ఆరోగ్యంగా ఉండాలంటే బరువు నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కానీ ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల కారణంగా ఇది సాధ్యం కావడం లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకులు, పరుగులతో జీవితం గడిచిపోతోంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాల్సిన సమయంలో … చాలా మంది ఫాస్ట్ ఫుడ్ తీసుకుంటున్నారు. రోజూ చేయాల్సిన వ్యాయామాన్ని వాయిదా వేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే .. సమయం సరిపోక ఎక్సర్ సైజ్ చాలా వరకు తగ్గించేశారు. దీని కారణంగా శరీరంలో ఫ్యాట్ పెరిగిపోతోంది. దీంతో బరువు పెరిగి ఊబకాయం బారిన పడుతున్నారు. స్థూలకాయం కారణంగా అన్ని జీవక్రియలకు ఇబ్బంది ఏర్పడి అనారోగ్యం పాలవుతున్నారు. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే బరువు నియంత్రణలో ఉంచుకోవాల్సిందేనని వైద్యులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఆరోగ్యకరమైన బరువు కొనసాగించేందుకు మనకు మనమే కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు.
బరువు నియంత్రణలో ఉండాలంటే ముఖ్యంగా చేయాల్సింది సమతుల ఆహారం తీసుకోవడం. ఏది పడితే అది.. ఎంత పడితే అంత తినకుండా మనకు కావాల్సిన విటమిన్లు, ప్రొటీన్లు, ఖనిజ లవణాలు, పిండిపదార్థాలు, పీచు పదార్థాలు.. శరీరానికి సమపాళ్లలో అందేలా ఆహారం తీసుకోవాలి. తీసుకునే ఆహార పదార్థాల పరిమాణం కూడా ఎప్పటికప్పుడు గణించుకోవడం అవసరం. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు రోజూ.. తమ ఫుడ్ లో 500 కేలరీల వరకు తక్కువగా తీసుకునేలా చూసుకోవాలి.
ఈ మధ్య చాలా మంది చిప్స్, బిస్కట్స్ లాంటి స్నాక్స్ కు బాగా అలవాటు పడ్డారు. కొంచెం ఆకలి అనిపించగానే షాపులకు వెళ్లి చిప్స్, బిస్కట్లు కొనుక్కుని లాగించేస్తున్నారు. దీని వల్ల ఒంట్లో కొవ్వు శాతం పెరిగిపోయి స్థూలకాయం వచ్చేస్తుంది. కాబట్టి చిప్స్ లాంటి స్నాక్స్ కు బదులుగా పండ్లు తీసుకుంటే మంచిది.
చిరు ధాన్యాలు, మొలకెత్తిన విత్తనాలు, తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. ఇవి తీసుకోవడం వల్ల శరీరానికి పీచు , తగినంత నీరు లభిస్తుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉన్నవి తీసుకుంటే త్వరగా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఫలితంగా ఎక్కువ తినకుండా ఉంటాం. పీచు, ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు .. మెల్లమెల్లగా జీర్ణం అవుతాయి. దీని వల్ల త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది.
వాయిస్: మనం తీసుకునే ఆహారంలో కేలరీపైనా కచ్చితంగా దృష్టిసారించాలి. వీలైనంత వరకు తక్కువ కేలరీలు తీసుకుంటేనే ఆరోగ్యకరమైన బరువును కొనసాగించవచ్చు. తక్కువ కేలరీలు ఉండే విధంగా ఆహారాన్ని వండుకోవాలి. పాల పదార్థాల ద్వారా మనకు ఎక్కువ కేలరీలు లభిస్తాయి. ఐతే ఫ్యాట్ తక్కువగా ఉన్న పాలు, చీజ్ తీసుకోవడం మంచిది. వెన్న, నెయ్యితో చేసిన పదార్థాలు తగ్గించుకోవాలి. ఈ రెండింటితో ఆహారాన్ని వండుకోవాల్సి వచ్చినప్పుడు ..వాటి స్థానంలో ఆవాల నూనె, ఆలివ్ నూనె వేసుకుంటే మంచిదంటున్నారు న్యూట్రీషియన్స్ . శరీరానికి మంచి బ్యాక్టీరియా అందించి.. జీర్ణక్రియలో సహాయ పడే పెరుగు తీసుకోవాలి.
వాయిస్: సోడాలు, కూల్ డ్రింక్స్ లాంటి శీతలపానీయాలు లేదా ప్యాకేజీల్లో లభించే పళ్ల రసాలు, స్పోర్ట్స్ డ్రింక్స్ శరీరానికి అస్సలు మంచివి కావు. వీటి వల్ల అనవసర బరువు విపరీతంగా పెరిగిపోతుంది. ఈ పానీయాల్లో రుచి కోసం చక్కెరను విరివిగా వాడతారు తయారీదారులు. కాబట్టి అవి తీసుకున్నప్పుడు శరీరంలో చక్కెర నిల్వలు విపరీతంగా పెరిగి స్థూలకాయం బారిన పడతాం. ఐతే వీటిని తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తే చాలా తక్కువ పరిమాణంలో తీసుకుని…ఎక్కువ నీరు తాగడం మేలు. లేదా శీతలపానీయాల జోలికి వెళ్లకుండా తక్కువ ఫ్యాట్ ఉన్న పాలు తాగితే మరీ మంచిదని న్యూట్రీషియన్స్ చెబుతున్నారు.
ఉదయం అల్పాహారం.. శారీరక మెటబాలిజానికి ఇంధనంలా పని చేస్తుంది. దీని వల్ల రోజంతా మనకు శక్తి లభిస్తుంది. ఐతే చాలా మంది బ్రేక్ ఫాస్ట్ తీసుకోకుండా వదిలేస్తున్నారు. దీని వల్ల ఉదయం దాటిన తర్వాత ఆకలి వేస్తుంది. దీంతో ఎక్కువ ఆహారం తీసుకునే అవకాశం ఉంది. ఫలితంగా స్థూలకాయం వచ్చేస్తుంది. అందుకే ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాల్సిన సమయంలో తీసుకుంటేనే మంచిది. అలాగే ఆకలి వేసిన సమయంలోనే ఆహారం తీసుకోవాలంటున్నారు న్యూట్రీషియన్స్. అదే సమయంలో గాబగా.. ఆబరాగా తినడం మంచిది కాదని సూచిస్తున్నారు. ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు స్పీడ్ స్పీడ్ గా లాగించేయడం వల్ల ఎక్కువ తినే అవకాశం ఉంది. కడుపు నుంచి మెదడుకు సంకేతాలు అందే వరకు మనకు దాదాపు 15 నిముషాల సమయం పడుతుంది. ఐతే ఈ లోపే మనం స్పీడ్ స్పీడ్ గా తినేస్తే .. ఎక్కువ ఆహారాన్ని కడుపులోకి తోసేసినట్లే లెక్క.
బరువు నియంత్రణలో ఉంచుకోవాలని మనసులో బలంగా ఉన్న వారు .. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తారు. ఐతే కొంత మంది అతి శ్రద్ధ చూపిస్తున్నారు. తెలుసుకున్నవన్నీ త్వరత్వరగా చేయాలన్న ఆతురత వారిలో ఉంటుంది. ఇది ఒక్క రోజులో సాధ్యమయ్యే పని కాదు కాబట్టి.. ఇలాంటి వాటిని రోజు అలవరచుకోవాలి. ముందుగా చిన్న చిన్న లక్ష్యాలతో మొదలు పెట్టి.. క్రమంగా పూర్తి హెల్దీ డైట్ చార్ట్ ను రూపొందించుకోవడం అవసరం. అలాగే వ్యాయామం చేయమనగానే ఈ రోజే కిలోమీటర్ల దూరం పరుగెత్తడం.. పెద్ద పెద్ద బరువులు ఎత్తడం కూడా మంచిది కాదు. క్రమంగా రోజూ వ్యాయామ సమయాన్ని పెంచుతూ పోవాలి.
తిండి, వ్యాయామంతోపాటు మరో ముఖ్య విషయం .. కూడా గుర్తుంచుకుంటే బరువు నియంత్రణలో సహాయ పడుతుంది. అదే శారీరక శ్రమ . రోజూ మనకు కచ్చితంగా తగినంత శారీరక శ్రమ ఉండాలి. ఒకవేళ శారీరక శ్రమ తగ్గితే .. అనవసర బరువు పెరుగుతామని గుర్తుంచుకోవాలి. గంటలు గంటలు టీవీ ముందు కూర్చోవడం.. కంప్యూటర్ ముందు పని చేయడం మంచిది కాదంటున్నారు వైద్యులు. కాబట్టి.. టీవీ చూస్తున్నా.. కంప్యూటర్ లో పని చేస్తున్నా.. కొద్ది సేపు లేచి అటు ఇటూ నడవాలని సూచిస్తున్నారు.