Signs of Anemia – రక్తహీనత—కారణాలు, లక్షణాలు, చికిత్స

By manavaradhi.com

Published on:

Follow Us
Anemia: Symptoms, Causes & Treatment

రక్తహీనత .. వైద్య పరిభాషలో దీన్ని ఎనీమియా అంటారు. శరీరంలో తగినంత ఆరోగ్యకరమైన ఎర్రరక్తకణాలు లేనప్పుడు రక్తహీనత అభివృద్ధి చెందుతుంది. సాధారణంగా ఎర్రరక్తకణాలు ఆక్సిజన్ ను శరీరంలోని అన్ని అవయవాలకు అందిస్తాయి. ఎర్ర రక్తకణాలకు ఎరుపు అందించే ప్రొటీన్ హిమోగ్లోబిన్ తగినంత లేకపోవడం వల్ల కూడా రక్తహీనత సమస్య వస్తుంది.

రక్తహీనత సమస్య ఉన్న వారిలో కొన్ని లక్షణాల ఆధారంగా సులభంగా గుర్తు పట్టవచ్చు. వారు బాగా విశ్రాంతి తీసుకున్నప్పటికీ తరచుగా నీరసపడుతుంటారు. అంటే శరీరంలో శక్తి సన్నగిల్లుతూ ఉంటుంది. రోజువారీ పనులకు కూడా త్వరగా అలసిపోతారు. చేయాల్సిన పనులపై ధ్యాస ఉండదు. రక్తహీనత ఉన్నవారిలో విపరీతమైన తలనొప్పి ఉంటుంది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఛాతీలో నొప్పి వస్తుంటుంది. చేతులు, కాళ్లు చల్లగా తయారవుతాయి. ఒళ్లంతా చెమటలు పట్టేస్తుంది. ముఖ్యంగా శరీర భాగాలకు ఆక్సిజన్ తక్కువగా అందడం వల్ల . . హృదయ సంబంధ సమస్యలు కనిపిస్తాయి. ఆక్సిజన్ సరఫరాలో లోపం వల్ల గుండె మరింత ఒత్తిడితో పని చేయాల్సి వస్తుంది.

ఎనీమియా సమస్య మహిళలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారిలో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మహిళల్లో అధిక రుతుస్రావం కారణంగా రక్తం ఎక్కువగా కోల్పోవాల్సి వస్తుంది. గర్భం దాల్చినప్పుడు కూడా మహిళల్లో రక్తం పరిమాణంలో తేడాలు వస్తాయి. ఇక కిడ్నీ సమస్యలు ఉన్న వారిలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. అలాగే డైట్ లో ఇనుము, ఫోలేట్, విటమిన్ B12 తీసుకోని వారిలోనూ రక్తహీనత వచ్చే అవకాశం ఉంది. కొంత మందిలో వంశపారంపర్యంగా కూడా రక్తహీనత సమస్య రావచ్చు.

పిల్లలు, యువతీ యువకుల్లో ఐరన్ డెఫీషియెన్సీ అంటే ఇనుము ధాతు లోపం వల్ల ఎనీమియా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా యువతుల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది. బుతుక్రమంలో ఎక్కువ రక్తం పోవడం వల్ల వారు ఈ సమస్యను ఎదుర్కొంటారు. అలాగే చిన్న పిల్లల్లోనూ ఈ సమస్య అధికం . చిన్న పిల్లల్లో ఈ సమస్యను సులభంగా గుర్తించవచ్చు. వారు గోడకు ఉన్న పెయింట్ తినడం , మట్టి తినడం చేస్తుంటారు. చిన్న పిల్లల్లో ఈ సమస్యను గుర్తించిన వెంటనే సరైన చికిత్స చేయించాలి. లేనిపక్షంలో వారికి క్రమంగా బుద్ధి మాంధ్యం వచ్చే అవకాశం ఉంది.

Composition with food products rich in iron.

వివిధ వైద్య పరీక్షల ద్వారా రక్తహీనత సమస్యను గుర్తించవచ్చు. రక్తం పరిమాణాన్ని పరీస్తే ఎనిమీయా పరిస్థితి తెలుస్తుంది. ముఖ్యంగా హిమోగ్లోబిన్ పరిమాణాన్ని పరీక్షల్లో నిర్ధారిస్తారు. రక్తంలో ఇనుము ధాతును కూడా పరీక్షించి తెలుసుకోవచ్చు. రక్త కణాలు అసాధారణంగా పెరుగుతున్నా వాటి నిర్మాణం అస్తవ్యస్తంగా ఉన్నా ఎనీమియా వచ్చిందని అర్థం. ఐతే దీన్ని బోన్ మ్యారో టెస్ట్ ద్వారా నిర్ధారించుకోవచ్చు. రక్తహీనతను నివారించేందుకు రకరకాల వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఐరన్ సప్లిమెంట్లను వైద్యులు సూచిస్తారు. ఒకవేళ పరిస్థితి మరీ దయనీయంగా ఉంటే .. అలాంటి రోగులకు కొత్త రక్తం ఎక్కిస్తారు. ఐతే వీలైనంత వరకు ఆహార పదార్థాల ద్వారానే రక్తహీనత నివారించుకోవాలని సూచిస్తారు. ముఖ్యంగా ఐరన్ ఎక్కువగా లభించే కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. పాలు, పాల ఉత్పత్తులు కూడా శరీరంలో ఇనుము ధాతును పెంచుతాయి. అలాగే విటమిన్ B12, ఫోలేట్ లభించే కూరగాయలు, పండ్లు , ధాన్యాలు తీసుకోవాలి. దీంతో రక్తహీనతను సులభంగా నివారించుకోవచ్చు.

ఎనీమియా సమస్య .. ఇతర అనారోగ్యాలకు కారణమవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలసట , నీరసం .. అనిపిస్తే .. వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటే మంచిది. ఒక వేళ రక్తహీనత అని నిర్ధారణ అయితే . . తప్పనిసరిగా తగిన మందులు , వైద్యుల సలహాలు పాటించాలి.

Leave a Comment