కిడ్నీలలో రాళ్లు. ఇది తాజాగా చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. మూత్రపిండాలలో రాళ్లు చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మందిలో ఏర్పడుతున్నాయి. దీనికి చికిత్స ఉంటుంది. కానీ, చికిత్స కంటే నివారణ ఎప్పుడూ మంచిది. అసలు రాకుండా చూసుకోవడం చాలా ఉత్తమం. మన నిత్యజీవితంలో చిన్న మార్పులతో కిడ్నీలో రాళ్లు పడకుండా చూసుకోవచ్చు.
మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలు మూత్రపిండాలు. ఇవి ఆహారం జీర్ణమయ్యే క్రమంలో ఏర్పడే మలినాలను ఎప్పటికప్పుడు తొలగించి రక్తాన్ని, శరీరాన్ని శుద్ధిగా ఉంచుతాయి. ఇవి ఒక్కసారి పనిచేయకుండా ఉంటే ఆరోగ్యం అస్తవ్యస్తం అవుతుంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న కిడ్నీలను కాపాడుకోవాలంటే ముందు జీవనశైలి ఆరోగ్యంగా ఉండాలి. అందుకోసం మంచి పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి. అప్పుడు కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం, కిడ్నీ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
రోజూ తగినన్ని నీళ్లు తాగకపోవడం, సమతుల ఆహారం తీసుకోకపోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. నడుం భాగం నుంచి పొత్తి కడుపులోకి విపరీతంగా నొప్పి వస్తే అది కిడ్నీలో రాళ్ల వల్లనే అని వైద్యులు చెబుతుంటారు. తాత్కాలిక నివారణకు నొప్పి నివారణ మందులు తీసుకున్నా కిడ్నీలో రాళ్లు బయటకు పోయేంత వరకు నొప్పి మాత్రం మనల్ని వదలదు.
కిడ్నీలో రాళ్ళు ఏర్పడినపుడు మూత్రంలో మంట, మూత్రం బొట్లు బొట్లుగా రావడం, తీవ్రమైన నొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువగా విటమిన్ డీ, అతిసారం, గౌట్, అసమాన ఆహారం తీసుకొవటం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు.
కిడ్నీల్లో రాళ్లు కారణాలు ఏంటి…?
మనం ప్రతి రోజు తీసుకునే ఆహారంలో ఉండే లవణాలు మరియు ఖనిజాల యొక్క “కాల్షియం ఆక్సలేట్” అనే పదార్థం ఘన రూపంలోకి మారి రాళ్లుగా తయారవుతాయి. కొన్ని రకాల మందుల వాడకం, దీర్ఘకాలం డీ హైడ్రేషన్ బారిన పడటం తదితర కారణాల వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవడం, హైడ్రేటెడ్‌గా ఉండటం వల్ల ఈ సమస్యను నివారించవచ్చు.
కొన్ని సహజ పద్ధతుల ద్వారా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు. నిమ్మరసారికి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా కాపాడే లక్షణాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. కిడ్నీల్లో రాళ్లను నిరోధించేందుకు ఉన్న సహజ మార్గం, నీరు ఎక్కువగా తాగడం. ఒకవేళ కిడ్నీల్లో చిన్నపాటి రాళ్లు ఉన్నా, అవి మూత్రంతో పాటు బయటకు వెళ్లిపోవడానికి తగినంత నీరు తాగాలి. కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. తాజా పండ్లను, కూరగాయలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.
కిడ్నీల్లో రాళ్లు పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి…?
రోజుకు 2 – 3 లీటర్ల నీళ్లు తప్పనిసరిగా తాగాలి. అదే పనిగా నీళ్లు తాగేందుకు ఇబ్బందిపడేవారు మజ్జిగ, చక్కెర కలపని పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, చెరకు రసం వంటివి తాగొచ్చు. ఆహారంలో ఉప్పు మితంగా తీసుకోవాలి. నిల్వ పచ్చళ్ళు తీసుకోవడం మానుకోవాలి. ముఖ్యంగా ప్రాసెస్ డ్ పుడ్స్, ఫాస్ట్ పుడ్స్ కు సాధ్యామైనంత దూరంగా ఉంటే మంచిది. విటమిన్ సి, క్యాల్షియమ్ సప్లిమెంట్ల వంటి మాత్రలను కేవలం వైద్యుల సలహా మేరకే తీసుకోవాలి.
శీతల పానీయాలను పూర్తిగా మానేయడం ఉత్తమం. ఇవేకాకుండా పుచ్చకాయ, ద్రాక్ష, పీచు ఎక్కువగా ఉండే ఆహారాలు, సేంద్రీయ కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా చూసుకోవచ్చు. రెడ్ మీట్ వంటి వాటికి దూరంగా ఉండాలి. పాలు, వెన్న లాంటి డైరీ ఆహార పదార్ధాలలో కాల్షియం అధిక శాతం ఉన్నందున వీలైనంత తక్కువ మోతాదులలో తీసుకోవాలి.
సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల కిడ్ని స్టోన్స్ ఏర్పడుతాయి. కాబట్టి తీసుకొనే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. అలాగే కిడ్ని స్టోన్స్ లక్షణాలు, నివారణ గురించి తెలుసుకుంటే కిడ్నీ స్టోన్స్ ఏర్పకుండా జాగ్రత్తపడవచ్చు. శరీరంలో కాల్షియం, మినల్స్ ఎక్కువ కాకుండా జాగ్రత్తపడటమే అన్నింటికీ మంచిది.