ప్రపంచవ్యాప్తంగా స్ట్రోక్ వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా 65 ఏళ్ళు పైబడినవారిలో ముగ్గురిలో ఇద్దరు స్ట్రోక్ బారినపడుతున్నారు. క్యాన్సర్, గుండెపోటు తర్వాత ఎక్కువ మరణాలు స్ట్రోక్వల్లే జరుగుతున్నాయని ఒక అంచనా. పెద్దవాళ్ళలో ఇస్కీమిక్ స్ట్రోక్ ఎక్కువగా వస్తున్నాయి. అవయవాలు బాగా దెబ్బతిని ఇబ్బంది పెట్టే జబ్బు స్ట్రోక్. కరొనరి రక్తనాళాల్లో అడ్డంకులవల్ల ఏర్పడే వాటిని ఇస్కీమిక్ స్ట్రోక్స్ అని పిలుస్తారు. ఇవి 85 శాతం వరకు సంభవిస్తున్నాయి. హెమరేజిక్ స్ట్రోక్ వల్ల 15 శాతం వస్తున్నాయి.
మన శరీరంలో మెదడు అత్యంత కీలకమైన అవయవం. మిగిలిన అవయవాలకు జరిగినట్లే మెదడుకూ నిరంతరం రక్తప్రసరణ జరుగుతూ ఉంటుంది. అయితే ఒక్కోసారి మెదడుకు రక్తాన్ని, పోషక పదార్థాలను సరఫరా చేసే రక్తనాళాలు హఠాత్తుగా మూసుకుపోతాయి. దీన్నే స్ట్రోక్ అంటారు. దీనివల్ల మెదడులోని ఆ భాగంలోని కణాలకు ప్రాణవాయువు అందక పోవటంతో అవి దెబ్బతినటం లేదా చనిపోవటం జరుగుతుంది.
రెండు కారణాల వల్ల ఆటంకం కలుగుతుంది. మెదడుకు రక్తం సరఫరా చేసే ధమనిలో క్లాట్ ఉంటే ఆ బ్లాక్స్ రక్త ప్రసారాన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటారు. రెండవ కారణం మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ధమని దెబ్బతింటే దానివల్ల అధిక రక్తపోటు వస్తుంది. దీనిని హెమరెజిక్ స్ట్రోక్ అంటారు. ఇది కూడా మెదడు ప్రాంతంలో రక్త ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. మెదడుకు రక్త ప్రసరణ ఆటంకం కలిగినా, ఆగి పోయినా, మెదడు కణాలు చనిపోవడం ప్రారంభమై, దానివల్ల మెదడు దెబ్బతింటుంది. ఇలాంటి సందర్భాలలో మెదడులోని ఏ ప్రాంతాన్ని నియంత్రిస్తుందో శరీరంలోని ఆ భాగం వైకల్యానికి గురౌతుంది. దీనివల్ల మాట పడిపోవడం, జ్ఞాపకశక్తి, కదలిక కోల్పోవడం జరుగుతుంది. ఈ స్ట్రోక్ మెదడులో ఏ భాగానికి ప్రభావితమైంది, మెదడు ఎంత దెబ్బతిన్నది అనేదానిపై ఆధారపడి రోగిపై ప్రభావం చూపుతుంది.
మెదడుకు రక్తప్రసరణ నిలకడగా ఉంటే దాని పనితీరు బాగుంటుంది. లేకపోతే అది మనమీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. స్ట్రోక్ చిన్నదే అయితే, దానివల్ల మోచేయి లేదా కాలు కొద్దిగా నీరసిస్తాయి. కానీ అదే పెద్ద స్ట్రోక్ అయితే రోగికి ఒక వైపు భాగమంతా పనిచేయక పోవడం, మాట్లాడే సామర్ధ్యాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. అదృష్టవశాత్తూ, కొంతమందికి, స్ట్రోక్ తరువాత కొన్ని కణాలు కోలుకుని కొన్ని గంటలు లేదా నిమిషాల్లో తిరిగి రక్త ప్రసరణ జరుగుతుంది. దీనిని కూడా మినీ స్ట్రోక్ అంటారు. ఇది తాత్కాలికమైన బ్లాకేజ్ ..దీనివల్ల పూర్తిగా మెదడు దేబ్బతినదు, కానీ స్ట్రోక్ హెచ్చరికా చిహ్నాలు కొన్ని నిముషాలు లేదా గంటలలోనే తెలుసుకోవచ్చు, ఈ హెచ్చరిక చిహ్నాల పట్ల చాలా శ్రద్ధ తీసుకోవాలి, వాటిని వదిలేయకూడదు.
స్ట్రోక్ చిహ్నాలను ముందుగానే తెలుసుకోవాలి, అలాంటి చిహ్నాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం అవసరం. కొంతమంది స్ట్రోక్ నుండి పూర్తిగా కోలుకుంటారు, కానీ 2 లేదా 3 సార్లు స్ట్రోక్ వచ్చినవారు కొన్ని రకాల దీర్ఘకాలిక వైకల్యాల బారిన పడతారు. స్ట్రోక్ వచ్చినపుడు ఎపుడూ అత్యవసర వైద్యం అవసరం, అంతేకాక స్ట్రోక్ లక్షణాలను గుర్తించి, సాధ్యమైనంత వరకు త్వరగా సహాయం తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యం.
మెదడులోని ఓ ప్రాంతానికి రక్తాన్ని చేర్చే నాళాలు మూసుకుపోవడంతో స్ట్రోక్ వస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా స్ట్రోక్ కి దూరం కావచ్చంటున్నారు వైద్య నిపుణులు. తీసుకునే ఆహారం శరీరానికి ఆరోగ్యాన్ని కలిగించేదిగా ఉండాలి. ఎక్కువ పండ్లు, కూరగాయలు, ఉప్పు తక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి. కొవ్వును కలిగించే వాటికి దూరంగా ఉండాలి. బరువు పెరగకుండా జాగ్రత్త పడాలి. బీఎంఐ అదుపు తప్పుతుందంటే, స్ట్రోక్ కు దగ్గరవుతున్నట్టే. కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రజర్ స్థాయి ఎప్పుడూ నియంత్రణలో ఉండాలి. బీపీ 120/80 ఉండేలా చూసుకోవాలి.
మద్యపానం, ధూమపానంకు దూరంగా ఉండాలి. ఈ రెండూ స్ట్రోక్ ను శరవేగంగా దగ్గర చేస్తాయి. శరీరానికి చాలినంత విశ్రాంతిని ఇవ్వాలి. ఇందుకోసం అలసట తీరేంతగా నిద్ర పోతే సరిపోతుంది.ఇలా అలవాట్లను మార్చుకోవడం, దురలవాట్లకు దూరం కావడంతో పాటు మానసికంగా ఆహ్లాదంగా ఉంటే ఈ ప్రాణాంతక స్ట్రోక్ దరిచేరదు.
స్ట్రోక్ రావడానికి ముఖ్యమైన కారణం ధూమపానం మరియు మద్యపానమే అని వైద్యులు చెబుతున్నారు. దీంతో పాటు జీవనశైలిలో మార్పుల వల్ల కూడా ఈ స్త్రోక్స్ వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. అందువల్ల ఆరోగ్యకరమైన ఆహారం, రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేసినట్లైతే స్ట్రోక్స్ లాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తపడవచ్చు.