అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్నారు పెద్దలు. అలాగే రోగాలు తెచ్చుకోవడం ఎందుకు? ఆనక అవి తగ్గించుకోవడానికి మందులు వాడటం దేనికి?అనే ప్రశ్నలు రావచ్చు. కానీ రోగం రాబోతుందని ముందే తెలియదు కదా అనేది కొందరి సమాధానం. అదీ నిజమే. కొన్ని రోగాలు రాబోతున్నట్టు తెలియకపోవచ్చు. కానీ స్వయం పరిశీలన ఉంటే వ్యాధులను ముందే పసిగట్టవచ్చు. కొన్ని పరీక్షలు చేయించుకుంటే ఏ రోగభయం ఉందో రిపోర్ట్లే చెబుతాయి. ప్రపంచవ్యాప్తంగా అనేకమందిని కలవరపెడుతున్న గుండె జబ్బులను కూడా ఇలా ముందుగానే రిపోర్ట్ల ద్వారా పసిగట్టే అవకాశం ఉంది. శరీరంలో కొవ్వు నిల్వలు ఎలా ఉన్నాయి. ఆ కొవ్వులో మంచివి ఏ స్థాయిలో ఉన్నాయి, చెడ్డవాటి పరిస్థితి ఏంటి? అనేవాటిని గ్రహించవచ్చు.
ఆధునిక ప్రపంచంలో అనేక మంది ప్రాణాలు బలి తీసుకుంటున్నవి గుండెపోటు, మధుమేహం, రక్తపోటు లాంటి లైఫ్స్టయిల్ డిసీజసే. జీవనవిధానంలో వచ్చిన తేడాల వలన శరీరం మార్పులకు లోనవుతుంది. క్రమంగా అ మార్పు మనిషి ప్రాణాలకు ముప్పు తెస్తుంది. అయితే రక్తపోటు, మధుమేహం, గుండెపోటు.. ఈ మూడింటికి పరోక్ష కారణం శరీరంలో క్రొవ్వు పేరుకుపోవడమే. నడుము చుట్టూ, పిరుదుల భాగంలో క్రొవ్వు పేరుకుపోవడం సాధారణమే. ఆ తరువాత రక్తనాళాల్లో క్రొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. రక్తంలో కలిసిన క్రొవ్వు…. రక్తనాళాల గోడలకు అంటుకుపోతుంది. దీంతో రక్తప్రవాహ వేగంలో మార్పులు వచ్చి గుండెపోటుకు కారణం అవుతుంది. కాబట్టి శరీరంలో క్రొవ్వు నిల్వలు ఏ స్థాయిలో ఉన్నాయి. అందులో శరీరానికి పనికివచ్చే క్రొవ్వు ఎంత?, హానిచేసే కొవ్వు ఎంత అనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.
వయసు నలభైలలోకి వచ్చిన తరువాత ఈ పరీక్షలు చేయించుకోక తప్పదు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పాతికేళ్లకే గుండెపోటు మరణాలు వింటున్నాం. కాబట్టి యుక్తవయస్సు దాటినవారంతా నాలుగు నుంచి ఐదేళ్లకోసారి తమ ఒంట్లో కొవ్వు శాతాన్ని పరీక్షించుకోవడం ఉత్తమం. క్రొవ్వు పరీక్షలు ప్రత్యేకంగా ఏమీ ఉండవు. రక్తం సేకరించడం ద్వారానే ఒంట్లో క్రొవ్వు కణాలను, అందులో మంచి, చెడుల శాతాన్ని నివేదిక రూపంలో అందిస్తారు. దీన్నే లిపిడ్ ప్యానల్ టెస్ట్ అంటారు. సాధారణంగా అల్పాహారం తీసుకోవడాని కంటే ముందే రక్తం సేకరిస్తారు. కొన్ని ల్యాబ్లు ఫాస్టింగ్ అవసరం లేకుండా కూడా బ్లడ్ సేకరించడం ద్వారా లిపిడ్ ప్యానల్ రిపోర్ట్ ఇస్తాయి. ఈ రిపోర్ట్ ద్వారా ఒంట్లో క్రొవ్వు గురించి ఓ అవగాహన తెచ్చుకోవచ్చు. శరీరంలో క్రొవ్వు శాతం, వాటిలో లో డెన్సిటీ లిపో ప్రోటీన్స్, హై డెన్సిటీ లిపో ప్రొటీన్స్, ట్రై గ్లిజరాయిడ్స్ తో కూడిన వివరాలు అందిస్తారు. ఈ లో డెన్సిటీ, హై డెన్సిటీ లిపో ప్రొటీన్స్ గురించి తెలుసుకుంటే శరీరానికి గుండెజబ్బుల ప్రమాదం ఎంత అనేది అంచనా వేయవచ్చు.
క్రొవ్వు శరీరానికి అవసరమైన పోషకపదార్ధం. మనం తీసుకునే ఆహారంలో విటమిన్లు శోషించుకోవడానికి, శరీరంలో వేడి బయటకు పోకుండా కాపాడటానికి, జీవక్రియలు సక్రమంగా జరగడానికి, చర్మం, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండటానికి.. ఇలా అనేక ప్రక్రియలు సజావుగా సాగాలంటే శరీరంలో క్రొవ్వులు అవసరం. అయితే అ క్రొవ్వులు సరిపడినంత మాత్రమే ఉండాలి. లిపిడ్ ప్యానెల్ రిపోర్ట్ ద్వారా మన శరీరంలో అవసరమైనంత స్థాయిలో కొవ్వు నిల్వలున్నాయా లేక అధికంగా ఉన్నాయా అనేది తెలుస్తుంది. లిపిడ్ ప్యానెల్ రిపోర్ట్లో ముందుగా కనిపించేది టోటల్ కొలస్ట్రాల్ లెవల్. శరీరంలో కొవ్వు ఎంత మేర ఉంది అనేది దీని ద్వారా తెలుస్తుంది. సాధారణంగా ఒక డెసిలీటర్ రక్తంలో రెండొందల మిల్లీగ్రాముల కొవ్వులు ఉండవచ్చు. రెండొందల నుంచి 240 మిల్లీ గ్రాముల వరకు కొవ్వు నిల్వలు ఉంటే కాస్త జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. అంతకు మించితే మాత్రం మందులు వాడుతూ, ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది.
లిపిడ్ ప్యానెల్లో బాగా పరిశీలించాల్సింది హై డెన్సిటీ లిపో ప్రొటీన్స్.. దీన్నే హెచ్డీఎల్ అంటారు. శరీరంలో మంచి కొవ్వులు ఏ మేరకు ఉన్నాయి అనేది దీని గణాంకాలు చెబుతాయి. మంచి కొవ్వు శరీరంలో బాగా ఉంటే.. అది చెడు కొవ్వును రక్తం నుంచి కాలేయానికి చేర్చుతుంది. అక్కడ ఆ కొవ్వు శక్తిగానూ, మలినాలుగానూ మారి విసర్జనకు తయారవుతుంది. దీని వలన ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు ఉండదు. ఈ హెచ్డీఎల్ అనేది 60mg/dl లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అంటే ఒక డెసీ లీటరు రక్తంలో 60 మిల్లీ గ్రాముల మంచి కొవ్వు ఉండాలి. ఇంతకంటే తగ్గితే అనారోగ్యాలకు స్వాగతం పలికినట్టే. సాధారణంగా 59 నుంచి 41 మిల్లీగ్రాముల పర్ డెసిలీటర్ చూపిస్తే ప్రమాదం ఇప్పటికిప్పుడు లేకపోయినా మున్ముందు అనారోగ్యం రాబోతున్నట్టు అర్ధం. ఈ లెవల్లో ఉన్నవాళ్లు మందులు, డైట్ నియమాలు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇక నలభై ఎం.జిలోపు హెచ్డీఎల్ ఉంటే ప్రమాదంలో ఉన్నట్టే. ఇలాంటివారికి ఏ క్షణం గుండెపోటు వస్తుందో చెప్పలేని పరిస్థితి. వెనువెంటనే వైద్యులు చర్యలు ప్రారంభిస్తారు. ఇక లిపిడ్ ప్యానెల్ రిపోర్ట్లో గమనించాల్సిన మరో ముఖ్యమైన అంశం ఎల్డీఎల్…. లో డెన్సిటీ లిపో ప్రొటీన్స్. వీటినే సామాన్యంగా చెడు కొవ్వులు అంటారు. మంచి కొవ్వులకు వ్యతిరేకదిశలో వీటి పనితీరు ఉంటుంది. ఇవి ఎంత ఎక్కువ ఉంటే అనారోగ్యానికి అంత దగ్గరగా ఉన్నట్టు భావించాలి. సాధారణంగా ఎల్డీఎల్ స్థాయి వంద కంటే తక్కువ ఉండాలి. అంటే ఒక డెసిలీటర్ రక్తంలో వంద మిల్లీగ్రాముల చెడు కొవ్వు మాత్రమే ఉండాలి. అప్పుడే శరీరం పనితీరు చక్కగా ఉంటుంది. ఎటువంటి అనారోగ్యం లేని వారికి ఈ ఎల్డీఎల్ స్థాయి వంద కంటే ఓ ఇరవై మిల్లీ గ్రాములు ఎక్కువున్నా ఫర్వాలేదు. అంటే ఎల్డీఎల్ 120 నుంచి 130 వరకు ఉంటే ఆందోళన చెందాల్సిన పనిలేదు. అయితే జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించాలి.
ఎల్డీఎల్ 130 నుంచి 160 వరకు ఉంటే ప్రమాదం పొంచి ఉన్నట్టుగా భావించాలి. వీలయినంత త్వరగా డైట్లో మార్పులు చేసి ఆరోగ్యాన్ని చక్కదిద్దుకోవాలి. ఇక ఎల్డీఎల్ 160 నుంచి 190 మధ్య ఉంటే తీవ్ర ప్రమాదంలో ఉన్నట్టే. 190 పాయింట్లు కంటే ఎక్కువుంటే మాత్రం వైద్యుల పర్యవేక్షణలో ఉండటమే శ్రేయస్కరం. లిపిడ్ ప్యానెల్ టెస్ట్లో గమనించాల్సిన నాలుగో అంశం ట్రైగ్లిజరాయిడ్స్. ఇవి శరీరంలో ఏ మేర ఉన్నాయి అనేది కూడా ముఖ్యమే. మనం తినే ఆహారంలో ఎక్కువ కొవ్వు పదార్ధాలు, మద్యపానం అలవాటు ఉంటే ఈ ట్రైగ్లిజరాయిడ్స్ ఎక్కువ ఉంటాయి. వీటి లెవల్స్ 150 వరకు ఉండవచ్చు. 150 నుంచి 200 వరకు ఉంటే కాస్త జాగ్రత్తలు పాటించడం మంచిది. 200 నుంచి 500 వరకు ట్రై గ్లిజరాయిడ్స్ ఉంటే ప్రమాదంగానూ, 500 కంటే ఎక్కువగా ఉంటే అత్యంత ప్రమాదకరస్థితిగానూ పరిగణిస్తారు. రక్తంలో ట్రైగ్లిజరాయిడ్స్ పెరిగేకొద్దీ కరోనరీ ఆర్చరీ అనే వ్యాధి తీవ్రత పెరుగుతుంది. దీని ప్రభావంతో రక్తనాళాలు గట్టిపడిపోతాయి. ఫలితంగా రక్తసరఫరాలో ఇబ్బందులు తలెత్తుతాయి. రక్తపరీక్షలో ఈ కొవ్వు నిల్వల పరిమాణం గమనించిన తరువాత వైద్యులు వ్యక్తి కుటుంబ ఆరోగ్యం గురించి ఆరా తీస్తారు. గతంలో వారి కుటుంబంలో ఎవరికైనా మధుమేహ వ్యాధి, గుండె జబ్బులు, ఊబకాయం ఉందా? అనే వివరాలతో పాటు వయస్సు, తీసుకునే ఆహారం, రోజూవారీ చేసే పనులు, ధూమపానం అలవాటు, ఇప్పటికే ఏదైనా అనారోగ్యం ఉందా ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తగు సూచనలు ఇస్తుంటారు.
రక్తపోటు, గుండెజబ్బులు లాంటి అనారోగ్యం ఎదురైనప్పుడు వైద్యులు ఈ లిపిడ్ ప్యానెల్ రిపోర్ట్ పరీక్షిస్తారు. అయితే అంతకంటే ముందు ఎవరికి వారు శరీరంలో కొవ్వు గురించి తెలుసుకుంటే అసలు వైద్యుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి నాలుగు నుంచి ఐదేళ్లకోసారి లిపిడ్ ప్యానెల్ పరీక్ష చేయించుకోవాలి. అందులో వివరాల్ని బట్టి ఆహారంలో, జీవనవిధానంలో ఎలాంటి మార్పులు తెచ్చుకోవాలి లేదా వైద్యుల సూచనలతో ఏదైనా మందులు వాడాలా అనేది నిర్ణయించుకోవచ్చు.
శరీరంలో కొవ్వు నిల్వలు, వాటివలన ఇబ్బందులు తలెత్తితే ఎవరికి వారుగా ఆహారంలో మార్పులు చేసుకునే వీలు కూడా ఉంటుంది. సాధారణంగా కొవ్వు అనేది మనిషికి అవసరమే. ఒక గ్రాము కొవ్వు 9 కిలో క్యాలరీల శక్తి విడుదల చేస్తుంది. మనం ఆహారం తీసుకోనప్పుడు, ఏదైనా అనారోగ్యం పాలయినప్పుడు ఈ కొవ్వుల నుంచే శరీరానికి శక్తి అందుతుంది. అలాగే జీవక్రియలకు కావాల్సిన శక్తిని అందించేది, విటమిన్లు శోషించుకోవడానికి ఉపకరించేది కొవ్వే. అయితే శరీరంలో మంచి కొవ్వు మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. సాధారణంగా జంతువుల నుంచి తయారుచేసుకునే ఆహారంలో ఉండే కొవ్వు చెడు కొవ్వుగా మారుతుంది. కాబట్టి మాంసాహారం వీలయినంత తగ్గించాలి. అయితే చేపల్లో మాత్రం ఓమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి. అలాగే ప్రొద్దు తిరుగుడు, ఆలివ్ నూనెలు మంచి కొవ్వుగానే మారతాయి. వీటితో పాటు బాదం, ఆక్రూట్ లాంటివి కూడా కూడా ఆరోగ్యాన్ని పెంచుతాయి.
గుడ్లు, విటమిన్ సి పుష్కలంగా దొరికే పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే తినే ఆహారానికి, శరీరం చేసే కష్టానికి మధ్య సమతుల్యం ఉండాలి. నేటికాలంలో చాలా మంది శరీరంతో తక్కువ పని, మెదుడుతో ఎక్కువ పనిచేస్తున్నారు. దీంతో ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయి… శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోతున్నాయి. కాబట్టి సరైన ఆహార నియామాలు పాటిస్తూ, వ్యాయామానికి, శారీరిక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వాలి. రోజూ కనీసం ఇరవై నుంచి ముఫ్ఫై నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. అలాగే ప్రతి నాలుగు నుంచి ఐదేళ్లకోసారి లిపిడ్ ప్యానెల్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని ముందే పసిగట్టవచ్చు.
అతి ఎక్కడైనా అనర్ధమే. అలాగే అసలు లేకపోయినా ప్రమాదకరమే. మన ఒంట్లో కొవ్వుకు కూడా ఈ మాటలు వర్తిస్తాయి. తీసుకునే ఆహారంలో కొవ్వు లేకపోతే శరీరం అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంది. అలా అని కొవ్వు కలిగిన ఆహారపదార్ధాలే తింటే.. అది చెడు కొవ్వులుగా మారి గుండెకే ఎసరు పెడుతుంది. కాబట్టి శరీరంలో కొవ్వు స్థాయిలో సమతుల్యంతో ఉంటే.. శరీరం చలాకీగా ఉంటుంది.