మనిషికి మంచికాలం, చెడ్డకాలం.. రెండూ ఉంటాయి. అలాగే మనిషిపై దాడి చేసి… ఆరోగ్యాన్ని నాశనం చేసే వైరస్లు, బ్యాక్టీరియాలకూ ఓ మంచికాలం ఉంటుంది. అదే శీతాకాలం. ఎప్పుడో తగ్గిపోయిందనుకున్న రోగం కూడా చలికాలంలో విజృంభించగలదు. ఇక అలర్జీలు, శ్వాసకోశ సంబంధ వ్యాధులున్న వారి సంగతి చెప్పక్కర్లేదు. వాతావరణంలో వేడి తగ్గేకొద్దీ… అనారోగ్యం పెరుగుతూ ఉంటుంది. పిల్లలు, వృద్ధులు పడే ఇబ్బందులు తక్కువేం కాదు. మరి ఈ కాలంలో ఆరోగ్యం పాడవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి?
మనం చిన్నప్పటి నుంచి పెరిగిన పరిస్థితులు, వాతావరణం, కాలుష్యం ప్రభావంతో ప్రతి సీజన్లోనూ మనిషికి ఆరోగ్య సమస్యలు పొంచి ఉంటూనే ఉంటాయి. శీతాకాలంలో సీజనల్ వ్యాధులు దాడి మరింత తీవ్రంగా ఉంటుంది. జలుబు, దగ్గు లాంటి సామాన్య ఇబ్బందులు నుంచి ఆస్తమా, సొరియాసిస్ లాంటి తీవ్ర సమస్యలు వరకు అనేక జబ్బులు దాడి చేసేది ఈ కాలంలోనే. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అతి శీతల గాలులు వీచినప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే శరీరం ఇబ్బంది పడుతుంది. చలికాలంలో సర్వసాధారణంగా కనిపించే సమస్య జలుబు. ముక్కు పట్టేయడం, నిరంతరం ముక్కు నుంచి నీరు కారడం, కళ్ళు ఎర్రగా మారడం, కళ్ళ మంటలు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. క్రమంగా ఇవి జ్వరంగా మారడానికి ఎంతో సమయం పట్టదు. ఇక చిన్నపిల్లలు, వృద్ధుల్లో ఈ సమస్య తరుచూ ఉంటుంది. ఏడాది లోపు చిన్నారుల్లో బ్రాంకైటిస్ లాంటి సమస్యలు రావచ్చు, ఇక ఆస్తమా, న్యూమోనియా, ఉబ్బసం లాంటి శ్వాసకోశ సమస్యలున్నవారి పరిస్థితి ఇంకాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఉబ్బసం ఉన్న పిల్లలు అర్ధరాత్రి వేళల్లో విపరీతంగా ఇబ్బంది పడుతుంటారు. ఊపిరి ఆడకపోవడంతో పిల్లి కూతల్లా శబ్ధాలు చేస్తుంటారు. నాణ్యమైన నిద్ర కూడా పట్టదు.
సాధారణ జలుబుగా ప్రారంభమయ్యి.. వైరస్ల ప్రభావంతో విజృంభించే న్యూమోనియా కూడా ప్రమాదకరమైనదే. స్కూల్కు వెళ్ళే వయసు చిన్నారుల్లో గొంతునొప్పి లాంటి సమస్యలు శీతాకాలంలో తరచూ వస్తుంటాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉష్ణోగ్రతలు బాగా తక్కువగా ఉన్నప్పుడు బయట తిరగకపోవడమే మంచిది. ఉదయం ఎండ వచ్చిన తరువాత బయట పనులు చక్కబెట్టుకోవడం, సాయంత్రం చలిగాలి ప్రారంభం అయ్యేలోపు ఇంటికి చేరుకోవడం ఉత్తమం. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో బయట తిరగాల్సి వస్తే.., మందంగా ఉండే ఊలు దుస్తులు ధరించాలి. రెండేళ్ళ వయసులోపు చిన్నారులను చలిగాలికి తిప్పడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు.
శీతాకాలంలో వైరస్ల విజృంభణ ఎక్కువగా ఉంటుంది. స్వైన్ ఫ్లూ లాంటివి ఈ కాలంలో త్వరగా వ్యాపిస్తాయి. కాలుష్యం వలన వచ్చే రోగాలు కూడా ఈ కాలంలోనే ఎక్కువ. వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వలన దుమ్ము రేణువులు, వాహనాల నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ లాంటివి గాలిలో కలిసిపోతాయి. ఆ గాలిని పీల్చడం వలన మనిషి రోగాల బారిన పడతారు. కాలుష్యంతో పాటు ఎలర్జీల ప్రభావం కూడా చలికాలంలోనే ఎక్కువ. ఒక్కొక్కరి శరీరానికి ఒక్కో రకమైన ఎలర్జీలు ఉండవచ్చు. అలాంటివి శీతాకాలంలో విజృంభించే అవకాశాలు ఎక్కువ. ఇక శీతాకాలంలో చర్మ సమస్యలు బారిన పడకుండా ఎవరూ ఉండరు. పెదవులు, కాళ్లు మడమలు పగిలిపోవడం అనేది చాలా మందిలో కనిపించేదే. సాధారణ కాలాల్లో పొడిచర్మంతో బాధపడేవారికి శీతాకాలంలో మరిన్ని ఇబ్బందులు ఉంటాయి. సొరియాసిస్ లాంటి చర్మ సంబంధ రోగాలు విజృంభించేది ఈ కాలంలోనే. ఇక వ్యాయామం చేసే అలవాటు, శారీరక శ్రమ లేని వారిలో కీళ్లనొప్పులు, కండరాల సమస్యలు కనిపిస్తాయి. ఒళ్ళంతా పట్టేసినట్టు ఉండి శరీరాన్ని కాస్త కదిలించినా నొప్పులు ఉంటాయి.
చలి ఎక్కువ ఉందనే సాకుతో.. వ్యాయామం, జిమ్ లాంటి వాటికి డుమ్మా కొడుతుంటారు. కానీ చలికాలంలో వ్యాయామం తప్పకుండా చేయాలి. శరీరంలో కదలికలు బాగా ఉన్నప్పుడే రక్తప్రసరణ వ్యవస్థ చక్కగా పనిచేసి.. శరీరం వెచ్చగా ఉంటుంది. తద్వారా మెదడు చురుకుగా పనిచేస్తుంది. శీతాకాలంలో తీసుకునే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. తగినంత వేడి పదార్ధాలను తినడం మంచిది. ఫ్రిజ్లో నిల్వ ఉంచిన పదార్ధాలు తరువాత రోజు తినడం ఆరోగ్యకరం కాదు. అలాగే ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్ లాంటి వాటిని దూరం పెట్టాలి. ఉబ్బసం, న్యూమోనియా వ్యాధిగ్రస్తులు వీటి జోలికి వెళ్ళకపోవడం మంచిది.
తాజా కూరగాయలు, పండ్లు, చేపలు తినాలి. కొంతమంది సి విటమిన్ పుష్కలంగా ఉండే నారింజ, నిమ్మ లాంటివి ఈ సీజన్లో తింటే జలుబు చేస్తుందని భావిస్తారు. కానీ అది తప్పు. సి విటమిన్ ఎక్కువగా ఉండే పండ్లు తినడం వలన రోగనిరోధక శక్తి పెరిగి… సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు. శీతాకాలంలో తరచూ మూత్రానికి వెళ్ళాల్సి వస్తుందని నీళ్ళు తాగడం తగ్గిస్తారు. ఇది కూడా సరైనది కాదు. శరీరానికి సరిపడా నీళ్లు తాగుతుండాలి. ఈ సీజన్లో ఫ్లూ జ్వరాలు ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు మరీ వేడి నీళ్లు కాకుండా గోరువెచ్చని నీటితో స్నానమే మంచిది. స్నానానికి ముందు నూనెతో మర్దన చేయడం వలన కండరాలు పట్టేయకుండా ఉంటాయి. అలాగే మాయిశ్చరైజ్ సబ్బులను, క్రీములను వాడాలి. అయితే అధిక గాఢత ఉన్న క్రీముల జోలికి వెళ్లకపోవడమే మంచిది.
పరిసరాల శుభ్రత చలికాలంలో ముఖ్యం. గాలిలో తేమశాతం ఎక్కువ ఉండటం వలన బ్యాక్టీరియాలు, వైరస్లు వస్తువులపై అతుక్కుని ఉండిపోతాయి. మనం ఆ వస్తువుల్ని ముట్టుకున్నప్పుడు బ్యాక్టీరియాలు చేతులకు అంటుకుని కళ్లు, నోరు, ముక్కు ద్వారా శరీరంలోకి చేరి రోగాలను కలుగజేస్తాయి. కాబట్టి తరచూ చేతులు కడుక్కోవాలి. శరీరంలో మూల మూలలను శుభ్రంగా ఉంచుకోవాలి. దుప్పట్లు, దిండ్లు ఈ కాలంలో ఎక్కువగా ఉపయోగిస్తాం. కాబట్టి సాధారణ రోజుల్లో కంటే ఎక్కువ సార్లు ఉతుకుతూ ఉండాలి. ఎక్కువ సార్లు ఉపయోగించే వస్తువుల్ని శుభ్రం చేస్తూ ఉండాలి. టీవీ, ఏసీ, ఇతర రిమోట్లు, స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్, డెస్క్టాప్, కీబోర్డ్, మౌస్ లాంటి వాటిని తరచూ శుభ్రం చేయాలి.
శీతాకాలంలో చలికి బద్ధకించడమో, పెద్దగా దుమ్ము పట్టలేదనే సాకుతోనో శుభ్రత విషయంలో అలక్ష్యం చేయవచ్చు. కానీ కంటికి కనబడని క్రిములు, వైరస్లు విజృంభించేది ఈ కాలంలోనే. కాబట్టి పరిసరాల శుభ్రత చలికాలంలో చాలా ముఖ్యం. అదేవిధంగా వాటర్ ట్యాప్లను తరచూ శుభ్రం చేస్తూ ఉండాలి. టాయిలెట్ ఫ్లష్, హ్యాండ్ రెయిలింగ్స్, కప్ బోర్డ్స్, తలుపు గడియలు లాంటి ప్రదేశాలు శుభ్రం చేసుకోవాలి. దీంతో బ్యాక్టీరియా, వైరస్లు ఒకరి నుంచి మరొకరికి సోకకుండా కాపాడుకోవచ్చు.