు పెరిగే కొద్ది మెడలోని ఎముకలు అరిగిపోతాయి. కొందరిలో ఎక్కువగా, మరికొందరిలో తక్కువగా ఈ అరుగుదల కనిపిస్తుంది. 40 ఏండ్ల వయసులో ఈ సమస్య రావడం సహజం.మెడ నొప్పి రెండు రకాలు ఉంటుంది. ఒకటి సరిగ్గా పడుకోకపోవడం వల్ల, ఎక్కువ బరువు భుజాలపై వేసుకున్న కండరాలు ఒత్తిడికి గురై మెడ నొప్పి వస్తుంది. ఇది సహజంగా తగ్గిపోతుంది. రెండవది తరచూ ఇబ్బంది పెట్టేది. నొప్పి మరీ ఇబ్బందిగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించి మందులు తీసుకుంటే సరిపోతుంది.
  • శరీరంలోని మిగిలిన భాగాలతో పోల్చినపుడు మెడ భాగం అత్యంత సున్నితంగా ఉంటుంది. కావున ప్రమాదాలకు, గాయాలకు అధిక అవకాశాలు ఉంటాయి. ఈ గాయాలు చిన్నవి లేదా పెద్దవి కావచ్చు. కొన్ని సందర్భాలలో గాయాలు తగ్గుముఖం పట్టినా, మెడ కండరాల నొప్పులు మాత్రం దీర్ఘకాలికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు వైద్యుని సంప్రదించడం మంచిది.

మెడ నొప్పికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

దీర్ఘకాలిక మెడ నొప్పులు ఉన్నట్లయితే, అవి వేరే ఇతర వ్యాధులకు ప్రధాన లక్షణాలుగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకే పొజిషన్‌లో మెడ తిప్పకుండా కొన్ని గంటల పాటు అలాగే ఉంచడం వల్ల మెడ నొప్పి వస్తుంది. కాబట్టి మెడను ప్రతి 15 నిమిషాలకు అటు ఇటూ తిప్పుతూ ఉండాలి. కంప్యూటర్‌తో పని చేసే వారు మోచేతులకు సపోర్టుగా కీబోర్డును ఉపయోగించాలి. కంప్యూటర్‌ ఎత్తు, కంటికి సమానంగా ఉండాలి. 40 నిమిషాలకు ఓ సారి విశ్రాంతి తీసుకోవడం మంచిది. అలాగే బరువులు ఎక్కువగా మోయకూడదు. వీటి వల్ల మెడ నొప్పి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని చిన్న పాటి వ్యాయామాలు చేయడం వల్ల మెడనొప్పిని ఎఫెక్టివ్ గా తగ్గించుకోవచ్చు.

వ్యాయామం చేయడానికి ముందు కొద్దిగా వేడిగా కాపడం పెట్టుకోవాలి. మొదట సర్క్యులర్ మోషన్ లో మెడను తిప్పాలి, క్లాక్ వైజ్ మరియు యాంటీక్లాక్ వైజ్ లా మెడను తిప్పాలి. తర్వాత పైకి క్రిందికి స్ట్రెచ్ చేయడం వల్ల మజిల్స్ స్ట్రెచ్ అవుతాయి. నొప్పి మరీ తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించాలి. ప్రమాదం లేదా ఇన్ఫ్లమేషన్ కారణంగా మెడనొప్పి సంభవిస్తే, ఒక్కోసారి తీవ్రంగా మారి తక్షణ వైద్య సంరక్షణ అవసరం కలగవచ్చు. సాధారణ నొప్పిగా ఉన్నా కూడా దీర్ఘకాలికంగా ఉన్న వేరే ఇతర సమస్యలకు లక్షణంగా కూడా ఉండవచ్చు. కావున, మెడనొప్పి విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలి.

Leave a Comment