Health Tips – చేతుల శుభ్రత మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?

By manavaradhi.com

Published on:

Follow Us
wash your Hands

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మనిషి ఆరోగ్యం శుభ్రత మీదే ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు శుభ్రత మీద ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల డయేరియా, కలరా, శ్వాసకోశ సంబంధ వ్యాధులు ప్రబలి అనేక ఇబ్బందులు పడేవారు. కానీ నేడు ప్రజలకు శుభ్రత విషయంలో కొంతమేరకు అవగాహన ఉన్నా కూడా నిర్లక్ష్యం చేస్తుండడం వల్ల ఈ వ్యాధులు దాడిచేస్తున్నాయి. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం శుభ్రంగా ఉండాలి. శుభ్రతలో కీలకమైనది మన చేతుల శుభ్రత. మన చేతులు శుభ్రంగా ఉంటే రోగాలు కూడా మన దరిచేరవు.

మనం కేవలం తినేందుకు మాత్రమే చేతులు ఉపయోగిస్తామనుకుంటే పొరబడ్డట్లే. ఈ చేతుల్లోనే ఎన్నో మిలియన్ల బాక్టీరియాలు స్టోరైపోతూ ఉంటాయి. చేతుల ద్వారానే అనేక రకాల వ్యాధి కారక సూక్ష్మక్రిములు మన శరీరంలోనికి ప్రవేశిస్తాయి. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ద్వారా వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. ఉదయం నుంచి మన అన్ని రకాల దినచర్యలను చేతుల ద్వారానే చేస్తుంటాము. రకరకాల పనులు చేసేప్పుడు ఆ పనికి సంబంధించిన కొన్ని మలినాలు చేతికి అంటుకుంటాయి. చేతులను శుభ్రం చేసుకొనకపోవడం వల్ల చేతికి అంటిన క్రిములన్నీ మన శరీరంలోనికి ప్రవేశిస్తాయి. అందుకే భోజనం తినే ముందు.. చేతులను శుభ్రం చేసుకోవడం వలన క్రిములు శరీరం లోనికి ప్రవేశించకుండా ఉంటాయి.

చేతులను శుభ్రం చేసుకోకపోవడం వలన జీర్ణవ్యవస్థ సమస్యలు, జ్వరం, జలుబు, శ్వాసకోశ సమస్యలు వంటివి మనల్ని చుట్టుముడతాయి. కాబట్టి ఏపనీ చేయకుండా ఖాళీగాఉన్నా, తరచు చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలా చేయడంవల్ల దాదాపు 80 శాతం రోగాలు మన శరీరానికి దూరంగా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది.

ఒక రకంగా చేతులు కడుక్కోవటమూ టీకానే. టీకాలాగే ఇది కూడా జబ్బులు రాకుండా చూస్తుంది. ఎవరైనా తుమ్మినపుడు, దగ్గినపుడు వెలువడే తుంపర్లు చుట్టుపక్కల వస్తువులపై పడటం సహజం. దానిలోని తేమ కొద్దిసేపట్లో ఆరిపోవచ్చుగానీ వాటిలోని సూక్ష్మక్రిములు మాత్రం చాలాసేపు అక్కడే ఉండిపోతాయి. మనం తెలియక.. అక్కడ ముట్టుకుని.. వెంటనే కళ్లు, ముక్కు వంటివి రుద్దుకున్నామనుకోండి.. అవి మన శరీరంలోకీ ప్రవేశించి.. మనకూ జబ్బులు తెచ్చిపెడతాయి. కాబట్టి మనం తరచూ చేతులను శుభ్రం చేసుకుంటే ఇలాంటి సూక్ష్మక్రిముల బారి నుంచి కాపాడుకోవచ్చు. క్రిములు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండానూ చూసుకోవచ్చు.

మల విసర్జనకు వెళ్లొచ్చిన తర్వాత కూడా శుభ్రంగా సబ్బుతో చేతులు కడుక్కోవటం అవసరం. పద్ధతి ప్రకారం చేతులను శుభ్రం చేసుకోవటం ద్వారానే ఎన్నో రకాలు వ్యాధుల భారి పడకుండా ఉండవచ్చు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోందంటే దీని ప్రాధాన్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. గోళ్లు పెద్దవిగా ఉంటే గోటి కింద మట్టిరూపంలో నిల్వ ఉంటాయి. గోళ్లను పొట్టిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. పిల్లలు మట్టిలో ఆడుతుంటారు. కనుక తరచుగా చేతులు కడుక్కోవటం అలవాటు చేయాలి .తినడానికి ఏదైనా, ఇచ్చేముందు సబ్బుతో చేతులు శుభ్రంగా ఉన్నాయో లేదో చూడాలి.

చేతులు అపరిశుభ్రత కారణంగా అతిసారం, శ్వాసకోశ సంబంధ వ్యాధులు సంభవిస్తున్నాయి. అలాగే స్వైన్ ఫ్లూ మహమ్మారికి వ్యాప్తికి కూడా చేతుల అపరిశుభ్రతే కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొందరు ఆకలివేస్తోందనే ఆత్రుతలో చేతులు కడుక్కోకుండా హడావిడిగానే ఆవురావురుమని ఆహారం తినేస్తారు. ఇలా చేస్తే ఆరోగ్యానికి చేజేతులా ముప్పు తెచ్చుకున్నట్లే అంటున్నారు పరిశోధకులు. అసలు చేతులు శుభ్రం చేసుకోకుండా తినడంవల్లే జలుబుతో సహా పలు ప్రమాదకర వ్యాధులు వస్తాయట.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం అరచేతుల్లో ఎక్కువ తేమ ఉండడంతోపాటు కొన్ని లక్షల సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ చేతులతోనే తినేయడంవల్ల అనేకరకాల రోగాల్ని చేతులారా ఆహ్వానించినట్టే. చేతుల శుభ్రత ప్రాధాన్యం అందరికీ తెలియకపోవచ్చు. కానీ తెలిసినవారిలోనూ చాలామంది పాటించటం లేదు. కేవలం ముగ్గురిలో ఒకరు మాత్రమే తుమ్మిన, దగ్గిన ప్రతిసారీ చేతులను కడుక్కుంటున్నారు. ప్రతి ఐదుగురిలో ముగ్గురు అసలు సబ్బును వాడటం లేదు కూడా. కేవలం నీటితోనే కడుక్కుంటే చాలని భావిస్తున్నారు. సబ్బుతో కడుక్కుంటే సూక్ష్మక్రిములను సమర్థంగా తొలగించుకోవచ్చని గుర్తుంచుకోవాలి. చేతుల శుభ్రతతో విరేచనాల ముప్పు తగ్గుతుంది. న్యుమోనియా, జలుబు వంటి శ్వాసకోశ జబ్బులను తగ్గించుకోవచ్చు. కొన్ని పనులకు ముందూ, ఆ తర్వాతా చేతులు కడుక్కోవటం చాలా అవసరం. దీంతో సూక్ష్మక్రిముల బెడదను వదిలించుకోవచ్చు. ఫలితంగా జబ్బుల ముప్పును నివారించుకోవచ్చు.

ప్రజలందరికీ చేతి శుభ్రత పై అవగాహన ఏర్పడితే అంటురోగాలను మనం అరికట్టవచ్చు. శుభ్రమైన చేతులే అంటువ్యాధులను ఆటకట్టిస్తాయనే నిజాన్ని ప్రతిఒక్కరూ గుర్తించి అమలుపరిస్తే మనం ఆరోగ్యంగా జీవించగలుగుతాము.

Leave a Comment